లాంగ్‌ live ర్‌!

03-06-2019: కొన్ని అవయవాలు సూపర్‌ ఫైటర్లు! అంత తేలికగా, త్వరగా జబ్బుపడవు! జబ్బు పడినా మనిషిని ఉన్నఫలాన కుంగదీయవు! అలాంటి అద్భుతమైన అవయవమే కాలేయం! ఎంత జబ్బు పడినా, తనను తాను మరమ్మతు చేసుకుంటూ... ముందుకు నడిపించే విలువైన ఆ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి! దురలవాట్లు, అస్తవ్యస్థ జీవనశైలితో దాని ఓర్పును పరీక్షించకూడదు!
 
అవయవం, గ్రంథి... ఇలా రెండు పాత్రలను పోషించే అద్భుతమైన అవయవం... కాలేయం! ఒంట్లోకి చేరే విషాల్ని విరిచేసి బయటికి వెళ్లగొట్టడం, జీవక్రియలకు అవసరమైన హార్మోన్లను స్రవించి ఆరోగ్యాన్ని సంరక్షించడం... ఇలా మన శరీరంలో రెండు కీలకమైన పనులు చేసే అతి పెద్ద ఆర్గాన్‌ ఇది. అంతే కాదు. కోతకు గురైనా, తిరిగి పూర్తి ఆకారం చేరుకునే వరకూ పెరిగే మ్యాజిక్‌ ఆర్గాన్‌ కూడా ఇదొక్కటే! ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, శరీరం మొత్తాన్ని సంరక్షించే కాలేయం కూడా మిగతా అవయవాలలాగే పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, రుగ్మతలకు లోనవుతుంది. కామెర్లు వచ్చినప్పుడు మాత్రమే కాలేయం సుస్తీకి లోనైందని గ్రహిస్తాం! కానీ కామెర్లు కాలేయం జబ్బు పడింది అని తెలియజెప్పే ఓ లక్షణం మాత్రమే! అంతకుమించిన ఇన్‌ఫెక్షన్లు, రుగ్మతలు కాలేయాన్ని కుదేలు చేస్తూ ఉంటాయి. అవేంటంటే....
 
ఫ్యాటీ లివర్‌: ‘పరీక్ష చేస్తే ప్రతి ఒక్కరికీ ఫ్యాటీ లివర్‌ అనే ఫలితమే వస్తుంది’ అనే నమ్మకం అందరిలో ఏర్పడిపోయింది. నిజానికి అలా్ట్రసౌండ్‌ పరీక్ష ద్వారా బయల్పడే కాలేయ గ్రేడింగ్‌కు విలువ లేదు. ఆ పరీక్షలో గ్రేడ్‌ 1 లేదా 2 అని వచ్చినా, ఆ ఫలితాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎలాంటి దశలో ఉన్నా, ‘ఫ్యాటీ లివర్‌’ అనేది ఎప్పటికీ ప్రమాదకరమే! ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా, 10 నుంచి 15 సంవత్సరాల దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్‌ ముదిరి లివర్‌ సిర్రోసి్‌సకు దారి తీయవచ్చు. అంటే కాలేయం జబ్బుపడి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిపడిపోయిందని అర్థం. కాబట్టి ఫ్యాటీ లివర్‌ అని తేలితే, వెంటనే లివర్‌ ఫంక్షన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఎంజైమ్స్‌ పరిమితికి మించి స్రవిస్తున్నట్టు తేలితే, కాలేయం తిరిగి కోలుకోలేనంత స్థితికి చేరుకుంటోందని గ్రహించాలి. దీన్నే ‘ఫైబ్రోసిస్‌’ అంటారు. ఈ దశ మరింత ముదిరితే తిరిగి సరిదిద్దలేని ‘సిర్రోసిస్‌’ స్థితికి కాలేయం చేరుకుంటుంది. ఇది ప్రమాదకరం. సిరోసి్‌సకు కాలేయ మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు.
 
