జ్వరం వస్తే?

ఆంధ్రజ్యోతి(03-10-2016): ఒళ్లు వెచ్చబడితే ఓ ఫీవర్‌ టాబ్లెట్‌ వేసుకుని పనుల్లో పడిపోతూ ఉంటాం. దెబ్బ తగిలితే బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినంత సింపుల్‌గా జ్వరానికి చికిత్స చేయటం కరెక్ట్‌ కాదు. జ్వరంతోపాటు కనిపించే ఇతర లక్షణాలు, కారణాల ఆధారంగా జ్వరం రకాన్ని, మూల వ్యాధిని కనిపెట్టి తగిన వైద్యం చేయించుకోవాలి. లేదంటే అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.

మనం జ్వరాన్ని ఓ వ్యాధిగా చూస్తాం. కాబట్టే జ్వరం రాగానే దాన్ని తగ్గించే మాత్రలు వేసుకోవాలనే ఓ నిశ్చితాభిప్రాయంతో నడుచుకుంటూ ఉంటాం. కానీ జ్వరం అనేది వ్యాధి కాదు...అది వ్యాధిలో కనిపించే ఓ లక్షణం మాత్రమే! కాబట్టి అలా కనిపించే లక్షణానికి చికిత్స చేయటం మాని అందుకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దే చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం తప్పనిసరిగా వైద్యుల్ని ఆశ్రయించాల్సిందే! జ్వరం తగ్గుతూ పెరుగుతున్నా, విడవకుండా రెండు రోజలకు మించి వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని కలిసి పరీక్షలు చేయుంచుకుని జ్వరాన్ని కలిగించిన వ్యాధి గురించి తెలుసుకోవాలి. అలా కాకుండా సొంత వైద్యం మీద ఆధారపడి తాత్సారం చేస్తే జ్వరం కారక వ్యాధి క్రిములు అంతర్గత అవయవాల మీద దాడిచేసి ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం కలిగించవచ్చు. వర్షాకాలంలో జ్వరాలకు...దోమలు, ఈగలు, సూక్ష్మజీవులు విజృంభించటం ఓ కారణమైతే కుంటుపడే రోగనిరోధకశక్తి మరో ప్రధాన కారణం. కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలి. ఈ కాలంలో బాధించే జ్వరాలు, వాటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అవేంటంటే...
 
డెంగ్యూ
డెంగ్యూ అనే వైరస్‌ వల్ల వచ్చే జ్వరానికి పగటివేళ కుట్టే దోమలే కారణం. చీకటి ప్రదేశాల్లో నక్కి ఉండే ఈ రకం దోమలు పగటివేళే చురుగ్గా ఉంటాయి. కర్టెన్లు, సోఫాలు, బీరువాల వెనక, వాడని వస్తువుల్లోని ఖాళీ జాగాలను స్థావరాలుగా చేసుకునే డెంగ్యూ దోమలు పగలు కుడుతూ ఉంటాయి. ఈ దోమ కాటుతో వాటి లాలాజలంలో ఉండే వైరస్‌ రక్త ప్రవాహంలో కలిసి రోగ లక్షణాలను కలుగజేస్తుంది. 
 
లక్షణాలు: విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు లాగటం...ఈ లక్షణాలు 3 రోజులపాటు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు నాలుగోరోజు నుంచి జ్వరంతోపాటు తగ్గిపోతాయి. దాంతో జ్వరం పూర్తిగా తగ్గిపోయిందనుకుంటే పొరపాటే! ఎందుకంటే అసలు సమస్య అప్పటినుంచే మొదలవుతుంది. జ్వరం తగ్గినా రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఈ దశలో ప్లేట్‌లెట్స్‌ అందిస్తే వ్యాధి అదుపులోకొస్తుంది. కానీ జ్వరం తగ్గిందికదా అని నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత ముదిరి రక్తం చిక్కబడి డెంగ్యూ హెమరేజిక్‌ ఫీవర్‌ దశకు చేరుకుంటుంది. ఈ ప్రభావం అంతర్గత అవయవాల మీద పడుతుంది. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతింటాయి. దద్దుర్లు, కడుపునొప్పి, ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరూ ఈ స్థితికి చేరుకుంటారని చెప్పలేం. వందమందిలో ఏ ఇద్దరో ఇంతటి సీరియస్‌ స్టేజ్‌కి చేరుకుంటూ ఉంటారు. ఈ ప్రమాదకర దశకు చేరుకోకుండా ఉండాలంటే జ్వరం కనిపించిన వెంటనే తోచిన వైద్యం చేసుకోకుండా డాక్టర్‌ని కలవాలి.
 
