‘కిడ్నీ స్టోన్స్‌’కు చెక్‌ పెట్టాలంటే...

25-05-2019: నాలుగేళ్ల క్రితం నాకు కిడ్నీస్టోన్స్‌ ఆపరేషన్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ నొప్పి వస్తోంది. తిరిగి రాళ్లు ఏర్పడ్డాయేమోనని అనుమానంగా ఉంది. మూత్రపిండాల్లో రాళ్లు నియంత్రించడానికి డైట్‌ ద్వారా కుదురుతుందా?
 
- కిశోర్‌, కరీంనగర్‌
వేసవిలో మూత్రపిండాల్లో రాళ్లు జనరల్‌గా బయటపడతాయి. దీనికి ముఖ్య కారణం సరైన హైడ్రేషన్‌ లేకపోవడమే. ఒక్కసారి కిడ్నీ స్టోన్స్‌ వచ్చిన వారికి తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే...
డీ హైడ్రేషన్‌ వల్ల వేసవిలో కిడ్నీస్టోన్స్‌ వస్తాయి. దీనికి మీరు మూత్రం చిక్కబడకుండా చూసుకోవాలి. అంటే నీరు, నీరు ఉన్న పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. పల్చటి పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, పల్చటి మజ్జిగ, క్లియర్‌ సూప్స్‌ ఎక్కువగా తాగాలి. రోజుకు రెండు లీటర్ల మూత్రాన్ని విసర్జించాలి. నిమ్మజాతికి చెందిన పండ్ల రసాలు రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. భోజనంలో నిమ్మరసం పిండుకోవడం, భోజనంతో పాటు నిమ్మరసం తీసుకోవడం, కమలా ఫలాల జ్యూసు తీసుకోవడం ఉపయోగకరం.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తగ్గించాలి. ఉదాహరణకు బిర్యానీ. వీటి వల్ల మూత్రంలో కాల్షియం చేరి రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా వేసవిలో శాకాహారం తీసుకోవడం శ్రేయస్కరం.
పాలకూర, టీ, సాఫ్ట్‌ డ్రింక్స్‌, నట్స్‌, చాక్లెట్లు, బీట్‌రూట్‌... వీటివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి బాగా తగ్గించాలి.
ఒకసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారికి తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి డైట్‌ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.