మద్యంతాగకపోయినా రావచ్చు!
మద్యం అలవాటు లేకపోయినా కొవ్వుతో కూడిన పదార్థాలు ఎక్కువగా తినడం మూలంగా ‘నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ రావచ్చు. అయితే మొదటి రెండు దశలకూ చికిత్సతో పని లేకుండా, అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉంటూ, కాలేయం పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకునేలా చేయవచ్చు. అలాకాకుండా సమ్యను నిర్లక్ష్యం చేస్తే, సిర్రోసిస్‌, ఆ తరువాత లివర్‌ పూర్తిగా ఫెయిల్‌ అయ్యే అవకాశాలుంటాయి. అప్పుడు కాలేయ మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం.
 
ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌: ఎక్కువగా మద్యం సేవించే వాళ్లకు ఈ వ్యాధి వస్తుంది. ఇది కూడా దశలవారీగా కాలేయాన్ని దెబ్బతీసి చివరకు సిర్రోసి్‌సకు దారి తీస్తుంది.
 
హెపటైటిస్‌: హెపటైటిస్‌ ‘బి’, ‘సి’ వైర్‌సలు ప్రమాదకరమైనవి. వీటిని సత్వరం కనిపెట్టి చికిత్స చేయకపోతే, దీర్ఘకాలంలో లివర్‌ సిర్రోసిస్‌, కాలేయ కేన్సర్‌లకు దారి తీస్తాయి. హెపటైటిస్‌ ‘ఎ’, హెపటైటిస్‌ ‘ఇ’ వైర్‌సలు చికిత్స ఇవ్వకపోయినా వాటంతట అవే కొంతకాలానికి తగ్గిపోతాయి. హెపటైటిస్‌ ‘బి’కి టీకా చేయించుకోవచ్చు. హెపటైటిస్‌ ‘సి’ని మందులతో అరికట్టవచ్చు. హెపటైటిస్‌ ‘బి’, ‘సి’లు రక్తమార్పిడి, శరీర ద్రవాలు, తల్లి నుంచి బిడ్డకు, శస్త్రచికిత్సలు, దంత చికిత్సల సమయంలో స్టెరిలైజ్‌ చేయని పరికరాల ద్వారా సంక్రమిస్తాయి.
 
సిర్రోసిస్‌: మద్యం, హెపటైటిస్‌ వైర్‌సలు (ఎ, బి, సి, డి), ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల వల్ల పదే పదే జబ్బు పడితే, చికిత్సతో తగ్గినా, వాటి ఫలితంగా కాలేయం మీద మచ్చలు ఏర్పడతాయి. కాలేయం మృదుత్వాన్ని కోల్పోయి గట్టిగా మారుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘స్కారింగ్‌’ అంటారు. ఈ పరిస్థితే చివరకు ‘లివర్‌ సిర్రోసి్‌స’కు దారి తీస్తుంది. ఈ దశకు చేరుకున్న కాలేయాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం కష్టం.
 
లివర్‌ కేన్సర్‌: కాలేయ కణాల్లోనే కేన్సర్‌ తలెత్తవచ్చు లేదా శరీరంలోని ఇతర భాగాల నుంచి కాలేయానికి కేన్సర్‌ సోకవచ్చు. స్టెరాయిడ్ల వాడకం, ముదిరిన హెపటైటిస్‌ ‘సి’, లివర్‌ సిర్రోసి్‌స కూడా లివర్‌ కేన్సర్‌కు దారి తీయొచ్చు. మద్యపానం అలవాటు ఉండి హెపటైటిస్‌ సోకిన మధుమేహులకూ, హెపటైటిస్‌ ‘సి’ సోకి ఉండి, ధూమపానం చేసేవారికీ కాలేయ కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
మందుల వాడకం: క్షయ వ్యాధి నివారణకు వాడే మందులు, హృద్రోగాలకు వాడే కొన్ని మెడిసిన్స్‌, కీళ్ల నొప్పులకు వాడే కొన్ని రకాల మందులు దీర్ఘకాలం వాడితే వాటి ప్రభావం వల్ల కాలేయం పాడయ్యే అవకాశం ఉంటుంది.
 
