బత్తిడికి దూరం లేకుంటే గుండెకు భారం

29/09/14

గుండెపోటుతో 40 ఏళ్ల వయసులోనే మృత్యువాతపడుతున్న వాళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యారు. జీవనశైలి, ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌, బిపి, షుగరు, నిత్యం వ్యాయామాలు చేయకపోవడం వంటివాటితోపాటు ఎమోషనల్‌ స్ర్టెస్‌ కూడా గుండెజబ్బులకు కారణమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. నిత్యజీవితంలోని రకరకాల మానసిక ఒత్తిడులు గుండెపై చూపే ప్రభావాన్ని తక్కువగా అంచనావేయొద్దని వారు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు 29 వరల్డ్‌ హార్ట్‌ డే పురస్కరించుకుని మానసిక ఒత్తిడి గుండెమీద చూపే ప్రభావాన్ని గురించి యశోదా హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ టి. శశికాంత్‌ పలు విషయాలు చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘ఈ సంవత్సరం ప్రపంచ హృద్రోగ దినోత్సవ నినాదం ‘హార్ట్‌-హెల్దీ ఎన్విరాన్‌మెంట్‌’ను సర్వత్రా సృష్టించడం. ఎక్కడ ఉన్నా, ఏం పనిచేస్తున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా గుండె ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాలి. గుండెజబ్బులను నివారించాలి. ఎందుకంటే గుండెజబ్బుల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆసియా, భారత్‌లలో చిన్న వయసులోనే గుండెజబ్బుల పాలబడుతున్న కేసులు ఆందోళనకరస్థాయిలో ఉంటున్నాయి. 30-40 ఏళ్లకే గుండెజబ్బులపాలబడుతున్న యువత రాను రాను ఎక్కువయిపోతున్నారు. ఆరోగ్యకర అలవాట్ల్లు, క్రమంతప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వంటి వాటివల్ల ప్రతి ఐదుమందిలో నలుగురికి గుండెజబ్బులు రాకుండా నిరోధించవచ్చు. అంటే 80 శాతం మందిలో గుండెజబ్బులు రాకుండా నివారించగలమన్నమాట. కానీ ఎంతమంది ఆరోగ్యకరమైన అలవాట్లను క్రమంతప్పకుండా అనుసరిస్తున్నారన్నది అసలు ప్రశ్న. అలా క్రమశిక్షణతో మెలుగుతున్నవారు మనలో ఎక్కువమంది లేరనే చెప్పాలి. 

మానసిక ఒత్తిడీ ప్రమాదమే...

గుండెజబ్బులకు కారణాలుగా మధుమేహం, అధికరక్తపోటు, ఊబకాయం, ఆరోగ్యకరరమైన డైట్‌ అలవాట్లు లేకపోవడం, స్మోకింగ్‌, తాగుడు వంటివాటిని సర్వసాధారణంగా చెప్పుకుంటాం. కానీ ఎమోషనల్‌ స్ట్రెస్‌ కూడా గుండెకు మంచిది కాదు. మానసిక ఒత్తిడికి గుండెజబ్బులకు చాలా దగ్గర సంబంధం ఉంది. సాధారణమైన ఒత్తిడి వల్ల ఇబ్బంది లేదు. ఆరోగ్యకరమైన ఒత్తిడి వల్ల శరీరం నుంచి హార్మోన్లు విడుదలై మనం ఎంతో చురుగ్గా పనిచేస్తాం. కానీ ఎక్యూట్‌ స్ట్రెస్‌, క్రానిక్‌ స్ట్రెస్‌లు చాలా ప్రమాదకరమైనవి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మిగతా వ్యాధులకు స్పందించినట్లు ఒత్తిడి సమస్య పట్ల వెంటనే స్పందించం మనం. 

ఒత్తిడికి లోనయ్యేవారు పొగతాగడం, అతిగా తినడం వంటివి చేస్తుంటారు. ఇవి గుండెజబ్బులకు దారితీస్తాయి. ఒత్తిడికి గురవడం వల్ల శరీరం పనితీరులో తీవ్రమైన మార్పు పొడసూపుతుంది. రక్తప్రవాహంలో, నాడీ వ్యవస్థలో మార్పులకు కారణమవుతుంది. ఇవి గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేవారికి ఛాతీ నొప్పి వస్తుంది. గుండెకు వెళ్లే రక్తప్రవాహంలో తేడాపాడాలు సంభవిస్తాయి. ఇది రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడికి గురయ్యేవారి ప్రవర్తనలో కూడా తీవ్రమైన మార్పులు పొడసూపుతాయి. ఎమోషనల్‌ స్ట్రెస్‌ కొందరిలో క్రానిక్‌ గుండెజబ్బులకు కారణమవుతుంటుంది. కొన్ని సందర్భాలల్లో తీవ్రమైన ఒత్తిడికి హఠాత్తుగా లోనవుతుంటాం. అలాంటి తీవ్రమైన స్ట్రెస్‌ కార్డియోమయోపతి లేదా బ్రేకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌కు కారణమవుతుంది. ఒత్తిడి కూడా అందరిలో ఒకే విధంగా ఉండదు. వ్యక్తి వ్యక్తికీ మధ్య తేడాలుంటాయి. అయితే దాన్ని నియంత్రించడానికి ఏవిధంగా స్పందిస్తున్నామన్నది చాలా ముఖ్యమైన విషయం. తరచూ అనారోగ్యంతో బాధపడడం, ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు, భార్యాభర్తలు, స్నేహితుల మధ్య వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు, కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు, నిరుద్యోగం వల్ల, ప్రెగ్నెన్సీ, కోర్టు సమస్యలు, ఆర్థికసమస్యలు వంటి నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల వల్ల కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతారు.

