లివర్‌ సిరోసిస్‌ దూరంగా ఉండండి

ఆంధ్రజ్యోతి, 02-10-13:  కాలేయ సమస్యల్ని తేలిగ్గా తీసుకోవడం చాలా ప్రమాదం. కానీ, ఇతర అనారోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేసినట్టే కాలేయ వ్యాధులను కూడా అశ్రద్ధ చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాలేయ వ్యాధుల్లో అతి ప్రమాదకరమైన లివర్‌ సిరోసిస్‌ మొదలైతే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇది ప్రాణాలకే హాని కలిగిస్తుంది. ఈ సమస్య విషయంలో ముందుగానే జాగ్రత్త పడితే దీని నుంచి దూరంగా ఉండవచ్చు. ప్రధాన అవయవాల్లో ఒకటైన కాలేయాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవడం జీవితానికి ఎంతో అవసరమని అంటున్నారు వైద్యులు. ఇంతకూ లివర్‌ సిరోసిస్‌ అంటే ఏమిటి? 

 
కాలేయ సమస్యల్లో ప్రధానంగా రెండు రకాలుంటాయి. వాటిలో ఒకటి తరుణ సమస్య. రెండోది దీర్ఘకాలిక సమస్య. ఈ రెండింటికి ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే..ప్రారంభ దశలోనే తరుణ సమస్యలు బయటపడితే, దీర్ఘకాలిక సమస్యలు మాత్రం చాలా కాలానికి బయటపడతాయి. వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల గానీ, నీటితో సంక్రమించే వ్యాధుల వల్ల గానీ కాలేయం దెబ్బతినడాన్ని తరుణ సమస్య అంటారు. ఈ తరుణ సమస్యలకు హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-ఇ, సమస్యలు కారణం. కొన్నిసార్లు హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి కూడా కాలేయంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. హెపటైటిస్‌ సమస్యల్లో ప్రధానంగా ఆకలి లేమి, ఒంటి నొప్పులు, జ్వరం, మూత్రం పసుపు రంగులోకి మారడం, మలం తెలుపు రంగులోకి మారడం వంటి లక్షణాలతో పాటు కామెర్ల వ్యాధి సంభవించే ప్రమాదం కూడా ఉంది. కానీ తగిన సమయంలో డాక్టర్‌ను సంప్రదిస్తే కాలేయ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తెలిసిపోతాయి. అయితే, దాన్ని మించిపోవడమే లివర్‌ సిరోసిస్‌. ఇందులో సగానికి పైగా కాలేయం దెబ్బతినేంత వరకూ తెలియదు. ఇతర అనారోగ్యాలకు చేసిన పరీక్షల్లో అది బయటపడవచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలేయాన్ని దెబ్బతీసే కొన్ని అలవాట్ల విషయాల్లో జాగ్రత్త పడితే చాలు, కాలేయం ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం ఉన్నవారు, అతిగా మద్యం తాగేవారు, కొలస్ట్రాల్‌ ఉన్నవారు కాలేయం దెబ్బతినే పరిస్థితిని ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాంటి వాళ్లు ఏడాదికోసారి లివర్‌ ఫంక్షన్‌టెస్ట్‌ అలా్ట్రసైండ్‌ పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఏ సమస్య ఉన్నా తెలిసిపోతుంది. కొందరిలో కాలేయం దెబ్బతిన్న సంగతి ఆలస్యంగా బయటపడుతుంది. దీర్ఘకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నవాళ్లకు ఈ సమస్య ఎదురవుతుంది. ఇక చాలా కాలంగా కాళ్ల వాపులున్నవారు, పొట్ట ఉబ్బిపోవడం, రక్తవాంతులు కావడం వంటి లక్షణాలతో మరికొంత మంది క్రమంగా బయటపడతారు. ఈ లక్షణాలు కనిపించినవారంతా కాలేయ సమస్యగా అనుమానించి వైద్య నిపుణులను సంప్రదించాలి. ఈ లక్షణాలు కనిపించాయంటే లివర్‌ సిరోసిస్‌ వ్యాధి మొదలైందనే అర్థం. 
నివారణ
ఇందులో రెండు విషయాలు జాగ్రత్తగా పాటించాలి. సిరోసిస్‌ తాలూకు దుష్ప్రభావాలు నియంత్రించడం ఒకటైతే, దెబ్బతిన్న కాలేయం మరింత దెబ్బతినకుండా అవసరమైన వైద్య చికిత్సలు చేయించుకోవటం మరొకటి. ఈ రెండు వెంట వెంటనే చేయాలి. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి చేయాల్సిందే. నియంత్రణ ఎలాగంటే... మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతిందని తెలిస్తే.. మద్యం మానేయడం. అలా చేస్తే కాలేయం తిరిగి చక్కబడే అవకాశాలు కొంత మేర ఉంటాయి. అంతేకాదు, భవిష్యత్తులో ఇది మరింత దెబ్బతినకుండా అరికట్టవచ్చు. స్థూలకాయులు బరువు తగ్గించుకోవడం ద్వారా, రక్తపోటు, మధుమేహం వ్యాధులను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా కాలేయ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ఇక తరచూ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి మార్గం. 
జాగ్రత్త చర్యలు
 తీసుకునే ఆహారం ఎంత తాజాగా ఉంటే కాలేయం అంత ఆరోగ్యంగా ఉంటుంది. రసాయనాలతో పండించిన ఆహారం కాకుండా సేంద్రియ ఎరువులతో పండించిన ఆహారం తీసుకుంటే ఇంకా మంచిది. 
 వేపుళ్లు, ప్రిజర్వేటివ్స్‌ వేసి నిల్వ చేసిన పదార్థాలు కాలేయానికి హాని చేస్తాయి.
 ఫ్యాటీలివర్‌ సమస్య, కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
 ఇంటి వంటలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
 కాచి వడపోసిన నీరు లేదా ఫిల్టర్‌ వాటర్‌ మాత్రమే తాగాలి.
 సొంత వైద్యంతో చేతికందిన మందులు వేసుకోవద్దు.
 శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలను వ్యాయామం, మసాజ్‌ల ద్వారా తొలగించుకోగలిగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
 పొగతాగడం పూర్తిగా మానెయ్యాలి. మద్యపానం హద్దు మీర కూడదు.
  హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-బి నివారణ టీకాలను విధిగా తీసుకోవాలి.