కిడ్నీ వ్యాధుల్లో నిర్లక్ష్యంతో ప్రాణహాని

18/03/13

కాసేపు కూర్చుంటే కాళ్ల వాపులు... ఉదయం లేవగానే ముఖమంతా ఉబ్బడం... అరగంట తరువాత వాపులన్నీ తగ్గిపోవడం. చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల, బాగా నిద్రపోవడం వల్ల అలా జరిగిందనుకుంటారు. కానీ ఆ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సంకేతాలు. నిజానికి కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే తరచుగా పరీక్షలు చేయించుకోవడం, కాళ్లవాపులు లాంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ శశికిరణ్‌. 

కిడ్నీలు ముఖ్యంగా మూడు పనులు చేస్తాయి. ఒకటి వ్యర్థపదార్థాలను యూరిన్‌ రూపంలో బయటకు పంపడం, ఎరిథ్రోపయటిక్‌ వల్ల రక్తం ఉత్పత్తిలోనూ, ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయడపటం జరుగుతుంది. కిడ్నీ వ్యాధి వచ్చినపుడు ఒక కిడ్నీపైనే ప్రభావం ఉంటుంది. మరో కిడ్నీ బాగుంటుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే షుగర్‌, హై బీపీ, గ్లోమర్యుల నెఫ్రైటిస్‌ వంటి కారణాల వల్ల వచ్చే  వ్యాధులు రెండు కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. 
ఎవరిలో ఎక్కువ
డయాబెటిస్‌ ఉన్న వారిలో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్న వారిలో కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా కొన్ని రకాల కిడ్నీ జబ్బులు సంక్రమించే అవకాశ ం ఉంది. నొప్పినివారణ మాత్రలు ఎక్కువగా తీసుకునే వారిలో. స్మోకింగ్‌ అలవాటు ఉన్న వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌ జరగడానికి ఆస్కారం ఉంటుంది. 
ఏం జరుగుతుంది?
షుగర్‌ కంట్రోల్‌ లేనప్పుడు రక్తనాళాలు చిన్నగా మారడం వల్ల కిడ్నీలోని గ్లోమర్యులస్‌ దెబ్బతింటుంది. ఫలితంగా నాడ్యులార్‌ స్ల్కిరోసిస్‌ మొదలవుతుంది. దీనివల్ల ప్రొటీన్‌ లీక్‌ ప్రారంభమయి కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. అధిక రక్తపోటు ఉన్నప్పుడు రక్తనాళాలు గట్టిపడిపోయి కిడ్నీ చిన్నగా మారిపోతుంది. ఆర్టీరియోహైలినోసిస్‌, ఆర్టీరియోస్ల్కిరోసిస్‌ జరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గ్లోమర్యుల          నెఫ్రైటిస్‌లో ఇమ్యూన్‌ రియాక్షన్‌ జరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ కిడ్నీపైన దాడి చేయడం మూలంగా ఈ సమస్య తలెత్తుతుంది. గ్లోమర్యులస్‌లో సెల్స్‌ పెరిగిపోయి ఫిల్టరేషన్‌ను ఆపేస్తాయి. ఫలితంగా నెమ్మదిగా కిడ్నీ చెడిపోవడం ప్రారంభమవుతుంది. మూత్రనాళంలో రాయి అడ్డుపడినపుడు మూత్రం కిందకు వెళ్లకుండా తిరిగి కిడ్నీలోకి(బ్యాక్‌ప్రెజర్‌) ప్రవేశిస్తుంది. ఫలితంగా కిడ్నీ దెబ్బతింటుంది. దీన్ని అబ్‌స్ట్రక్టివ్‌ యూరోపతి అంటారు. పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడటం వల్ల ఇంటెస్టీషియమ్‌ దెబ్బతింటుంది. 
నిర్ధారణ
