లివర్‌ పవర్‌!

మహిళలూ!... గ్లాసులు దింపండి!
పురుషులతో పోలిస్తే మహిళల్లో మద్యాన్ని అరిగించుకునే జీర్ణరసాలు 50 శాతమే! కాబట్టి మద్యం విషయంలో మహిళలు పురుషులతో పోటీపడకూడదు. సాధ్యమైనంతవరకూ మద్యానికి దూరంగా ఉండడం మేలు! లేదా... వారానికి 60 మిల్లీ లీటర్లకు మించి మద్యం సేవించకూడదు. మరీ ముఖ్యంగా పొట్ట ప్రాంతంలో కొవ్వు పేరుకుంటే దాన్ని ఫ్యాటీ లివర్‌ లక్షణంగా భావించి మద్యపానాన్ని తగ్గించి, వ్యాయామంతో కొవ్వు కరిగించుకోవాలి.
 
పనిమనిషి ఒక వారం పాటు పన్లోకి రాకపోతే? ఇంట్లో చెత్తంతా పేరుకుపోయి, చిర్రెత్తుకొస్తుంది! అలాంటిదే కాలేయం కూడా! ఒంట్లో చేరే కలుషితాలను అది ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా మొండికేస్తే? అవయవాలన్నీ వరసగా అటకెక్కుతాయి. జీవక్రియలన్నీ కుంటుపడి మంచాన పట్టిస్తాయి. కాబట్టి కాలేయం మీద ఒకటి కాదు... రెండు కళ్లూ వేసి ఉంచాలి!
 
కామెర్లు వచ్చినప్పుడు మాత్రమే మనకు కాలేయం గుర్తుకొస్తుంది. ఇక రెండో సందర్భం... మద్యపానం! అప్పుడు తప్ప కాలేయం అనే అవయవం ఒకటి శరీరంలో ఉందనీ.... అది నిరంతరాయంగా కలుషితాల్ని శుభ్రం చేస్తూ, మనల్ని బ్రతికిస్తూ ఉంటుందనీ, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత అనే విషయాలేవీ పట్టించుకోం! నిజానికి కామెర్లు రుగ్మత కాదు. అదొక వ్యాధి లక్షణం. వ్యాధి మూలంగా కాలేయం అనారోగ్యంపాలైతే కామెర్ల లక్షణాలు బయల్పడతాయి. అలాంటప్పుడు కాలేయానికి ఏమై ఉంటుంది? ఎలాంటి ఇబ్బందికి గురై ఉంటుంది? అనేది తెలుసుకోవాలి.
 
హెపటైటిస్‌
కాలేయానికి సోకే రుగ్మతల్లో ప్రధానమైనవి...
హెపటైటిస్‌ ఎ, బి, సి, ఇ!
హెపటైటిస్‌ ఎ, ఇ: హెపటైటిస్‌ ఎ, ఇ వ్యాధులు కలుషిత ఆహారం, అపరిశుభ్ర పరిసరాల ద్వారా సోకుతాయి. ఈ రకం వైర్‌సల జీవితకాలం 14 రోజులే! కాబట్టి, ఈ వైర్‌సల కారణంగా కాలేయం జబ్బుపడి, కామెర్లు సోకినా అది తాత్కాలికమే! 6 నుంచి 8 వారాల పాటు తేలికపాటి ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే పరిస్థితి చక్కబడుతుంది.
హెపటైటిస్‌ బి, సి: ఇవి ప్రమాదరకమైన వైర్‌సల కారణంగా సోకుతాయి. రక్తప్రవాహం ద్వారా కాలేయానికి వైరస్‌ సోకగానే లక్షణాలు మొదలవుతాయి. లక్షణాలు కామెర్లను పోలినట్టే ఉన్నా, సమర్థమైన చికిత్స అందకపోతే, క్రమేపీ కాలేయాన్ని నాశనం చేస్తాయి. టూకీగా చెప్పాలంటే హెపటైటిస్‌ ‘బి’ వైర్‌సలు కాలేయ కణాల్లోకి చొరబడి వాటి డిఎన్‌ఎల స్థానాల్ని ఆక్రమిస్తాయి. హెపటైటిస్‌ ‘సి’ వైర్‌సలు కూడా కాలేయ కణాల్ని పాడు చేస్తాయి. ఆ క్రమంలో కాలేయం ఫైబ్రోసిస్‌, సిరోసిస్‌, లివర్‌ ఫెయిల్యూర్‌, లివర్‌ కేన్సర్‌... ఇలా ఒక్కో దశ దాటుకుంటూ చివరకు ప్రాణాంతక స్థితికి చేరుస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రమాదకర వైర్‌సలు సోకే వీలున్న మార్గాలన్నిటినీ మూసేయాలి.
అదెలాగంటే....
 
