కాలేయాన్ని కాపాడుకుందాం!

30-10-2017:కాలేయం అనారోగ్యం పాలవటానికి ప్రధాన కారణాలు ఎన్నో! మద్యపానంతోపాటు హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సిలు కాలేయ సామర్ధ్యాన్ని కుంటుపరిచి, ఆరోగ్యాన్ని హరిస్తాయి. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యాధి సోకకుండా అప్రమత్తంగా ఉండటంతోపాటు, సకాలంలో వ్యాధిని గుర్తించి సత్వర చికిత్స తీసుకోవటం ఎంతో అవసరం.

 
హెపటైటిస్‌ సోకే అవకాశాలు ఇవే!
రక్తం, శారీరక కలయిక, తల్లి నుంచి పసికందుకు ప్రసవం ద్వారా, శుభ్రం చేయని వైద్య పరికరాలు, శస్త్రచికిత్సలు.
 
హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు
ఆకలి మందగించటం, కామెర్లు, కడుపుతో వికారం, వాంతులు, కళ్లు, మూత్రం పసుపు రంగులోకి మారటం లాంటి లక్షణాలు ఉంటాయి. అరుదుగా కొందరిలో ఈ లక్షణాలేవీ కనిపించవు.
 
హెపటైటిస్‌ వైరస్‌ ప్రభావం
హెపటైటిస్‌ బి, సి వైర్‌సలు దీర్ఘకాలికమైనవి. ఇవి కాలేయంపై దాడి చేసి కాలేయ వ్యాధులను కలుగజేస్తాయి. సమర్ధమైన చికిత్స తీసుకోకపోతే లివర్‌ సిర్రోసిస్‌, లివర్‌ క్యాన్సర్లకు కూడా దారి తీస్తాయి. ఈ వైర్‌సల కారణంగా కాలేయ కణాలు వాస్తాయి. దాంతో సహజసిద్ధమైన ప్రక్రియలో భాగంగా శరీరం దానంతట అదే ఆ కణాలను మరమ్మత్తు చేసుకుని కాలేయాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే ఇదే పదే పదే జరిగితే కాలేయ కణాలు నశించి ఆ ప్రదేశంలో మచ్చలు ఏర్పడతాయి. వీటి వల్ల కాలేయం గట్టిపడి సిర్రోసి్‌సకు దారి తీస్తుంది. ఈ దశలో కాలేయ సామర్ధ్యం తగ్గుతుంది. సిర్రో‌స్‌ను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు కూడా దారి తీయొచ్చు. కాబట్టి వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధిని ప్రారంభంలోనే అరికట్టవచ్చు.
 
కాలేయాన్ని దెబ్బతీసే ఇతర వ్యాధులు
క్షయ, కీళ్ల వాతం సమస్యలకు వాడే మందుల ప్రభావం వల్ల కూడా కాలేయ వ్యాధులు రావొచ్చు. అలాగే కాలేయంలో కొవ్వు పేరుకున్నా కాలేయ వ్యాధిగ పరిణమించవచ్చు.
 
అప్రమత్తత అవసరం
సేవ్‌ ది లివర్‌ అనే స్వచ్ఛంద సంస్థ రెండె తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సుమారు 20 వేల మందికి నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ శాతం మందికి ఈ వ్యాధి ప్రబలినట్టు తేలింది. హెపటైటిస్‌ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలు ముందు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ వైర్‌సల గురించి అవగాహన ఏర్పరుచుకుని, ప్రతి ఆరు నెలలకోసారి రక్త పరీక్ష ద్వారా హెపటైటిస్‌ లేదని నిర్ధారించుకుంటూ ఉండాలి. హెపటైటిస్‌ సోకితే వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు సమర్థమైన చికిత్స తీసుకోవాలి.
                                                                                                                          
 
 
 
డాక్టర్‌ సోమశేఖర రావు కుదరవల్లి,
సేవ్‌ ది లివర్‌ ఫౌండేషన్‌