లవ్‌ ఫెయిలైతే ‘గుండె బద్దలవుతుంది’

ప్రేమలో విఫలమైనవాళ్లు ‘గుండె బద్దలైపోయింది’ అంటూ ఉంటారు. నిజంగానే ప్రేమకంత బలముందని పరిశోధనల్లో రుజువైంది. ప్రేమలో విఫలమవటం లేదా ప్రేమించిన వ్యక్తి దూరమవటం వల్ల ఆ ప్రభావం గుండె మీద పడుతుందని, దాంతో గుండె జబ్బులు మొదలుకుని రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా వారంటున్నారు. ఎడిన్‌బర్గ్‌ నేపియర్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రేమలో విఫలమైన వెయ్యి మంది వ్యక్తుల ఆరోగ్య సమస్యలను పరిశీలించి ఈ విషయాన్ని ధృవీకరించారు. 

జీవితంలో ఎంత ఎక్కువ దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటే ఆరోగ్యం కూడా అంతే దుర్భరంగా తయారవుతుందని, మరిముఖ్యంగా గుండెపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రయోగాల్లో తేలింది. ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినా, వ్యక్తికి దూరమైనా దీర్ఘకాలంపాటు కొనసాగే ఒత్తిడి అధిక రక్తపోటు, మధుమేహం, ఆర్థరయిటి్‌సలాంటి పలురకాల ఆరోగ్య సమస్యలకు మూలమవుతుందని పరిశోధకులు తేల్చారు. కాబట్టి ప్రేమ వికటించి గుండె బద్దలయ్యింది అని ఇకముందు ఎవరైనా అంటే తేలిగ్గా తీసి పారేయకండి. పర్యవసానంగా తలెత్తబోయే రుగ్మతల గురించి ఆ వ్యక్తిని హెచ్చరించండి.