జాగ్రత్తలు: వచ్చింది డెంగ్యూ జ్వరమో కాదో తెలుసుకోవటానికి ఎలీజా, ఎల్‌ఎస్‌1 అనే కిట్‌ పద్ధతులతో ఇంటి దగ్గరే పరీక్ష చేసుకుని నిర్థారించుకోవచ్చు. ఒకవేళ డెంగ్యూ జ్వరమే అని నిర్ధారణ అయితే వైద్య చికిత్సతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రక్తం చిక్కబడకుండా ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూ జ్వరం ముదరనంతవరకూ పారాసిటమాల్‌ టాబ్లెట్స్‌ వాడుతూ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. దీనికి యాంటిబయాటిక్స్‌, స్టిరాయిడ్స్‌ మందుల అవసరం లేదు.
 
మలేరియా 
దోమ కాటు వల్ల వ్యాపించే మరో జ్వరం మలేరియా! మేలేరియా కలిగించే దోమలు రాత్రివేళల్లోనే కుడతాయి. వైవాక్స్‌, పాల్సిఫారం...ఈ 2 రకాల ప్యారసైట్స్‌తో వచ్చే మలేరియా జ్వరాల లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి.
 
లక్షణాలు: ఫాల్సిఫారం ప్యారసైట్స్‌ వల్ల వచ్చే మలేరియా జ్వరం విపరీతంగా ఉంటుంది. హై టెంపరేచర్‌, ఒళ్లు నొప్పులు, నీరసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. జ్వరం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. జ్వరం తగ్గించే మాత్రలు వేసుకుంటూ ఉండిపోతే కాంప్లికేషన్స్‌ పెరిగిపోతాయి. కిడ్నీలు ఫెయిలవ్వచ్చు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తవచ్చు. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మెదడు కణజాలం దెబ్బతిని అయోమయ స్థితి, విపరీతమైన నిద్ర, మూర్ఛ లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుని పల్మనరీ ఎడీమాతో ఊపిరి తీసుకోలేని ఇబ్బంది కూడా తలెత్తవచ్చు.
 
చికిత్స, జాగ్రత్తలు: జ్వరం కనిపించిన వెంటనే వైద్యుల్ని కలిసి సమర్థమైన చికిత్స తీసుకోవాలి. రక్త పరీక్షతో మలేరియా ప్యారసైట్‌ రక్త కణాల్ని, ప్లేట్‌లెట్లను ఎంత మేరకు నాశనం చేశాయి? రక్తం గడ్డకట్టే తీవ్రత, కాలేయం, మూత్రపిండాల పనితీరులను వైద్యులు తెలుసుకోగలుగుతారు. వైవాక్స్‌ రకం మలేరియాలో జ్వరం కనిపించిన రోజు మొదలైన ఇన్‌ఫెక్షన్‌ రోగి శరీరంలో 12 నుంచి 18 రోజులపాటు ఉంటుంది. చలి జ్వరం, నీరసం, తలనొప్పి, వాంతులు ప్రధాన లక్షణాలు. మలేరియా ప్యారసైట్‌ ఎర్ర రక్త కణాల్ని వేగంగా నాశనం చేస్తూ ఉంటుంది కాబట్టి ప్యారసైట్స్‌ను చంపటం కోసం కచ్చితంగా యాంటిబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. నీరసం తగ్గటానికి కొబ్బరినీరు, గ్లూకో్‌సలతోపాటు తేలికగా అరిగే ఘన పదార్థాలు కూడా తీసుకోవాలి. ఇక మలేరియా రాకుండా ఉండాలంటే దోమ కాటుకు గురికాకుండా ఉండటం ఒక్కటే మార్గం.
 
