ఫంగస్‌తో పదిలం!!

19-06-2018: అరగంటో, గంటో వర్షం కురిసి వెలిసిపోవచ్చు. కానీ, ఆ తర్వాత గంటల తరబడి కొన్నిసార్లు రోజుల తరబడి ఒక తడిగాలి వీస్తూనే ఉంటుంది. ఈ గాలే కొందరిని ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు గురిచేస్తూ ఉంటుంది. కాలివేళ్లూ, చేతి వేళ్ల మధ్య, మెడ మీద, చంకల్లో, తొడల మధ్య, జననాంగ భాగాల్లో ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తి చిరాకు పుట్టిస్తుంటాయి. అయితే ఆ వాతావరణంలో ఉండే వారందరికీ ఈ సమస్యలు ఉంటాయని కాదు. ఓ కొద్ది శాతం మంది మాత్రమే ఈ అవస్థలకు గురవుతుంటారు. ఎందుకిలా అంటే!

 
అత్యధిక వ్యాధులకు ఆదిమూలంగా ఉండే వ్యాధినిరోధక శక్తి లోపాలే ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు సైతం ఒక ప్రధాన కారణం. అలాంటి వారిలో పోషకాహార లోపాలతో బలహీనపడిన వాళ్లు, దీర్ఘకాలంగా వ్యాధిగ్రస్తులైన వాళ్లు, మధుమేహం నియంత్రణలో లేనివాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్న వాళ్లు, డెంచర్లు వాడే వాళ్లు, ఎక్కువ కాలంగా స్టెరాయిడ్లు యాంటీబయాటిక్స్‌ వాడుతున్న వాళ్లు, తక్కువ బరువుతో ఉండే పిల్లలు ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. జననాంగాల్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తడం అనేది ప్రత్యేకించి స్త్రీలలో గర్భిణీకాలంలోనే ఎక్కువ. పరిశుభ్రతా లోపాలతో వచ్చే ఫంగల్‌ ఇన్‌పెక్షన్ల సమస్య మాత్రం స్త్రీ పురుషులు ఇరువురిలోనూ సమంగానే ఉంటుంది. గంటల తరబడి అపరిశుభ్రమైన నీళ్లల్లో ఉండే వారు, ఆ నీళ్లల్లోంచి బయటికి వచ్చిన తర్వాతనైనా, ఆయా భాగాల్ని శుభ్రపరుచుకుని, తడిలేకుండా జాగ్రత్తపడని వాళ్లు కూడా ఈ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. పెద్దవారే కాకుండా చిన్న పిల్లలు కూడా ఈ ఫంగల్‌ ఇన్‌పెక్షన్ల బారిన పడుతుంటారు. ఈ ఇన్‌ఫెక్షన్లతో వచ్చే ప్రధాన సమస్యల్లో.......
 
అథ్లెట్స్‌ ఫూట్‌: క్రీడాకారుల్లో కొంతమంది చాలా ఎక్కువ గంటల పాటు, సాక్స్‌ విప్పకుండా ‘షూ’ తో అలాగే ఉండిపోతారు. ఆ కారణంగా, కాలి వే ళ్ల మఽధ్య ఏర్పడే చెమట తడి వల్ల ఆ భాగాల్లో ఫంగస్‌ ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఈ రకమైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు ‘అథ్లెట్‌ ఫూట్‌’ అన్న పేరు స్థిరపడింది. అలా అని ఇది క్రీడాకారులకే పరిమితమేమీ కాదు. రోజుకు పదీ- పదిహేనుగంటల పాటు షూ విప్పకుండా, సాక్స్‌తో ఉండే ఏ వృత్తి వారికైనా ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్న వారిలో చర్మం అక్కడక్కడ ఆకుపచ్చగా మారడంతో పాటు, చీము కూడా చేరుతుంది. బిళ్లలు-ఒంటి మీద బిళ్లలుగా తయారై దురదపెడతాయి. ఈ సమస్యకు పెట్రోలియం, బొరాక్స్‌ అనే హోమియో మందులను 200 పొటెన్సీలో వేసుకుంటే తగ్గిపోతుంది.
 