శరీర ద్రవాలు: హెపటైటిస్‌ బి, సి వైర్‌సలు కలిగిన వ్యక్తులను లైంగికంగా కలవకూడదు.
రక్తమార్పిడి: రక్తం ఇచ్చినా, తీసుకున్నా సిరంజీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఇంజెక్షన్లు: తీసుకునే ప్రతి ఇంజెక్షన్‌ కొత్తదై ఉండాలి.
బ్యూటీ పార్లర్‌లో వాడే సౌందర్య పరికరాల వల్ల కూడా వైరస్‌ సోకవచ్చు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సెలూన్లలో వాడే రేజర్ల వల్ల కూడా ఈ వైర్‌సలు సోకుతాయి. కాబట్టి సొంత రేజర్‌ తీసుకెళ్లాలి.
క్రమం తప్పకుండా పరీక్షలు
హెపటైటిస్‌ వైరస్‌ దేన్నైనా ముందుగానే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. ఆరోగ్యం తిరిగి సరిదిద్దలేనంతగా పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఏడాదికి ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి ఉందని తెలిస్తే వెంటనే వైద్యులను కలిసి, సూచించినంతకాలం మందులు వాడాలి. కాలేయ సంబంధ వ్యాధుల్లో ప్రధాన లక్షణం కామెర్లు అయినా 20%నుంచి 30% మందిలో ఎటువంటి లక్షణాలూ కనిపించవు. అనుకోకుండా చేయించుకునే రక్త పరీక్షల్లోనే ఈ రుగ్మతలు బయటపడుతూ ఉంటాయి.
 
పూర్తి చికిత్స తప్పనిసరి!
శరీరంలో హెపటైటిస్‌ వైరస్‌ ఎంత ఉంది? దాని ప్రభావం కాలేయం మీద ఎంత? అనే అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. ఈ రుగ్మతలకు మంచి మందులున్నాయి. ఇంతకు ముందు ఇంజెక్షన్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు నోటి మాత్రలతోనే వ్యాధిని తగ్గించే వీలుంది. హెపటైటిస్‌ ‘సి’ చికిత్స 3 లేదా 6 నెలలపాటు సాగుతుంది. హెపటైటిస్‌ ‘బి’ చికిత్స మూడు నుంచి ఐదేళ్ల పాటు పడుతుంది. ఇంతకాలం మందులు తీసుకుంటేనే వైర్‌సను సమూలంగా నాశనమవుతుంది.
 
టీకా రక్ష!
హెపటైటిస్‌ బి కి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. ఈ టీకా తీసుకుని వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. కాబట్టి పసికందులకు ఇప్పించే టీకాలలో హెపటైటిస్‌ సి టీకా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పుట్టిన నెల రోజుల్లోగా ఒకటి, ఆరు నెలలకు మరొకటి, సంవత్సరానికి బూస్టర్‌ డోస్‌ ఇప్పించగలిగితే పిల్లలకుహెపటైటిస్‌ బి వైరస్‌ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ టీకా తీసుకోనివాళ్లు కూడా ఏ వయసులో ఉన్నా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. అయితే అప్పటికే వైరస్‌ సోకి ఉంటే మాత్రం టీకా తీసుకోవడం ప్రమాదకరం. కాబట్టి వ్యాక్సిన్‌ తీసుకునేముందు రక్త పరీక్షతో హెపటైటిస్‌ బి సోకలేదని నిర్ధారించుకున్న తర్వాతే టీకా తీసుకోవాలి. ఇదిలా ఉంటే... హెపటైటిస్‌ సికి వ్యాక్సిన్‌ తయారు కాలేదు. ఇందుకు కారణం, ఈ వైరస్‌ త్వరితంగా రూపం మార్చుకుంటూ ఉండడమే!
 
