గుర్తించని గుండె జబ్బులు..ఆ సమయంలో ఏం చేయాలంటే..

ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు!
ఆందోళన కలిగిస్తున్న ఆకస్మిక మరణాలు
పుట్టుకతో గుండె జబ్బులు ప్రాణాంతకమవుతున్న తీరు
అప్పటివరకూ కనిపించని లక్షణాలు
అప్రమత్తతే అవసరమంటున్న వైద్యులు

హైదరాబాద్‌ సిటీ,18-10-2018: బోరబండ పెద్దమ్మనగర్‌లో నివాసం ఉండే సతీష్‌ (26) ప్రైవేట్‌ ఉద్యోగి. బస్తీలో వినాయకుడిని నిమజ్జన శోభాయాత్రలో డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలిపోయాడు. మద్యం మైకంలో పడిపోయోడేమోనని స్థానికులు ఆయన్ని ఎత్తుకుని ఇంట్లో పడుకోబెట్టారు. కొద్దిసేపటికి సతీష్  కన్నుమూశాడు.

కొమరవెల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేసే నిమ్మనాయక్‌కు ఇటీవల పాతబస్తీలో గణేస్‌ నిమ్మజనం డ్యూటీ వేశారు. హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆయనకు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఛాతి నొప్పి వచ్చింది. పోలీసులు వెంటనే కేర్‌ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి తెల్లవారుజామున మృతిచెందారు. ఇలా అప్పటివరకు హుషారుగా ఉన్నవారు సైతం కళ్లముందే కుప్పకూలిపోతున్నారు. యువకులు, నడి వయస్సు వారిలోనే ఈ సమస్య ప్రధానం కనిపిస్తోంది. అప్పటి వరకూ ఎలాంటి జబ్బుల లక్షణాలూ కనిపించనివారూ ఉన్నట్టుండి మృత్యుఒడికి చేరుతున్నారు. ప్రతి పది మందిలో కనీసం ఇద్దరు, ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
 
గుర్తించని గుండె జబ్బులు
కొందరిలో గుర్తించని గుండె జబ్బులు ఉంటాయి. ఆ లక్షణాలు బయటకు కనిపించకపోయినా సడన్‌గా ప్రభావం చూపుతాయి. క్షణాల్లో గుండె లయ తప్పుతుంది. అలాంటి వారిలో పుట్టుకతో గుండె జబ్బులు ఉండడమే ప్రధానం కారణంగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. కార్డియోమయోపతి వంటి గుండె జబ్బులు ఉన్న వారికి ఏ వయస్సులోనైనా సమస్య ఎదురయ్యే ప్రమాదముందని, అది ఆకస్మాత్తుగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దీన్నే హైపర్‌ ట్రాఫిక్‌ కార్డియో మయోపతిగా వ్యవహరిస్తారని కేర్‌ ఆస్పత్రి జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ గోవర్థ‌న్‌ తెలిపారు.
 
గుండె స్పందనలు పెరిగితే...
సాధారణంగా గుండె నిమిషానికి 80 నుంచి 100 సార్లు కొటకుంటుంది. పుట్టుకతో గుండె జబ్బులున్న వారిలో కొన్నిసార్లు వేగం పెరుగుతుంది. తీవ్ర వేగం వల్ల హార్ట్‌ పంపింగ్‌ సరిగ్గా జరగదు. వేగం వందకు మించి కొట్టుకుంటే కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చే ప్రమాదముంది. రక్తపోటు పడిపోవడం, గుండె బలహీనమవడంతో ఆకస్మాత్తుగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్టార్‌ ఆస్పత్రి చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ గూడపాటి చెప్పారు. కొందరు గుండె కండరాల సమస్యతో బాధపడుతుంటారు. కానీ, గుర్తించలేరు. కండరాల జబ్బుతో గుండె స్పందనల్లోనూ వస్తుంది. ఈసీజీ తీసినప్పుడు మాత్రమే నిర్ధారించడానికి వీలుంటుంది. ఇలాంటి సమస్య ఉన్న వ్యక్తుల్లో గుండె స్పందనల్లో తేడా రావడం వల్ల ఉన్నంట్టుండి చనిపోతారు.
 
ఏ వయస్సులో అయినా ప్రమాదమే
పుట్టకతో గుండె జబ్బులున్న వ్యక్తులు ఏ వయస్సులోనైనా అకస్మాత్తుగా చనిపోయే ప్రమాదముంది.
బాధితుల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. చనిపోయే తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటోంది.
ఎక్కువసేపు వ్యాయమం చేసినా, ఆగకుండా డ్యాన్స్‌ చేసినా, ఎక్కువసేపు పరుగెత్తినా గుండె వేగం పెరిగి తీవ్రతతో స్పందనలు ఆగిపోవచ్చు.
విపరీతంగా మద్యపానం చేసేవారు, మాదక ద్రవ్యాలు తీసుకునే వారిలో గుండె కణాజలంపై వాటి ప్రభావం పడి గుండె వేగం పెరుగుతుంది.
పుట్టకతో గుండె జబ్బు ఉన్న వారిలో సమస్య రావడమే ప్రాణాంతకంగా వస్తుంది.
గుండె లయ దెబ్బతినడం వల్ల మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం, ఆక్సిజన్‌ అందకపోవడం, బీపీ పడిపడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతా ఐదారు నిమిషాల్లోనే జరిగిపోతోంది.
బ్రెయిన్‌ ఫెయిల్‌ అవడంతో కార్డియక్‌ అరెస్ట్‌కు దారితీస్తుంది.
- డాక్టర్‌ గోవర్ధన్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజిషియన్‌, కేర్‌ ఆస్పత్రి
 
తెలియకుండానే మరణం
గుండె కండరాల బలహీనత వల్ల కార్డియోమయోపతి సమస్య తీవ్రత పెరుగుతుంది.
ఎడమ వైపు ఉండాల్సిన రక్తనాళం కుడివైపు ఉంటే, కుడి వైపు రక్తనాళం ఎడమ వైపున ఉంటే గుండె లయ తప్పుతుంది.
గుండె వాల్వ్‌కు సంబంధించిన జబ్బుల వల్ల హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
వాల్వ్‌ జబ్బుల వల్ల రక్తనాళంలో ఒత్తిడి పెరిగి గుండె వేగం పెరుగుతుంది.
మద్యం, ధూమపానం అలవాటు ఉన్న వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
40నుంచి 45 ఏళ్లలో చనిపోయే ప్రతి పది మందిలో ముగ్గురు ఆకస్మాత్తుగా చనిపోతున్నారు.
రక్తనాళంలో బ్లాక్‌ అయితే మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోతోంది. ఇటువంటి వారికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది.
సాధారణంగా ఈసీజీ, టీఎంటీ వంటి పరీక్షలు చేస్తేనే పుట్టకతో వచ్చే గుండె జబ్బులను గుర్తించవచ్చు.
బాధితుల్లో లక్షణాలు గుర్తిచడం కష్టం. అప్పటివరకు కూడా చలాకీగా ఉంటారు.
కొన్ని రకాల సూచనల ద్వారా గుండె సమస్యను అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి.
ఆయాసం, కళ్లు తిరగడం, చీకట్లుగా అనిపించడం, సృహ తప్పిపోడం సూచికలుగా గుర్తుపెట్టుకోవాలి.
గుండె దడగా అనిపించడం, పనిచేసినప్పుడు అలసిపోవడం, ఛాతిలో నొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
- డాక్టర్‌ రమేష్‌ గూడపాటి, చీఫ్‌ కార్డియాలజిస్ట్‌, స్టార్‌ ఆస్పత్రి