టైఫాయిడ్‌ 
సాల్మొనెల్లా టైఫై, పారాటైఫై అనే బ్యాక్టీరియాల నుంచి టైఫాయిడ్‌ వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉండే కలుషిత ఆహారం, నీరు తాగటం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. తర్వాత రక్తప్రవాహం ద్వారా కాలేయం, స్ప్లీన్‌, ఎముక మజ్జలోని తెల్ల రక్తకణాల్లో తిష్టవేస్తుంది.
 
లక్షణాలు: కాలేయం, స్ప్లీన్‌, ఎముక మజ్జలోకి ఈ బ్యాక్టీరియా చేరటంతోనే జ్వరం మొదలవుతుంది. 104 డిగ్రీలకు మించి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించటం లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో మలబద్ధకం లేదా డయేరియా లక్షణాలు కూడా కనిపించొచ్చు. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయంలోని పొరలు పలుచబడే పెరొయొటనైటిస్‌ అనే సీరియస్‌ కండిషన్‌కి దారితీయొచ్చు.
 
చికిత్స, జాగ్రత్తలు : మలం, రక్త పరీక్షల ద్వారా ఈ బ్యాక్టీరియాను తేలికగా గుర్తించవచ్చు. వ్యాధి నిర్థారణ జరగ్గానే యాంటిబయాటిక్స్‌తో శరీరంలో తిష్టవేసిన ఈ బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. తేలికగా అరిగే ఆహారంతోపాటు శక్తినిచ్చే ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. టైఫాయిడ్‌ రాకుండా ఉండాలంటే...శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి. బయట దొరికే పదార్థాలకు దూరంగా ఉండాలి. పళ్లు, కూరగాయల పైతొక్క తీసి తినాలి.
 
ఇన్‌ఫెక్షన్‌ కారక జ్వరాలు 
కొన్ని ఇన్‌ఫెక్షన్లు జ్వరం రూపంలో బయటపడుతూ ఉంటాయి. పెంపుడు జంతువుల మలమూత్రాల్లో ఉండే లెప్టొస్పొరోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ మలమూత్రాల మీద వాలిన ఈగలు ఆహార పదార్థల మీద వాలటం, వాటిని మనం తినటం వల్ల ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.
 
లక్షణాలు: ఐదారు రోజలపాటు జ్వరం విడవకుండా వేధిస్తూ బాధిస్తుంది. ఒంటి మీద దద్దుర్లు కూడా కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని కామెర్లు, కిడ్నీ ఫెయిల్యూర్‌ లక్షణాలు కనిపిస్తాయి.
 
చికిత్స: జ్వరం, ఒంటిమీద దదుర్లు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే స్థితి నుంచి తప్పించుకోవచ్చు. మల పరీక్షతో ఈ వ్యాధిని తేలికగా వైద్యులు గుర్తించగలుగుతారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈగలు ముసరకుండా పదార్థల మీద మూతలు ఉంచాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పెంపుడు జంతువుల మల మూత్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. 
 
జ్వరం కారక ఇతర వ్యాధులు 
అతిసారం, హంటా వైరస్‌, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ వ్యాధుల్లో కూడా జ్వరమే ప్రధాన లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. మధుమేహుల్లో కలరాతోపాటు జ్వరం ఉంటుంది. వైరస్‌ కారణంగా బాధించే అతిసారంలో కూడా జ్వరం ఉండొచ్చు. కాబట్టి అసలు వ్యాధిని కనిపెట్టి దానికి చికిత్స చేయగలిగితే జ్వరం దానంతటదే తగ్గిపోతుంది. ఎలుకల మలం ద్వారా వ్యాపించే హంటా వైర్‌సను పీల్చుకోవటం వల్ల వైరస్‌ శరీరంలోకి చేరి జ్వరం రూపంలో బయల్పడుతూ ఉంటుంది. ఎన్‌సెఫలైటిస్‌ వ్యాధిలో కూడా జ్వరమే ప్రధాన లక్షణం. 
 