ఒత్తిడికి కారణాలు ఎన్నో...

ఒత్తిడిని ఎలా గుర్తించాలి అంటారా? తలతిరగడం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, జీర్ణవ్యవస్థ బాగుండకపోవడం, కండరాలపై ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి కొన్ని భౌతికమైన లక్షణాలుంటే ఆ వ్యక్తి ఒత్తిడికి లోనవుతున్నాడని అర్థం. అలాగే మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, ఒంటరితనం, నెగిటివ్‌ ఆలోచనాధోరణి, హాస్యధోరణి లేకపోవడం వంటి మానసికమైన లక్షణాలు కూడా ఒత్తిడిని సూచిస్తాయి. కోపం, విషాదం, నెర్వస్‌నెస్‌ వంటి రకరకాల ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ కూడా ఒత్తిడి ని సూచిస్తాయి. హఠాత్తుగా ఉద్రేకపడిపోవడం, ఎప్పుడూ అశాంతిగా కనిపించడం, ఆల్కహాల్‌, డ్రగ్స్‌ వినియోగం, సమాజానికి, వ్యక్తులకు దూరంగా ఒంటరిగా ఉండడం వంటి ప్రవర్తన ఎవరిలోనైనా గమనిస్తే వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని అర్థంచేసుకోవాలి. మానసిక-సామాజిక పరిస్థితులు కూడా మనిషిని మానసికంగా ఎంతో కృంగదీస్తాయి. గుండెమీద ప్రభావం చూపుతాయి. 

ఒత్తిడిని రేకెత్తించే కారణాలు చాలా ఉంటాయి. అది కుటుంబం వల్ల కావొచ్చు, ఆఫీసులోని పని పరిస్థితుల వల్ల కావొచ్చు, సమాజంతో సంబంధాల పరంగా ఎదుర్కొనే ఒత్తిడుల వల్ల కావొచ్చు. బాస్‌తో, భార్యతో, పిల్లలతో, చుట్టుపక్కల వాళ్లతో, సమాజంతో ఏదో రకమైన గొడవలు తలెత్తడం వల్ల కూడా ఒత్తిడికి గురవుతుంటాం. రోజువారి పనులపట్ల అశాంతిగా ఉండడం, ఆగ్రహంతెచ్చుకోవడం, గొడవలు పడడం వంటివి గుండె ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎక్కువ కోపం కూడా గుండెకు మంచిది కాదు. దీనివల్ల కార్డియాక్‌ అరెస్టు సంభవించే అవకాశం ఉంది. స్త్రీలు కూడా మానసిక ఒత్తిడికి గురయ్యే కారణాలు కోకొల్లలు. ఇంటిపని, వంటపని, కుటుంబబాధ్యతలు, సంసారం సాఫీగా సాగేట్టు చూసుకోవాలనే ఒత్తిడి, భర్తతో గొడవలు లేకుండా జీవితం గడపాలని, పిల్లల చదువుసంధ్యల గురించి ఎక్కువ ఆలోచించడం వంటివి వాళ్లలో మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఇంకొందరు ఒకే సమయంలో రకరకాల పనులు చేస్తుంటారు ఇది కూడా తీవ్ర ఒత్తిడికి కారణమవుతుంది. గుండె మీద ఒత్తిడి తెస్తుంది. మానసిక ఒత్తిడి గుండె మీద చూపే ప్రభావం గురించి మాటల్లో చెప్పనక్కర్లేదు. ఇవే కాకుండా పలు విషాద ఘటనల గురించి విన్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా ఏదైనా ప్రమాదం వాటిల్లినపుడు తీవ్ర మానసిక వ్యధకు గురవ్వడం వల్ల కూడా కొందరిలో గుండెపోటు వస్తుంది. ఎమోషనల్‌ స్ట్రెస్‌ (కుటుంబం, సమాజంలోని వివిధరకాల వ్యక్తులతో ఉండే సంబంధాలకు సంబంధించి) తోపాటు ఫిజికల్‌ స్ట్రెస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్ర్టెస్‌ (వాయు, శబ్దకాలుష్యం, రసాయనాల కాలుష్యం వంటివి) ఒత్తిడిని పెంచుతాయి. గుండెజబ్బులకు దారితీస్తాయి. 

