జలుబు నుంచి ఉపశమనానికి...

ఆంధ్రజ్యోతి (12-11-2019): వర్షంలో తడవడం వల్ల గానీ, చలి గాలి వల్ల గానీ, కొందరికి జలుబు, జ్వరం వస్తుంటాయి. ఈ స్థితిలో ముక్కు నుంచి, కళ్ల నుంచి నీళ్లు కారడం, మంటలు, ముక్కు దిబ్బెడ, తుమ్ములు, ముక్కుదూలం మంట, శ్వాసపరమైన ఇబ్బంది. జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యలకు అనుసరించవలసిన హోమియో వైద్యం ఇదే!

 
శీతాకాలపు చలిగాలిలో తిరిగినందువల్ల హఠాత్తుగా ముక్కు నుంచి నీళ్లు కారడం, చలిజ్వరం, ముక్కు దిబ్బడ ఉంటే ఎకోనైట్‌- 30 మందు బాగా పనిచేస్తుంది.
కొద్దిపాటి జ్వరం, జలుబు, ముక్కు దిబ్బెడ, తుమ్ములు, మొదలైన తొలిదశలో ఫెర్రంఫాస్‌ - 30 మందును వాడవచ్చు.
 
దగ్గు, జ్వరం, ముఖం కమిలి, ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తే బెల్లడోనా- 30తో మంచి ఉపశమనం లభిస్తుంది.
 
ముక్కులోంచి జిగటగా పసుపు రంగు స్రావాలు ఊరుతున్నప్పుడు, పల్సటిల్లా -30 మందు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
 
తుమ్ములతో పాటు ముక్కు నుంచి నీరు కారడం, తల బరువు, పోట్లు, దాహం వంటి లక్షణాలు ఉంటే బ్రయోనియా - 30 మందు ఉపయుక్తం.
 
ఒంటి నొప్పులు, జలుబు, తుమ్ములు, నీరు కారడం ఉంటే జెల్సీమియం - 60 మందు మేలు.
 
నిరంతరంగా తుమ్ములు రావడంతో పాటు జలుబు, కళ్ల మంటలు ఉంటే సెబాడిల్లా- 30 మందు వేసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది.
 
చిక్కని స్రావాలు రావడంతో పాటు, ముక్కు, గొంతులో నొప్పి, మంటలు, తమ్ములు ఉంటే మెర్క్‌సాల్‌ -200 మందు శ్రేష్టం.