హోమియో మందులతో 
జ్వరం అన్నది శరీరంలోని ఒక వ్యాధి తాలూకు లక్షణమే తప్ప వ్యాధి కాదు. కాకపోతే కొన్ని సార్లు శరీరం బాగా అలసిపోయినప్పుడు కూడా శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు. అయితే ఇలా అలసట వల్ల జ్వరం రావడం చాలా ఆరుదుగా కనిపిస్తుంది. శరీరం తీవ్రంగా వ్యాధిగ్రస్తమయ్యే డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా వంటి జబ్బుల్లో జ్వర తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇన్‌ ఫెక్షన్ల లోడ్‌ పెరిగినా కూడా జ్వరం రావచ్చు. అలాంటి సమయాల్లో హోమియో మందులు తీసుకుంటే జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
డెంగ్యూ 
ఈ వ్యాధి పేరు వినగానే రక్తంలోని ప్లేట్‌లెట్‌లు పడిపోవడం అనే పరిణామం గుర్తుకొస్తుంది. అయితే డెంగ్యూ ఒక మహమ్మారిగా మారి ఎక్కువ మందికి సోకుతున్న సమయంలో ఆర్సనిక్‌ ఆల్బ్‌ అనే మందును రోజుకు మూడు డోసులు వేసుకోవచ్చు. ఈ మందు వ్యాధి నిరోధకంగానూ, చికిత్సగానూ పనిచేస్తుంది. జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే రోజుకు ఐదు డోసులు కూడా వేసుకోవచ్చు. ఒక వేళ ప్లేట్‌లెట్‌లు పడిపోతున్నట్లయితే, హోమియో వైద్యుణ్ని సంప్రదించడం తప్పనిసరి. మామూలుగా అయితే ఫాస్పరస్‌ లేదా నిసిటిన్‌ వేసుకోవచ్చు. వ్యాధి లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు ఇపిటోరియం పెర్ఫరేటా, జెల్సీమియం, బెల్లడోనా మందులను హోమియో డాక్టర్‌ సూచిస్తారు. స్వైన్‌ఫ్లూ వ్యాధికి కూడా ఈ మందులు పనిచేస్తాయి.
 
టైఫాయిడ్‌ 
పలురకాల వ్యాధులను నయం చేసే శక్తి బెల్లడోనా మందుకు ఉంది. టైఫాయిడ్‌ వైద్యంలోనూ దాని పాత్ర కీలకమే. దీనితో పాటు బ్యాక్టీసియా అనే మందును కూడా తీసుకోవచ్చు.
 
మలేరియా 
ఈ కారణంగా వచ్చే జ్వరానికి చైనా ఆర్స్‌ బాగా పనిచేస్తుంది. ఆ క్రమంలో సంయుక్తంగా బెల్లడోనా మందును కూడా వేసుకోవచ్చు.
 
ఇన్‌ఫెక్షన్ల కారణంగా వస్తే.. 
ఇన్‌ఫెక్షన్ల తీవ్రత వల్ల జ్వరం వస్తే ముందు బెల్లడోనా వేసుకుని ఆ తర్వాత, రస్టాక్స్‌ వంటి మందులు వేసుకోవచ్చు. రోజుకు నాలుగైదుసార్లు ఈ మందులు వేసుకోవచ్చు. రెండు రోజుల తర్వాత ఎపిటోరియం పెరెఫరేటా మందులు కూడా వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. 
 
డాక్టర్‌ బి. సోహన్‌సింగ్‌
రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ 
ప్రభుత్వ హోమియో వైద్యశాల 
హైదరాబాద్‌