కిడ్నీలకు హాని చేసే కలుషిత గాలి?

02-10-2017: వాయు కాలుష్యం కారణంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతాయనే సంగతి తెలిసిందే! ఈ రెండు అవయవాలే కాకుండా కిడ్నీలకు కూడా ముప్పు వాటిల్లుతుంది అంటున్నారు వాషింగ్టన్‌ పరిశోధకులు. ఎనిమిది సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వాయు కాలుష్య కారణంగా కిడ్నీల పనితీరు దెబ్బతినడాన్ని వీరు గుర్తించారు. గాలిలోని కంటికి కనిపించని చిన్న చిన్న ధూళి కణాలు రక్తంలో కలుస్తాయనీ, వీటిని వడకట్టే క్రమంలో కిడ్నీల పనితీరు దెబ్బతింటుందని వీరు అంటున్నారు. కలుషిత వాతావరణంలో నివసించేవారు, తరచూ బయట తిరిగే వారు నోటికీ, ముక్కుకీ మాస్క్ వేసుకోవడం వలన ఈ ప్రమాదం నుంచి కొంత వరకూ బయటపడవచ్చని వారు చెబుతున్నారు. వాయుకాలుష్యం కారణంగా గుండె, ఊపిరితిత్తుల కన్నా కూడా కిడ్నీలకే ఎక్కువ ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువ అని వారు స్పష్టం చేస్తున్నారు.