డిస్క్‌ సమస్యలకు హోమియో వైద్యం

05-07-2018: డాక్టర్‌గారు నా పేరు రమణరావు. వయస్సు 52 సంవత్సరాలు. ఈ మధ్య ఒక కాలుకు తిమ్మిరి రావడంతో పాటు గుంజుతోంది. ఎక్స్‌రే తీస్తే డిస్క్‌ ప్రాబ్లమ్‌ అన్నారు. దీనికి హోమియోపతి చికిత్స ఉందా?
 
మన శరీరంలో వెన్నెముక నిర్మాణం చాలా విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని నరాల మీద ఏ విధమైన ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం ఈ వెన్నెముక ప్రధాన లక్షణం. మన శరీర వ్యవస్థలో వెన్నెముక మూలస్తంభం మాదిరిగా పనిచేస్తుంది. వెన్నెముకకు తోడుగా కండరాలు, లిగమెంట్లు, డిస్క్‌లు ఉంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్క్‌లు, లిగమెంట్లు తోడ్పడుతాయి. వెన్నుపూసల మధ్య రబ్బరు కుదురులాంటి ఒక పదార్థం ఉంటుంది. దీన్ని డిస్క్‌ అంటారు. వెన్నుపాము పొడవునా ఎన్నో నరాలు వెళ్తుంటాయి. డిస్క్‌లలో వచ్చే ఇబ్బందులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డిస్క్‌ ప్రొలాప్స్‌, రెండోది డిస్క్‌ డీజనరేటివ్‌ డిస్క్‌ డిసీజ్‌. వెన్నెముకకు సంబంధించి డిస్క్‌ సమస్యలు, స్పాండిలోసిస్‌, కణుతులు, స్కోలియోసిస్‌, ట్యూమర్స్‌, సయాటికా సమస్యలు ప్రధానమైనవి.
 
డిస్క్‌కు బయట ఉన్న పొర బలహీనమవడం వల్ల డిస్క్‌ వెనకకు జరిగి కాళ్లలోకి వచ్చే నరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కాళ్లలో తిమ్మిర్లు రావడం, కాళ్లు మొద్దు బారడం జరుగుతుంది. దీనిని స్లీప్‌ డిస్క్‌ అంటారు. ఒక్కొక్కసారి యాస్కులస్‌ అనే పొర చిట్లి జెల్లీలాంటి డిస్క్‌ మెటీరియల్‌ బయటకు వస్తుంది. దీనిని డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటారు. డిస్క్‌ ప్రొలాప్స్‌ వచ్చినప్పుడు కాలును వంచకుండా తిన్నగా ఉంచి పైకి ఎత్తినప్పుడు కాలులో నొప్పి పెరుగుతుంది. ప్రతి పది మందిలో ఎనిమిది మంది తమ జీవితకాలంలో ఈ డిస్క్‌ సమస్యల బారిన పడుతుంటారు.
 
కారణాలు
అధిక బరువు, శక్తికి మించిన బరువులు ఎత్తడం.
ఎక్కువ దూరం పరుగెత్తడం.
రోజంతా వంగి పనిచేయడం.
వెన్నెముకకు దెబ్బలు తగలడం.
ద్విచక్ర వాహనాలపై ఎక్కువగా ప్రయాణించడం.

లక్షణాలు

నడుమునొప్పి, తిమ్మిర్లు.
స్పర్శ తగ్గడం, వంగినా లేచినా నొప్పి ఎక్కువగా ఉండడం.
అరికాళ్లలో మంటలు.
పక్కకు వంగి నడవడం.
కాలి వేళ్ల వరకు నొప్పి పాకడం.

హోమియోపతి చికిత్స

డిస్క్‌ సమస్యల నివారణ, చికిత్సలకు హోమియో వైద్యవిధానం ఒక వరం. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా హోమియో చికిత్స ప్రక్రియ ద్వారా దీన్ని తేలిగ్గా తగ్గించవచ్చు. దీనికి హోమియోలో హైపరికం, కాన్కేరియా ఫ్లోర్‌, బ్రమోనియా ఆల్బ్‌, సిమిసిప్యూగా మొదలగు మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్‌ సూచనల మేరకే వాడాలి.
 
డాక్టర్‌ కె.శ్రీనివాస గుప్తా, ఎం.డి హోమియో
స్టార్‌ హోమియోపతి
సికింద్రాబాద్‌
ఫోన్‌ నంబర్‌: 9246800011
www.starhomeopathy.com