వారాంతంలో హార్ట్‌ ఎటాక్‌ వస్తే కష్టమే!

ఆంధ్రజ్యోతి (28-01-2020):  గుండెనొప్పి ఎప్పుడు ఏరోజు వస్తుందో చెప్పడం కష్టమే! అయితే వారాంతంలో హార్ట్‌ ఎటాక్‌ వస్తే బతకడం కష్టమేనన్న సంగతి ఇటీవల చేసిన కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజులోనైనా సరే గుండెపోటుతో వచ్చిన వారి కంటే శని, ఆదివారాలు గుండెపోటు వస్తే బతికే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నాయి పరిశోధనలు. యూకేకు చెందిన పరిశోధకులు సర్వైవల్ టు హాస్పిటల్ అనే అంశంపై పరిశోధన చేశారు. అనంతరం అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3 వేల మందికి చెందిన డేటాను సేకరించినట్లుగా తెలిపారు. వారు తెలిపిన దాని ప్రకారం.. ఇతర రోజుల్లో కంటే శనివారం నుంచి ఆదివారం మధ్యలో గుండె సమస్యలు వస్తే బతికే అవకాశం తక్కువట. కేవలం రోజులు మాత్రమే కాదు.. ఆ సమయాన్ని కూడా చెబుతున్నారు. శనివారం రాత్రి 12 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల మధ్య గుండెపోటు వచ్చినవారిలో కేవలం 20 శాతం మందే బతికారట.. ఇక వయస్సు పెరిగే కొద్దీ ఈ శాతం మరింత తగ్గుతుందని వారు తెలిపారు.