ఆకు పసరు మందులు: కామెర్ల వ్యాధి తగ్గడం కోసం నాటు వైద్యంలో ఈ మందులు వాడతారు. వీటిలో ఉండే హెవీ మెటల్స్‌ వల్ల కూడా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
 
ఇలా ఉంటే... జాగ్రత్త!
కాలేయం జబ్బు పడినట్టు తెలిపే లక్షణాలు ఏవంటే...
కామెర్లు (కళ్లు, మూత్రం పసుపుపచ్చగా మారడం).
ఆకలి తగ్గడం, నీరసం
నల్లని విరేచనాలు, రక్తపు వాంతులు కావడం.
వాంతి వస్తున్నట్టు అనిపించడం.
కాళ్ళ వాపులు, కడుపులో నీరు చేరడం (కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు).
హెపటిక్‌ ఎన్‌సెఫలోపతీ (ఆలోచనా విధానంలో అస్పష్టత, అయోమయం).
మూత్రపిండాలు దెబ్బతినడం (కాలేయం పాడైన చివరి దశలో).
మృదుత్వాన్ని కనిపెట్టే సులభ పరీక్ష - ఫైబ్రోస్కాన్‌
కాలేయ మృదుత్వాన్ని కనిపెట్టడానికి చేసే పరీక్ష ఫైబ్రోస్కాన్‌. జబ్బు తీవ్రత పెరిగేకొద్దీ కాలేయం మృదుత్వాన్ని కోల్పోతూ గట్టిపడిపోతుంది. మెత్తగా ఉండవలసిన కాలేయం గట్టిపడి, ఫైబ్రోసి్‌సకు, తర్వాత మరింత ముదిరి సిర్రోసి్‌సకూ దారి తీస్తుంది. అయితే ఈ దశల స్థితిని కనుక్కోవడానికి పూర్వం లివర్‌ బయాప్సీ చేసేవారు. కానీ ఈ పరీక్ష ఒకే రోగికి పదే పదే చేయడం కష్టం. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫైబ్రో స్కాన్‌తో కాలేయ మృదుత్వాన్ని బట్టి కాలేయం జబ్బుపడిన దశను తేలికగా తెలుసుకోవచ్చు.
 
కాలేయ మార్పిడి సులభమే!
కాలేయ కేన్సర్‌లో కణితి ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు కాలేయ మార్పిడి చేయవచ్చు. అంతకు మించి 8 సెంటీమీటర్ల మేరకు కణితి పెరిగి ఉంటే, కాలేయ మార్పిడి చేసినా, కేన్సర్‌ తిరగబెట్టి మార్పిడి చేసిన కాలేయానికి కూడా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరుగా కాలేయానికి కీమోథెరపీ ఇచ్చి కేన్సర్‌ గడ్డ కరిగిన తర్వాతే కాలేయ మార్పిడికి వెళ్లవలసి ఉంటుంది. అలాగే కాలేయ మార్పిడి గురించి రోగి వయసు, ఇతరత్రా ఆరోగ్య స్థితుల ఆధారంగా వైద్యులు, కుటుంబసభ్యులు కలిసి నిర్ణయం తీసుకుంటారు. మిగతా అవయవ మార్పిడులతో పోలిస్తే కాలేయ మార్పిడి 90 శాతం విజయవంతం, సురక్షితం. రక్తం గ్రూపు కలిస్తే చాలు! కాలేయ మార్పిడి చేయవచ్చు. అలాగే మిగతా అవయవాల లాగా కాలేయాన్ని స్వీకర్త శరీరం తిరస్కరించే అవకాశాలు తక్కువే!
 