ఒత్తిడి వల్ల గుండెపోటు...

తరచూ అనారోగ్యానికి గురవడం వల్ల వచ్చే ఒత్తిడి ఇంకొకటి. ఈ ఒత్తిడుల వల్ల బిపి వస్తుంది. మధుమేహసమస్య తలెత్తుతుంది. ఛాతినొప్పి వస్తుంది. గుండెవేగంగా కొట్టుకుంటుంది. అప్పుడప్పుడు గుండె లయలో తేడాలు తలెత్తుతుంటాయి కూడా. కార్డియాక్‌ న్యూరోసిస్‌ తలెత్తుతుంది. గుండెనొప్పి వస్తుంది. హఠాన్మరణం సంభవిస్తుంది. ఒత్తిడికి లోనయిన ప్రతి పదిమందిలో ఆరుగురికి గుండెపోటు వస్తోందని గణాంకాలు చెపుతున్నాయి. పేదరికం, ఆర్థికసమస్యల వల్ల క్రానిక్‌ స్ట్రెస్‌ వారికి ఉంటుంది. విడాకులు తీసుకున్నవారిలో, వైవాహిక సమస్యలతో బాధపడుతున్నవారిలో ఈ ఒత్తిడి మూడు రెట్లు ఎక్కువగా ఉంటోందిట. అలాగే సామాజికంగా ఒంటరి అయిన వారిలో కూడా గుండెపోటు కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. స్నేహితులు, కుటుంబసభ్యుల నైతిక మద్దతు లభిస్తే వారు ఆరోగ్యవంతులుగా అవుతారు. ప్రతికూల ఆలోచనాధోరణి ఉన్న వారిలో కూడా గుండెజబ్బుల సమస్య బాగా ఉంటోంది. బిపి వల్ల కూడా గుండెపోట్లు బాగా వస్తున్నాయి. ఒత్తిడి తీరును బట్టి దాని ప్రభావం తీవ్రత ఉంటుంది. 
విడాకులు పొందిన కేసుల్లో, ఉద్యోగాలు కోల్పోయినపుడు, బిజినెస్‌లో నష్టపోయినపుడు, హింసకు గురైనపుడు, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు తీవ్రమైన కార్డియాక్‌సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకులు మూతపడినప్పుడు గుండెపోటుతో చనిపోయేవారు ఎక్కువమంది ఉంటున్నారు. కోపం బాగా ఉన్నవారు సైతం ఎక్కువగా గుండెపోటుకు, స్ట్రోక్‌కు గురవుతున్నారు. అలాగే రద్దీగా ఉండే రోడ్లకు సమీపంగా ఉండేవారు శబ్దకాలుష్యం బారిన పడి గుండెజబ్బులు తెచ్చుకుంటున్నారు. వారి జీవితకాలంలో మూడు సంవత్సరాల ముందు చనిపోతున్నారు. 

సరిగా స్పందించకపోతే ప్రమాదమే...

ఈ ఒత్తిడిని కనుక సరిగా ట్రీట్‌చేయకపోతే ముందరచెప్పినట్టు తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంది. ఒంట్లో శక్తియుక్తులను చంపేస్తుంది. రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. ఎమోషనల్‌ అయిపోతారు. మానసికంగా కృంగిపోతారు. ఒత్తిడి వల్ల ఆరోగ్యమే కాదు ఉద్యోగం, డబ్బు చివరకు జీవితం కూడా కోల్పోతారు. ఒత్తిడిపాలబడిన వారిలో కోపం ఎక్కువగా ఉంటుంది. అలసిపోతుంటారు. ప్రతికూల ఆలోచనాధోరణి పెరుగుతుంది. ప్రతిదానికీ తీవ్రంగా స్పందిస్తుంటారు. తరచూ తలనొప్పితో బాధపడుతుంటారు. తరచూ జీర్ణకోశ సమస్యలు తలెత్తుతుంటాయి. బరువు విపరీతంగా పెరగడం, తగ్గిపోవడం జరుగుతుంది. డిప్రెషన్‌, నిద్రలేమి బాగా ఉంటుంది. అసహాయత, అనుమానాలతో బాధపడుతుంటారు. మానసిక ఒత్తిడితో బాధపడేవారి వల్ల పక్కవారికి కూడా సమస్యలే.’’
 

మార్పుతో ఆరోగ్యం

జీవనశైలిని కొంతవరకూ మార్చుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. తద్వారా గుండెజబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. నిత్యం ఏరోబిక్‌ ఎక్సర్‌ సైజులు చేయాలి. కొవ్వు తక్కువ ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ పాటించాలి. యోగా, మెడిటేషన్‌ వంటివి చేస్తే ఒత్తిడి నుంచి   బయటపడగలరు. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిత్యం 40 నిమిషాలు నడవాలి. మద్యపానం,  పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.