రింగ్‌వామ్‌: మెడపైన అరిపాదాల్లో, చంకల్లో చక్రాల్లా ఏర్పడటం వల్ల వీటిని రింగ్‌వామ్‌ అంటారు. ఆ భాగంలో కందిపోయిన ఎరుపు, దద్దుర్లు, దురద ఉంటాయి. ఇవి చర్మం ముడతపడే బాగాల్లో ఎక్కవగా వస్తాయి. ఆయా భాగాలను నిరంతరం పొడిగా ఉంచుకోవడం ద్వారా సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు. దానికి తోడు హోమియో చికిత్సగా, సిపియా, గ్రాఫైటిస్‌, తూజా, పెట్రోలియం వంటి మందులను 200 పొటెన్సీలో కొద్ది రోజుల పాటు వేసుకుంటే ఈ సమస్య తొలగిపోతుంది. కొందరిలో ఈ సమస్య తలపై కూడా వస్తుంది. అలాంటి వారికి క్యాలీ సల్ఫ్‌-200 మందు బాగా ఉపయోగపడుతుంది.
 
నేల్‌ ఇన్‌ఫెక్షన్‌: కొంద రిలో కాలివేళ్లే ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటాయి. అలాంటి వాళ్లు యాంటీమోనియమ్‌ క్రూడం వేసుకోవచ్చు. అతిగా చెమట వచ్చే శరీర ధర్మం ఉంటే, సైలేషియా మందు వేసుకోవచ్చు.
 
టీనియా కెపైటిస్‌: ఇది ఎక్కువగా తలపైన, గదమ భాగాల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు గ్రాఫైటిస్‌, సిపియా వీటిలో ఏదో ఒక మందును 200- పొటెన్సీలో వేసుకుంటే నయమవుతుంది.
 
క్యాండీడియాసిస్‌: ఈ రకం ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు జననాంగ భాగాల్లో ఎక్కువగా వస్తుంటాయి. ఇవి ఇతర కాలాల్లోనూ వచ్చినా వర్షాకాలంలోనూ ఎక్కువగానే కనిపిస్తాయి, ఇవి ఎక్కువగా నోరు, గొంతు, నాలుక భాగాల్లో వస్తుంటాయి. ఇవి జననాంగ భాగాల్లో కూడా తలెత్తుతూ ఉంటాయి, మెర్క్‌సాల్‌, బొరాక్స్‌, గ్రాఫైటిస్‌ మందులు ఈ వ్యాధి నివారణలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
 
నివారించవచ్చు: శరీర భాగాల్లో ఎక్కడా, ఎక్కువ సమయం తడిగా ఉండకుండా జాగ్రత్తపడటం ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల నివారణా చర్యల్లో ప్రధానమైనది. దీనికి తోడు వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాహారంతో పాటు వ్యాయామానికి ప్రాధాన్యతను ఇవ్వడం చాలా అవసరం. అయితే, హోమియోలో వ్యాధినిరోధక శక్తిని పెంచే ద్రావణ ఔషధాలు (మదర్‌ టించర్‌) ఉన్నాయి. వాటిలో ఇత్నీషియా, సొరేలియా పోరిలిసోలియా అనేవి ప్రధానమైనవి. వీటిల్లో ఏదో ఒక ద్రావణాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత 10 చుక్కలు, రాత్రి భోజనం తర్వాత 10 చుక్కలు అరకప్పు నీళ్లల్లో వేసుకుని సేవిస్తే, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఒకవేళ ఈ ద్రావణాన్ని పిల్లలకు ఇవ్వాలంటే, ఉదయం 5 చుక్కలు, రాత్రి 5 చుక్కలు ఇస్తే సరిపోతుంది.
 

డాక్టర్‌ బి. అనిల్‌ కుమార్‌, కన్సల్టెంట్‌ హోమియో ఫిజిషియన్‌

జయ భాగ్యలక్ష్మి హోమియో క్లినిక్‌, మియాపూర్‌, హైదరాబాద్‌