కిడ్నీలను కాపాడుకోండి

ఆంధ్రజ్యోతి(24-10-2016): ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. అయితే మిగతా సమస్యలతో పోల్చితే కిడ్నీలో వచ్చే సమస్యలు చాలా వరకు ఆలస్యంగా గుర్తించడం జరుగుతుంది. సాధారణంగా వచ్చే కిడ్నీ సమస్యలివి...
 
కిడ్నీ సమస్యకు ప్రధాన కారణం డయాబెటిస్‌. కిడ్నీలో రాళ్లు ఉన్న వారిలో కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా కొన్ని రకాల కిడ్నీ జబ్బులు సంక్రమించే అవకాశ ం ఉంది. నొప్పినివారణ మాత్రలు ఎక్కువగా తీసుకునే వారిలో. స్మోకింగ్‌ అలవాటు ఉన్న వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌ జరగడానికి ఆస్కారం ఉంటుంది.
 
కిడ్నీలో రాళ్లు
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలివీ అని కచ్చితంగా చెప్పలేము. తక్కువ నీరు తాగడం, హార్మోన్ల అసమతుల్యత కారణం కావచ్చు. జన్యుపరంగా, ఇతర ఇన్‌ఫెక్షన్‌ల వల్ల , ఇతర వ్యాధుల కోసం వాడుతున్న మందుల వల్ల , ఆహారపు అలవాట్ల వల్ల కూడా రాళ్లు ఏర్పడవచ్చు. వేసవిలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకుపోవడం వల్ల సహజంగానే మూత్రవిసర్జన తగ్గిపోతుంది. సాధారణంగా చలికాలంలో, వర్షాకాలంలో మూడున్నర లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుంది. కానీ వేసవిలో ఇంతకు రెట్టింపు తాగాల్సి ఉంటుంది. ఎండలో పనిచేసే వారు ఇంకా నీరు తీసుకోవాలి. శరీరంలో తయారయ్యే మలిన పదార్థాలన్నీ మూత్రం ద్వారానే బయటకుపోతాయి. మలినాలన్నీ కరిగిన స్థితిలో మూత్రం ద్వారా బయటకు వెళితే ఏ సమస్యా ఉండదు. అలా కాకుండా మూత్రం విసర్జన సాఫీగా జరగకపోతే గాఢత పెరిగిపోయి మలినాలు రాళ్లుగా ఏర్పడతాయి. సముద్రపు నీరు ఎండితే ఉప్పుగా మారినట్లుగా మూత్రం ఎండిపోయి రాళ్లుగా మారతాయి. నాలుగు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో ఉన్న రాళ్లు మూత్రంలో వెళ్లిపోతాయి. అంతకన్నా ఎక్కువ సైజులో ఉన్నప్పుడు సర్జరీ చేసి తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెద్దగా కోత లేకుండా చిన్నగాటుతో చేసే మినిమల్లీ ఇన్‌వాసివ్‌ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
 
కిడ్నీ ఫెయిల్యూర్‌ 
కిడ్నీల పనితీరు సాధారణంగా ఉన్నంత వరకు రక్తంలో క్రియాటినైన్‌ లెవెల్స్‌ తక్కువగానే ఉంటాయి. అయితే డయాబెటిస్‌, అధిక రక్తపోటు వంటి సమస్యల వల్ల కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. నొప్పినివారణ మాత్రలు అధికంగా వాడటం కూడా కిడ్నీ డ్యామేజ్‌కు కారణమవుతుంది. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్‌ అవుతుందో అప్పుడు రక్తంలో క్రియాటినైన్‌ లెవెల్స్‌ పెరిగితాయు. ఒకస్థాయికి మించి కిడ్నీ పనితీరు తగ్గిపోయినపుడు రక్తంలో క్రియాటినైన్‌ లెవెల్స్‌ ఎక్కువవుతాయి. ఈ పరిస్థితుల్లో వైద్యులు రక్తశుద్ది కోసం డయాలసి్‌సను సూచిస్తారు. అయితే డయాలసిస్‌ చేసే సమయంలో రక్తంలోని ముఖ్యమైన పోషకాలు కూడా గ్రహించి వేయబడతాయి. ఫలితంగా రోగి మరింత బలహీనపడిపోతారు. ఈ స్థితిలో కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారమవుతుంది. బ్రెయిన్‌ డెడె పర్సన్‌ నుంచి లేక బంధువులు ఇచ్చిన కిడ్నీని అమర్చితే సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది
.
 ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. 
కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారు ఉప్పు వాడకం బాగా తగ్గించాలి.
కిడ్నీకేన్సర్‌ రోగులు తక్కువ ప్రోటీన్‌ డైట్‌ను తీసుకోవాలి.
స్మోకింగ్‌, ఆల్కహాల్‌ అలవాటు ఉంటే మానేయాలి.
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ను నియంత్రించుకోవాలి. బీపీ ఉంటే కంట్రోల్‌లో పెట్టుకోవాలి.
డైట్‌ కంట్రోల్‌ చేసుకోవాలి. ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. అంటే నాన్‌వెజ్‌ మానేయాలి.
పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం అంటే పండ్లు, కొబ్బరినీళ్లకు దూరంగా ఉండాలి.
పాస్ఫరస్‌ తక్కువగా ఉండే ఆహారంను ఎంచుకోవాలి.
క్రమంతప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలి.