ఒత్తిడికి లోనైతే గుండెకు ముప్పే

31-01-12

 దైనందిన జీవితంలో ఒత్తిడి వల్ల తక్కువ వయసులోనూ హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. హృద్రోగ కారకాలైన అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ లెవెల్‌ పెరగటంతో పాటు మధుమేహం అదుపు తప్పుతోంది. ఫలితంగా యుక్త వయసులోనే హృద్రోగ సమస్యలు వస్తున్నాయి. గుండెజబ్బులకు దారితీస్తున్న ఒత్తిడిని ఎలా గుర్తించాలి? దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనే అంశాలను వివరిస్తున్నారు సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ కె. నరసరాజు.
 
 
బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌(బీపీవో), కాల్‌ సెంటర్లలో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, బ్యాంకు ఉద్యోగులు, అధిక ఒత్తిడికి గురయ్యే ఉద్యోగుల్లో ఇటీవల హృద్రోగాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. నైట్‌డ్యూటీలు చేసేవారు, ఎలాంటి వ్యాయామం చేయకుండా కుర్చీకే అతుక్కుపోయి పనిచేస్తున్న వారికి మానసిక ఒత్తిడి ప్రభావం వల్లనే వ్యాధుల బారిన పడుతున్నారని విశ్లేషణలో తేలింది. యుక్తవయసు వారిలోనూ మానసిక ఒత్తిడి వల్ల గుండెజబ్బులకు కారణమవుతుంది. దీనివల్ల 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల వారిలో 30 శాతానికి పైగా గుండెజబ్బులతో చికిత్సకు వస్తున్నారు. హృద్రోగాలకు కారణమవుతున్న మానసిక ఒత్తిడికి గల కారణాలను గుర్తించి, వాటిని అధిగమించేలా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

ఒత్తిడి లక్షణాలు

మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. అయితే అధిక ఒత్తిడి బీపీ, కొలెస్ట్రాల్‌, డయాబెటీస్‌ను పెంచుతుంది. సరిగా నిద్ర పట్టకపోవటం, పగలు గుండె దడ ఉండటం, ఆందోళనగా కనిపించటం, ఏకాగ్రత లోపించటం, చెమట పట్టడం, చేతుల్లో వణుకు రావటం, గుండె భారంగా అనిపించటం, తీవ్ర అలసట, కడుపులో మంట, ఎలాంటి కారణం లేకుండానే ఒత్తిడితో విరోచనాలవ్వటం ఒత్తిడి లక్షణాలు. ఆందోళన వల్ల వచ్చే ఒత్తిడి, గుండెజబ్బులకు దారితీసే ఒత్తిడిని వివిధ పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి.

ఒత్తిడిని గుర్తించే పరీక్షలు

మానసిక ఒత్తిడితోపాటు హృద్రోగ ముప్పును గుర్తించేందుకు వీలుగా కార్డియాలజిస్ట్‌ పర్యవేక్షణలో కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ, స్ట్రెస్‌ టెస్ట్‌, ఇకో కార్డియోగ్రామ్‌, యాంజియోగ్రామ్‌, టీఎంటీ పరీక్షలు చేయించుకోవాలి. యాంజియోగ్రామ్‌ పరీక్షలో గుండెజబ్బు ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ పరీక్ష రెండు రకాలుగా చేయవచ్చు. రోగి చరిత్ర, చేసే వృత్తి, లక్షణాలను బట్టి ఒత్తిడిని గుర్తించవచ్చు. 
ఇన్‌వెజిల్‌ యాంజియోగ్రామ్‌ : చేయి లేదా తొడ భాగంలోని రక్తనాళానికి చిన్న రంధ్రం చేసి దాని ద్వారా ఒక ట్యూబ్‌ను పంపించి గుండెలోని రక్తనాళం ఎలా ఉందో పరీక్షిస్తారు. దీన్ని ఇన్‌వెజిల్‌ యాంజియోగ్రామ్‌ అంటారు. ఇన్‌వెజిల్‌ యాంజియోగ్రామ్‌ ఇన్‌పేషంట్లకు మాత్రమే చేస్తారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలి. 
నాన్‌ ఇన్‌వెజిల్‌ యాంజియోగ్రామ్‌ : అధునాతన మైన ఈ పద్ధతిలో రక్తనాళంలో కాంట్రాస్ట్‌ ఇంజక్షన్‌ ఇచ్చి, ఛాతీ భాగంలో ప్రత్యేక సీటీ స్కానర్‌ 64 స్లైస్‌ సీటీ కొరోనరీ యంత్రం సహాయంతో స్కాన్‌ చేస్తారు. ఈ పరీక్ష ద్వారా గుండెలోని రక్తనాళాలను పరీక్షిస్తారు. దీన్ని సీటీ కొరొనరీ యాంజియోగ్రామ్‌ కూడా అంటారు. ఈ పరీక్ష అవుట్‌ పేషంట్లకు సైతం చేయవచ్చు.

 ఒత్తిడిని జయిద్దాం ఇలా..

గుండె జబ్బులకు దారితీస్తున్న ఒత్తిడిని నివారించేందుకు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలి. దీని వల్ల హృద్రోగ ముప్పు నుంచి దూరంగా ఉండవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే దురలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం అలవాటును పూర్తిగా మానుకోవాలి. వేళాపాళా లేకుండా క్రమం తప్పి భోజనం చేయటం మానుకోవాలి. ఒక క్రమబద్ధమైన వేళకు భోజనం చేయటంతోపాటు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో తక్కువ ఉప్పును తీసుకోవాలి. వ్యాయాం క్రమం తప్పకుండా చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు రిలాక్సేషన్‌ టెక్నిక్‌లైన యోగా, మెడిటేషన్‌లు నిత్యం చేయాలి. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారి వారి ఆసక్తి, అభిరుచిని బట్టి మనసును ఇతర వ్యాపకాలపై మళ్లించాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం, ఆత్మీయులతో మాట్లాడటం, కాలాను గుణంగా కొత్త ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లటం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసికవైద్యుల వద్ద కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు కొన్ని మెళకువలను పాటించటంతోపాటు నిపుణుల వద్ద కౌన్సెలింగ్‌ చేయించుకుంటే ఫలితం ఉంటుంది. 40 ఏళ్ల లోపు వారికి వచ్చిన హృద్రోగాలకు కారణాలు విశ్లేషిస్తే ఒత్తిడి వల్లనే బీపీ, కొలెస్ట్రాల్‌, మధుమేహం స్థాయి పెరిగి గుండెజబ్బులు వచ్చాయని వెల్లడైంది. ఒత్తిడి దూరం చేసుకోవటంతోనే గుండెజబ్బుల బారి నుంచి బయటపడవచ్చనే వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంది.
 
డాక్టర్‌ కె. నరసరాజు
సీనియర్‌ కార్డియాలజిస్ట్‌
యశోద హాస్పిటల్‌, సికింద్రాబాద్‌
హైదరాబాద్‌
ఫోన్‌ : 98480 52401