ఆధునిక వైద్యంతో కిడ్నీ వ్యాధి కాదు ప్రాణాంతకం

05/03/13

 
మూత్రపిండాల వ్యాధి వస్తే జీవితం ఇక అంతమైనట్లేనని చాలా మంది భావిస్తారు. అయితే అది అపోహ మాత్రమే. కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా ఇతరుల లాగే సంపూర్ణ జీవితాన్ని కొనసాగించవచ్చు. కిడ్నీ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాలసిస్‌, కిడ్నీ మార్పిడి అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? అందుకు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలు ఏమిటి? తదితర అంశాలపై తాము అందచేస్తున్న చికిత్సలను వివరిస్తున్నారు డక్కన్‌ హాస్పటల్స్‌కు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ కె.ఎస్‌. నాయక్‌.
 
మూత్రపిండాల వ్యాధి రావడానికి ముందుగానే శరీరం కొన్ని ముఖ్యమైన సూచనలు అందచేస్తుంది. ఈ లక్షణాలను, సూచనలను ప్రాతిపదికగా తీసుకుని కిడ్నీ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారణకు రావచ్చు. కాలు వాపు, ముఖం వాపు, మూత్ర విసర్జన తగ్గడం, ఆకలి లేకపోవడం, ఉదయం నిద్రలేచిన వెంటనే కడుపులో వికారంగా ఉండి వాంతి వచ్చినట్లు ఉండడం, పగటి సమయం కూడా అది కొనసాగడం, మగతగా ఉండడం, పగలు నిద్రరావడం, రాత్రి నిద్రపట్టకపోవడం వంటి సూచనలు ఉన్నప్పుడు బ్లడ్‌ యూరియా క్రేట్‌ పరీక్ష ద్వారా కిడ్నీ వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. కిడ్నీ ద్వారా బయటకు వెళ్లవలసిన వ్యర్థ పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నదీ లేనిదీ ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. వ్యర్థ పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయంటే అది కిడ్నీ వ్యాధిగా పరిగణించాల్సి ఉంటుంది. అనంతరం అలా్ట్రసౌండ్‌ స్కాన్‌, హిమోగ్లోబిన్‌ రిపోర్ట్‌ చూసి ఈ సమస్య దీర్ఘకాలంగా ఉన్నదా లేక కొత్తగా ఈ సమస్య తలెత్తిందా అన్న విషయం తేల్చుకోవచ్చు. ప్రాథమిక దశలో కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే మందులతో నయమయ్యే అవకాశాలు ఉంటాయి. మందులతో నయం కాని పక్షంలో అది తీవ్రరూపంగా మారుతుంది. కొందరికి హైబిపి, డయాబెటిస్‌ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు కిడ్నీ పైన వాటి ప్రభావం మెల్లమెల్లగా మొదలై చివరకు వ్యాధి తీవ్రతరం అవుతుంది.
 
డయాలసిస్‌ ఎప్పుడు చేయాలి?
ముందుగా కిడ్నీ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నదీ, లేనిదీ నిర్ధారించుకున్న తర్వాతే చికిత్స మొదలవుతుంది. లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉంటే మందుల ద్వారా, ఆహార నియంత్రణ ద్వారా వ్యాధిని నివారించవచ్చు. కాలువాపు, ఆయాసం వంటి లక్షణాలు తీవ్రంగా ఉండి మందులు తీసుకున్నప్పటికీ మూత్ర పరిమాణం పెరగని పక్షంలో డయాలసిస్‌ చేపట్టాల్సి వస్తుంది. ఆహార నియంత్రణ ద్వారా శరీరంలో పొటాషియం పరిమాణం తగ్గని పక్షంలో అది గుండెపై ప్రభావం చూపిస్తుంది. మూత్రంలో యాసిడ్‌, యూరియా పరిమాణాలు పెరుగుతూ పోతున్న పక్షంలో డయాలసిస్‌ అవసరమవుతుంది.
 