లివర్‌ బాగుండాలంటే....
కాలేయం బాగుండాలంటే అది ఇన్‌ఫెక్షన్లకు గురి కాకుండా, దానికి కొవ్వు పట్టకుండా చూసుకోవాలి. ఇందుకోసం...
 
హెపటైటిస్‌ ‘బి’ వ్యాక్సిన్‌ చేయించుకోవాలి.
పదే పదే కామెర్లకు గురి కాకుండా చూసుకోవాలి.
కామెర్లు వచ్చిన వెంటనే వైద్యులను కలిసి ఏ రకం హెపటైటిస్‌ వైరస్‌ అనేది తెలుసుకుని, జాగ్రత్త పడాలి.
కలుషిత ఆహారం, పానీయాలకు దూరంగా ఉండాలి.
నూనెలో వేయించిన పదార్థాలు, జంక్‌ ఫుడ్‌లు వీలైనంత తక్కువ తినాలి.
మద్యపానానికి దూరంగా ఉండాలి.
క్రమం తప్పక వ్యాయామం చేస్తూ, పౌష్టికాహారం తీసుకోవాలి.
నాటు మందుల జోలికి వెళ్లకూడదు.
కోలుకున్న తర్వాత ఇలా!
కాలేయం జబ్బుపడి కోలుకున్న తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవి!
తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి.
కొవ్వులు, నూనెలు తక్కువగా ఉన్న ఫుడ్‌ తీసుకోవాలి.
మాంసాహారం తగ్గించాలి.
తాజా పండ్లు, కూరగాయలు తినాలి.
వంద రూపాయల్లో టీకా!
హెపటైటిస్‌ బి వైరస్‌ సోకకుండా ఉండడానికి ఓ టీకా ఉంది. యూనివర్సల్‌ ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా చిన్న పిల్లలకు పోలియో, డి.పి.టి టీకాలతో పాటే హెపటైటిస్‌ ‘బి’ వ్యాక్సిన్‌ కూడా వేస్తున్నారు. అయితే పిల్లలే కాదు, ఇప్పటి వరకూ ఈ టీకా తీసుకోని పెద్దలు కూడా దీన్ని తీసుకుంటే జీవితాంతం హెపటైటిస్‌ బి వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చు. నెలకొకసారి, మూడు నెలల పాటు మూడు సార్లు ఈ వ్యాక్సిన్‌ ఇస్తారు. వ్యాక్సిన్‌ ధర కేవలం 100 రూపాయలే!
 
నాటు మందులు ప్రమాదకరం!
సాధారణంగా హెపటైటిస్‌ ఎ, ఇ వైర్‌సలతో వచ్చే కామెర్లు ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే నాటు మందులు వాడాం, కాబట్టి జబ్బు తగ్గిపోయిందనే నమ్మకం ఎక్కువమందిలో ఏర్పడిపోతుంది. దాంతో కామెర్లు కనిపించిన ప్రతిసారీ అవే మందుల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ హెపటైటిస్‌ బి, సి రకం వైర్‌సలు సోకినప్పుడు కూడా అవే నాటు మందులు వాడుతూ ఉండిపోతే, కాలేయం మరింత దెబ్బతిని ప్రాణాంతక పరిస్థితికి దారి తీయవచ్చు. సున్నిత తత్వం కలిగి ఉన్న కొందరికి, దానంతట అదే నయమైపోయే హెపటైటిస్‌ వైరస్‌ సోకినా, ఆ సమయంలో ఇచ్చే నాటు మందుల వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఆ మందులో ఉండే హెవీ మెటల్స్‌ వల్ల లివర్‌ ఫెయిల్యూర్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌ జరగవచ్చు. కాబట్టి కామెర్లు ఏ కోవకు చెందినవైనా,
లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం తీసుకోకుండా, వైద్యులను సంప్రతించాలి.
 
-డాక్టర్‌ కె.ఎస్‌.సోమశేఖర్‌ రావు
కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, హెపటాలజిస్ట్‌,
అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