సాధారణ మూత్రపరీక్ష సీయూఈ(కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌)ద్వారా కిడ్నీ వ్యాధులను తెలుసుకోవచ్చు. మూత్రంలో ప్రొటీన్‌ పోతోందా? ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు పోతున్నాయా? అనే విషయాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ప్రొటీన్‌ పోతున్నట్లయితే కిడ్నీలో సమస్య ఉన్నట్లుగా భావించాలి. సీరం క్రియాటినిన్‌ అనే రక్తపరీక్ష ద్వారా కూడా కిడ్నీ వ్యాధులను గుర్తించవచ్చు. సీరం క్రియాటినిన్‌ లెవెల్స్‌ 0.7 నుంచి 1.3 మధ్యన ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కిడ్నీ సమస్య ఉందని భావించాలి. తరువాత అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా కూడా కిడ్నీ సైజు, ఎకోటెక్చర్‌ను గుర్తించవచ్చు. రాళ్లు ఉన్నా గుర్తించవచ్చు. అవసరమైతే బయాప్సీ చేయాల్సి ఉంటుంది. 
లక్షణాలు
కిడ్నీ వ్యాధుల్లో చాలా వరకు లక్షణాలు ఉండవు. ఇతర సమస్యల కోసం ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నప్పుడు కిడ్నీ సమస్య ఉన్నట్లుగా బయటపడుతుంది. అంతే తప్ప లక్షణాల ఆధారంగా వ్యాధిని గుర్తించడం జరగదు. కొందరిలో కాళ్ల వాపులు వస్తుంటాయి. మరికొందరిలో ఉదయం లేవగానే ముఖం అంతా ఉబ్బినట్లుగా ఉంటుంది. అరగంట తరువాత మామూలైపోతుంది. ఇదీ కూడా కిడ్నీ సమస్యను తెలియజేసే లక్షణమే. మూత్రం బాగా వస్తున్నా అది ఎఫెక్టివ్‌ యూరిన్‌ కాదు. ఫలితంగా త్వరగా అలసిపోవడం జరుగుతుంది. రక్తం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనపడటం వల్ల నొప్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
చికిత్స
డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ను నియంత్రించుకోవాలి. బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. బీపీ 130/80 కన్నా తక్కువ ఉండాలి. ఫాస్టింగ్‌ షుగర్‌ 110, పోస్ట్‌ లంచ్‌ షుగర్‌ 150 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇవి రెండు నియంత్రణలో ఉంటే కిడ్నీలు పదిలంగా ఉంటాయి. గ్లోమర్యుల నెఫ్రైటిస్‌ ఉంటే బయాప్సీ చేసి అది ఏ రకమైన నెఫ్రైటిస్‌ అనేది నిర్ధారించుకుని దానికి సంబంధించిన ఇమ్యునో సప్రెసివ్‌ మందులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కిడ్నీలు చిన్నగా అయిపోయాయి. ఇక కరెక్షన్‌ కాదు అనుకున్నప్పుడు వ్యాధి వేగంగా పెరగకుండా చూసుకోవాలి. అంటే డైట్‌ కంట్రోల్‌ చేసుకోవాలి. ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. అంటే నాన్‌వెజ్‌ మానేయాలి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం అంటే పండ్లు, కొబ్బరినీళ్లకు దూరంగా ఉండాలి. పాస్ఫరస్‌ తక్కువగా ఉండే ఆహారంను ఎంచుకోవాలి. దీంతోపాటు రక్తంను మెయిన్‌టేన్‌ చేసుకోవడానికి ఎరిథ్రోపాయటిన్‌ ఇంజెక్షన్‌లు, ఎముకలను కాపాడుకోవడానికి కాల్సిట్రయాల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పనిచేయడం లేదంటే డయాలసిస్‌ అవసరమవుతుంది. అయితే ఎక్కువ రోజులు డయాలసిస్‌తో నెట్టుకురాలేము. అప్పుడు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ తరువాత అందరిలా సాధారణ జీవితం గడపవచ్చు. ఈ ఆపరేషన్‌కు 90 శాతం సక్సెస్‌ రేటు ఉంది. ఒకసారి కిడ్నీ మార్పిడి చేశాక ఆ కిడ్నీ 25 ఏళ్ల పాటు బాగా పనిచేస్తుంది. ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీలు పదిలంగా కాపాడుకోవడం మంచిదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 
 
డా. ఎ. శశికిరణ్‌
నె ఫ్రాలజిస్ట్‌
యశోద హాస్పిటల్‌
మలక్‌పేట్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 98489 73176