హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌ హృద్రోగులకు వరం

12-06-13
 
ప్రస్తుతం వైద్య రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల పరిస్థితిని సూక్ష్మాతిసూక్ష్మంగా పరీక్షించి, విశ్లేషించి, నిర్ధారించే పరీక్ష పరికరంగా ఉపయోగపడటంతో పాటు క్షణాల్లో ఆపరేషన్‌ థియేటర్‌గా కూడా మారిపోయే హైబ్రీడ్‌ క్యాథటరైజేషన్‌ ల్యాబ్‌(హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌) ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో వేళ్ల మీద లెక్కించగల అతి కొద్ది  ఆసుపత్రులలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. సన్‌షైన్‌ హాస్పిటల్స్‌కు చెందిన హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఈ యూనిట్‌ని ఏర్పాటుచేసింది. హైబ్రీడ్‌ క్యాథ్‌ల్యాబ్‌  ఏ విధంగా హృద్రోగులకు వరమో వివరిస్తున్నారు సన్‌షైన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌  డాక్టర్‌ జి. అనిల్‌ కృష్ణ.
 
నవ శరీరంలోని ప్రతి అవయవానికి అనుక్షణం గుండె ద్వారానే రక్తం సరఫరా అవుతుంది. రోజుకు గరిష్ఠంగా లక్షసార్లు గుండె కొట్టుకుంటూ రెండు వేల గ్యాలన్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది. అందుకే మనిషి సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించాలంటే గుండె ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కానీ ఆధునిక జీవనశైలి ఫలితంగా పాతికేళ్లు నిండకముందే గుండెజబ్బుల బారిన పడుతున్న వారు కోకొల్లలు. గుండె జబ్బుల్ని గుర్తించటం ఒక ఎత్తయితే, సత్వర వైద్యం అందించి రోగి ప్రాణాల్ని కాపాడటం హృద్రోగ వైద్యులకు పెద్ద సవాలు. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ఆధునిక రోగ నిర్ధారణ పరికరాలు వచ్చాయి. వాటన్నింటిలోకి తలమానికంగా నిలవటంతో పాటు, హృద్రోగుల పాలిట వరంగా నిలుస్తుంది ప్రస్తుతం మా హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలలో ఎక్కడైనా బ్లాక్స్‌ ఏర్పడినపుడు వాటిని తెలుసుకోవడం ఒక దశ అయితే వెంటనే ఆ అవరోధాలను తొలగించడానికి చికిత్స అందచేయడం మరో సంక్లిష్టమైన దశ. ఈ రెండు దశలను ఒకే చోట నిర్ధారించుకుని వెంటనే చికిత్స ప్రారంభించడం హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌ ద్వారా మాత్రమే సాధ్యం. 

సాధారణ కాథ్‌ల్యాబ్‌ ప్రయోజనాలివి

ఒకప్పుడు తొడల దగ్గర ఉండే రక్తనాళాల నుంచి బ్లాక్స్‌ను గుర్తించడానికి యాంజియోగ్రామ్‌ చేసేవారు. ప్రస్తుతం చేతి మణికట్టు ద్వారా రక్తనాళాల బ్లాక్స్‌ను గుర్తించడం జరుగుతోంది. దీన్ని ఫిమోరల్‌ అండ్‌ ట్రాన్స్‌ రేడియల్‌ ప్రొసీజర్‌ అంటారు. మెదడు, కిడ్నీ, కాళ్ల దగ్గర ఉండే రక్తనాళాలను కూడా యాంజియోగ్రామ్‌ చేసి ఆపైన యాంజియోప్లాస్టీ చేయడం దీనిద్వారా సాధ్యపడుతుంది.
డైరెక్ట్‌ స్టెంటింగ్‌, డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంటింగ్‌, బెలూన్‌ యాంజియోప్లాస్టీలను హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌లో చేయవచ్చు. 
తాత్కాలిక, శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చవచ్చు.
ఐసిడి మరియు హార్ట్‌ ఫెయిల్యూర్‌ పరికరాలను ఇక్కడ అమర్చవచ్చు.
సింగిల్‌ మరియు డబుల్‌ ఛాంబర్‌ పేస్‌మేకర్‌  అమర్చవచ్చు.
బెలూన్‌ వాల్వోటోమీస్‌, పిల్లల్లో ఏర్పడే హార్ట్‌ హోల్స్‌కు సంబంధించిన చికిత్సలు, గుండెకు సంబంధించిన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌, ఎలెకో్ట్ర ఫిజియాలజీ స్టడీస్‌ వంటివి దీని ద్వారా సాధ్యపడుతుంది. ట్రాన్స్‌క్యాథటర్‌ ఎంబోలో థెరపీ, ఎండో వ్యాస్క్యులర్‌ అవోర్టా రిపేర్‌ వంటికి కూడా ఇందులో చేయవచ్చు. 
హైబ్రీడ్‌ క్యాథ్‌ల్యాబ్‌ అమృతధార
సాధారణంగా క్యాథ్‌లాబ్‌ అంటే యాంజియోగ్రామ్‌ లేదా యాంజియోప్లాస్టీ చేయడానికే ఉపయోగిస్తారన్న భావన ఉంది. కాని కొన్ని మేజర్‌ సర్జరీలను నివారించడానికి కూడా ఈ హైబ్రీడ్‌ క్యాథ్‌ లాబ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. డయాగ్నిసిస్‌, సర్జరీ ఒకే చోటు నుంచి చేయడం హైబ్రీడ్‌ క్యాథ్‌ లాబ్‌లో మాత్రమే సాధ్యం. 
హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌ వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనం ఇది వ్యాధి నిర్ధారణ(డయాగ్నిసిస్‌)కు మాత్రమే కాదు అక్కడిక్కడే ఆపరేషన్‌ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. యాంజియోగ్రామ్‌ చేసిన పేషెంట్‌కు సర్జరీ అవసరమైన పక్షంలో ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించాల్సిన అవసరం లేకుండా వెంటనే అదే టేబుల్‌ మీద ఆపరేషన్‌ చేయడం ఇందులో మాత్రమే సాధ్యపడుతుంది. 

గుండె జబ్బులకు సంబంధించి డయాగ్నసిస్‌ చేసే సమయంలో ఒక్కోసారి తక్షణమే సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అలాంటి పరిస్థితిలో అక్కడి నుంచి ఆపరేషన్‌ థియేటర్‌కు మార్చే సమయంలో కొంత రక్తాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. రక్తనష్టం జరగకుండా అక్కడే ఆపరేషన్‌ చేసే సౌలభ్యం హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌లో మాత్రమే సాధ్యం.

హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌లో శరీరంలోని అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన లోపాలు కూడా విస్పష్టంగా గోచరిస్తాయి. దీని వల్ల ప్రాణం కోల్పోయే పరిస్థితి నుంచి రోగిని కాపాడవచ్చు.
ఇసిజి, 2డి ఎకో, టిఎంటి, యాంజియోగ్రామ్‌ లాంటి డయాగ్నిస్టిక్‌ పరీక్షలను నిర్వహస్తూనే అత్యంత క్లిష్టమైన కార్డియాక్‌ సర్జరీలను కూడా హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌లోనే  చేయవచ్చు.
క్యాథ్‌ ల్యాబ్‌తో పోలిస్తే హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌లో కనిపించే రోగి శరీర అవయవాలకు సంబంధించిన చిత్రాల ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. రక్తనాళాల గోడలకు కాల్షియం అంటుకుని ఉన్న పక్షంలో అది సూక్ష్మాతిసూక్ష్మంగా కూడా హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌ ద్వారా గుర్తించవచ్చు. వెంటనే చికిత్స కూడా అందచేయవచ్చు.
 వైద్య రంగంలో అందుబాటులో ఉన్న ఈ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా హృద్రోగులకు అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలను అందచేసేందుకు ఈ ఆధునిక డయాగ్నిస్టిక్‌ పరికరం ఎంతో ఉపయోగకరం. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన హృద్రోగి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లేందుకు, సంపూర్ణ ఆయుర్దాయాన్ని పొందేందుకు ఈ హైబ్రీడ్‌ క్యాథ్‌ల్యాబ్‌ ఎంతగానో తోడ్పడుతుందనడం నిస్సందేహం. 
ఎంత ఖర్చు 
హైబ్రీడ్‌ క్యాథ్‌ ల్యాబ్‌ ద్వారా పరీక్షలు, చికిత్సకు 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు, కొన్ని సందర్భాల్లో ఆపైన వ్యాధి తీవ్రతను బట్టి ఖర్చు  అవుతుంది.