విరేచనాలతో చిక్కేమరి!

30-07-2019: కడుపులో గుడగుడ, మాటిమాటికీ వాష్‌రూమ్‌లోకి పరుగులు! డిసెంటరీ సమస్య కొందరిని నానా యాతనకు గురిచేస్తుంది. జిగట విరేచనాల సమస్య చికాకు పుట్టించడమే కాదు... ఉద్యోగ, వ్యాపారాలకు కూడా దూరం చేస్తుంది!
 
పేగుల చివరన వాపు రావడం, ఆ భాగంలో సూక్ష్మజీవులు చేరడం ఈ సమస్య వెనుకుండే కారణం. దీనివల్ల విపరీతమైన నొప్పితో విరేచనాలు అవుతుంటాయి. మలం జిగటగా రావడంతో పాటు, రక్తంతో కలిసిన చీము కూడా వస్తుంది. అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో, ఈగల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వేడి వాతావరణంలోనూ, జనసాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ సమస్య అంటువ్యాధిగా మారుతుంది. కలుషిత ఆహారం ఈ సమస్యకు గల మరో కారణం. శరీరంలో ఐరన్‌ బాగా తగ్గినప్పుడు, రక్తస్రావం కూడా అవుతుంది. మెగ్నీషియం లోపించినప్పుడు కండరాలు, నరాలు పట్టేయడం కూడా ఉంటుంది.
డిసెంటరీ సమస్య మొదలైనప్పుడు విసర్జనకు పదే పదే వెళ్లాలనిపిస్తుంది. పొట్ట భాగమంతా నొప్పితో పాటు కొందరికి జ్వరం కూడా వస్తుంది. మలం జిగురుగాగానీ, , రక్తంతోగానీ ఉంటుంది, లేదా రెండూ కలగలిసి గానీ ఉంటాయి. చిన్న పిల్లల్లోనూ, బలహీనుల్లోనూ ఒక్కోసారి ఈ జబ్బు ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు.

హోమియో వైద్యంలో....

తీవ్రమైన జ్వరం, మలం రక్తంతో కలిసి, ద్రవంగానూ, వేడిగానూ వస్తున్నప్పుడు ఫెర్రంఫాస్‌- 6 -ఎక్స్‌, 12-ఎక్స్‌ మందు బాగా పనిచేస్తుంది.
కడుపులో ఏదో కోస్తున్న బాధతో పాటు తరచూ, చీముతో కలిసిన జిగురు విరేచనాలు కావడం, విసర్జన భాగం లాగడం, బాధ, నాలుక పైన తెల్లని పూత ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తే, కాలిమూర్‌ 3-ఎక్స్‌, 6-ఎక్స్‌ మందు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మలం దుర్వాసనతో రావడం, రక్త విరేచనాలు కావడం, కడుపు ఉబ్బరంతో పాటు, మగతగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే, కాలిఫాన్‌ 3-ఎక్స్‌, 6-ఎక్స్‌ మందులతో ఉపశమనం పొందవచ్చు.
కడుపులో నులివేసిన నొప్పి, జిగట విరేచనాలతో పాటు, కండరాలన్నీ లాగేస్తున్నట్లు ఉండడంతో పాటు, శరీరాన్ని ఏ కాస్త వంచినా, ఒత్తిడికి గురైనా ఎంతో బాధ, ఆయాసం కలిగితే, మెగీషియా ఫాస్‌ 3-ఎక్ప్‌, 6-ఎక్స్‌ వేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

- డాక్టర్‌ బి. అనిల్‌ కుమార్‌

హోమియో వైద్య నిపుణులు, మియాపూర్‌, హైదరాబాద్‌.