డయాలసిస్‌ రెండు రకాలు
హిమో డయాలసిస్‌: డయాలసిస్‌లో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి హిమో డయాలసిస్‌, రెండవది పెరిటోనియల్‌ డయాలసిస్‌(హోమ్‌ డయాలసిస్‌ అని కూడా అంటారు). హిమో డయాలసిస్‌ చేయించుకునే పేషెంట్‌కు బిపి నార్మల్‌గా ఉండాలి. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లలో ఇది తక్కువగా ఉంటుంది. అలాంటి పేషెంట్లకు సిఆర్‌ఆర్‌పి అనే అధునిక యంత్రం ద్వారా డయాలసిస్‌ను అందచేయడం మా ప్రత్యేకత. ఈ చికిత్సల దశలోనే కిడ్నీ ఫెయిల్యూర్‌ అయిన కారణంగా కిడ్నీ మార్పిడి అవసరాన్ని కూడా పేషెంట్‌కు చెప్పవలసి ఉంటుంది.
పెరిటోనియల్‌ డయాలసిస్‌: కిడ్నీ పేషెంట్‌కు డయాలసిస్‌ చేయించుకోవడానికి హిమోడయాలసిస్‌ సెంటర్‌ దూరంగా ఉన్న పక్షంలో పెరిటోనియల్‌ డయాలసిస్‌ అనే విధానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధానంలో యంత్రం అవసరం ఉండదు, ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం ఉండదు, పచ్చకామెర్లు ఉన్నవారికి ఈ విధానం మరింత ఉపయోగకరం. దీనికి రక్తంతో సంబంధం ఉండదు. హిమోడయాలసిస్‌లో బిపి హెచ్చుతగ్గులు జరగడం వల్ల రికవరి అవకాశాలలో 10, 20 శాతం రిస్క్‌ ఉంటుంది. ఆరేడు గంటలకోసారి మూత్రం నిండిన బ్యాగ్‌ను మారుస్తుంటారు. ఇది మెల్లగా పనిచేసే విధానం వల్ల బిపిలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం లేదు. హిమో డయాలసిస్‌తో పోలిస్తే ఇది ప్రయోజనకరమైనది.
 
వ్యాధి ఎందుకు వస్తుంది?
కిడ్నీ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. తాత్కాలికంగా తలెత్తే సమస్య ఒకటైతే దీర్ఘకాలికంగా ఉండే సమస్య రెండోది. తాత్కాలికంగా తలెత్తే కిడ్నీ సమస్యకు అనవసరంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం, యాంటీ బయాటిక్‌లు అవసరం ఉన్నా లేకున్నా దీర్ఘకాలం తీసుకోవడం, డీహైడ్రేషన్‌ లాంటివి ఏర్పడినప్పుడు నిర్లక్ష్యం చేయడం వంటివి ప్రధాన కారణాలు. ఇలాంటి అంశాలను నివారించడం వల్ల కిడ్నీని కాపాడుకోవచ్చు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఏర్పడడానికి ముఖ్య కారణాలు మధుమేహ వ్యాధి, హైపర్‌ టెన్షన్‌. కిడ్నీ వ్యాధి ఏర్పడిన వారిలో 60 నుంచి 70 శాతం మంది డయాబెటిస్‌ కారణంగా ఆ సమస్యను ఎదుర్కొంటున్నవారే. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవడం వల్ల కిడ్నీ సమస్యను నిరోధించలేకపోయినప్పటికీ అది రాకుండా జాప్యం చేయవచ్చు. ఐదు, పదేళ్లలో ఏర్పడవలసిన కిడ్నీ సమస్యను 20 ఏళ్ల వరకు రాకుండా నివారించవచ్చు. ఒకవేళ కిడ్నీ వ్యాధి వచ్చినా డయాలసిస్‌ వరకు రాకుండా నివారించవచ్చు.
 
ఇండక్షన్‌ ట్రీట్‌మెంట్‌
కిడ్నీ మార్పిడికి ముఖ్యంగా బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి నుంచి మూత్ర పిండం సేకరించే విషయంలో, అలాగే కిడ్నీ దాతకు, గ్రహీతకు మ్యాచింగ్‌ కుదరని పక్షంలో (ఉదాహరణకు భర్తకు భార్య కిడ్నీ దానం చేయాలనుకున్నప్పుడు ఆమె రక్త సంబంధీకురాలు కానందున మ్యాచింగ్‌ కుదరకపోవచ్చు), మొదటిసారి చేసిన కిడ్నీ మార్పిడి విఫలమై రెండవసారి కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు అలాంటి పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ఇతరుల కిడ్నీని తీసుకోవడానికి శరీరం సహకరించని పరిస్థితిలో పేషెంట్‌కు ఒక ఇండక్షన్‌ ట్రీట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. ఇది కిడ్నీ మార్పిడికి ఎంత వ్యయమవుతుందో అంత ఖర్చుతో కూడుకున్న చికిత్స. మామూలుగా ఈ చికిత్సకు రెండు, రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యేది. గత పన్నెండు సంవత్సరాలుగా మేము సొంతంగా రూపొందించుకున్న చికిత్సా పద్ధతులను ఇందుకు ఉపయోగిస్తున్నాము. మా బృందం అందచేస్తున్న ఈ చికిత్సలో దీనికి కేవలం 35 వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. మా పద్ధతినే ఇప్పుడు మన దేశంలోని 10 కిడ్నీ సెంటర్లు పాటిస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌, వియత్నాం, క్యూబా, గ్వాటెమాలా, డొమెనికన్‌ రిపబ్లిక్‌ వంటి దేశాలు కూడా మా పద్ధతినే పాటిస్తున్నాయి.
 