కామెర్లు
సర్వసాధారణంగా అందరం వినే మాట... కామెర్లు వ్యాధి! ఇది కాలేయం సనితీరులో తేడా వల్ల వచ్యే సమస్యే! పసరు మందు పని చేస్తుందా?
హెపటైటిస్‌, ఫ్యాటీ లివర్‌, బైల్‌ డక్ట్‌లో రాళ్లు, నులి పురుగులు... ఇలా కామెర్లకు బోలెడన్ని కారణాలుంటాయి. కారణం ఏదనేది వైద్య పరీక్షలతో కనిపెట్టి చికిత్స తీసుకుంటేనే కాలేయం వ్యాధి నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతమవుతుంది. అలా కాకుండా పసరు మందులను ఆశ్రయిస్తే, వ్యాధి తగ్గకపోగా చికిత్స ఆలస్యమై వ్యాధి మరింత ముదిరిపోతుంది. దాంతో ప్రధానంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయు దాటిపోవచ్చు కూడా! సాధారణంగా పసరు మందుల మీద నమ్మకం హెపటైటిస్‌ ‘ఎ’, ‘ఇ’ల మూలంగానే పెరిగిందని అనుకోవచ్చు. ఈ రెండు వైర్‌సలు ఎటువంటి చికిత్స ఇవ్వకపోయినా తగ్గిపోతాయి. కాబట్టి ఆ సమయంలో పసరు మందు తీసుకున్నవాళ్లు, ఆ మందు వల్లే కామెర్లు నయమయ్యాయని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు.
 
గర్భిణుల్లో కాలేయ సమస్య
గర్భిణుల్లో హార్మోన్ల స్రావాల్లో జరిగే తేడాలు, వాటి ప్రభావం వల్ల పిత్తాశయం పనితనం మందగిస్తుంది. సాధారణంగా ఇది చురుగ్గా పని చేస్తున్నప్పుడు విడుదలయ్యే బైల్‌ ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. అయితే పిత్తాశయం పనితీరు మందగించినప్పుడు దాన్లో తయారయ్యే బైల్‌ జ్యూస్‌ రాళ్లలా మారుతుంది. ఈ రాళ్లు పిత్తాశయం నుంచి బైల్‌ డక్ట్‌లోకి చేరే వీలుంటుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, కళ్ల పసికర్లు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే తల్లికీ, బిడ్డకు... ఇద్దరికీ ప్రమాదకరమే! కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ.ఆర్‌.సి.పి (ఎండోస్కోపిక్‌ రిట్రోగ్రేడ్‌ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రపీ) అనే చిన్న ఎండోస్కోపిక్‌ సర్జరీతో వైద్యులు ఈ రాళ్లను బయటకు తెప్పిస్తారు.
 
ఫ్యాటీ లివర్‌
ఫ్యాటీ లివర్‌ సర్వసాధారణమే! మద్యపానం వల్లే ఫ్యాటీ లివర్‌ రావాలని లేదు. ఆ అలవాటు లేకున్నా అపరిమితంగా కొవ్వు పదార్థాలు తినే అలవాటున్నా కాలేయానికి కొవ్వు పట్టొచ్చు. దీన్నే ‘నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ అంటారు. మద్యపానం వల్ల వచ్చే కాలేయ వ్యాధి ‘ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌’! ఫ్యాటీ లివర్‌ దశలో ఉన్నప్పుడు మద్యం మానేస్తే తిరిగి కాలేయం ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే మద్యం అలవాటు లేనివాళ్లు పెరిగిన శరీర బరువు తగ్గించుకున్నా కాలేయం బాగవుతుంది. ఈ రెండు మార్గాలూ కాలేయాన్ని మరింత జబ్బు పడకుండా నియంత్రిస్తాయి. అయితే ఫ్యాటీ లివర్‌ దశను నిర్లక్ష్యం చేస్తూ, తమ అలవాట్లను మార్చుకోలేకపోతే ఫ్యాటీ లివర్‌ దశలు మారుతూ చివరిదైన నాల్గవ దశకు చేరుకుంటుంది. ఇది తిరిగి సరిదిద్దలేని సమస్య. ఈ దశలో కాలేయ కణాలు తీగల్లా మారతాయి (ఫైబ్రోసిస్‌). కాలేయం రబ్బరులా తయారవుతుంది (సిరోసిస్‌). చివరికి కాలేయం కేన్సర్‌కూ గురి కావచ్చు.
 
-డాక్టర్‌ ఆశా ఎమ్‌. సుబ్బలక్ష్మి,
డైరెక్టర్‌ అండ్‌ హెచ్‌ఓడి ఆఫ్‌ ఇంటర్‌వెన్షనల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీసెస్‌,
కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.