జాగ్రత్తలు
ఈ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్‌ ఉన్న పక్షంలో కుటుంబ సభ్యులందరూ ప్రతి ఏడాదికోసారైనా రక్త పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. 
ఈ డయాబెటిస్‌, హైబిపి ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటంతోపాటు ఆహార నియమాలు కచ్ఛితంగా పాటించాలి. మందులు క్రమం తప్పకుండా వేసుకుంటూ షుగర్‌ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి.
ఈ ఈ నియమాలను పాటించడం వల్ల కిడ్నీ సమస్యలు ముందుగానే రాకుండా వాటిని జాప్యం చేయించవచ్చు. షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోకుంటే వృద్ధాప్యంలో రావలసిన కిడ్నీ సమస్యలు ముందుగానే ముంచుకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ పిజ్జాలు, బర్గర్లు వంటి కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని దూరంగా ఉంచాలి. ఆల్కహాల్‌, ధూమపానాన్ని వంటి అలవాట్లకు స్వస్తి చెప్పాలి. నిత్యం శారీరక వ్యాయామం చేయడం, ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం, రోజుకు రెండు లీటర్ల నీరు తాగడం వంటి చర్యల ద్వారా కిడ్నీ వ్యాధులు రాకుండా నివారించవచ్చు. 
ఈ కిడ్నీ అనేది మన శరీరంలో మురుగును వదిలించే వ్యవస్థ లాంటిది. ఆ మురుగు బయటకు పోకుండా లోపలే ఉండిపోతే శరీరం మొత్తం పాడైపోతుంది. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, సోడియం, పొటాషియం తదితర లవణాలను నియంత్రణలో ఉంచడం కిడ్నీ ముఖ్య విధులు. అందుకే బిపి, రక్తహీనత లాంటివి ఉన్నప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం అవసరం. 
 
24 గంటల పర్యవేక్షణలో...
కిడ్నీ మార్పిడి అనేది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. అన్నిటి కన్నా ముందు పేషెంట్‌ ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అనుక్షణం...రాత్రి పగలు సేవలు అందచేసే డాక్టర్ల బృందం పర్యవేక్షణలోనే కిడ్నీ మార్పిడి విజయవంతం కాగలదు. 24 గంటలూ ఐసియులో డాక్టర్ల బృందం పర్యవేక్షణలో పేషెంట్‌ ఉండాల్సి ఉంటుంది. మా వైద్య నిపుణుల బృందానికి చెందిన పదిమంది సభ్యుల బృందం ఎల్లవేళల్లో పేషెంట్‌కు అందుబాటులో ఉంటుంది. కిడ్నీ వ్యాధితో బాధపడేవారికి ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అందుకు సంబంధించిన సర్జరీలను కూడా మా బృందం గత పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.
 
కిడ్నీ వ్యాధి ఏర్పడడానికి ముఖ్య కారణాలు మధుమేహ వ్యాధి, హైపర్‌ టెన్షన్‌. కిడ్నీ వ్యాధి ఏర్పడిన వారిలో 60 నుంచి 70 శాతం మంది డయాబెటిస్‌ కారణంగా ఆ సమస్యను ఎదుర్కొంటున్నవారే.డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవడం వల్ల కిడ్నీ సమస్యను నిరోధించలేకపోయినప్పటికీ అది రాకుండా జాప్యం చేయవచ్చు. ఐదు, పదేళ్లలో ఏర్పడవలసిన కిడ్నీ సమస్యను 20 ఏళ్ల వరకు రాకుండా నివారించవచ్చు. 
 
డాక్టర్‌ కె.ఎస్‌. నాయక్‌
చీఫ్‌ నెఫ్రాలజిస్ట్‌,
డెక్కన్‌ హాస్పిటల్‌
సోమాజిగూడ
హైదరాబాద్‌
ఫోన్స్‌: 90000 39595
         97012 45607