నెమ్మదిగా నడిచేవారిలో గుండెపోటు ముప్పు!

లండన్‌, ఆగస్టు 30: స్వతహాగా నెమ్మదిగా నడిచే లక్షణం కలిగి ఉన్న వ్యక్తులు భవిష్యత్తులో గుండెపోటుతో మరణించే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. వేగంగా నడిచేవారితో పోల్చుకుంటే నెమ్మదిగా నడిచే వ్యక్తులు గుండెపోటు బారిన పడే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువని ఆ అధ్యయనం వెల్లడించింది. 2006-2010 మధ్య సేకరించిన సమాచారం ప్రకారం యూకే బయోబ్యాంక్‌ ఈ విషయం బయటపెట్టింది. 4.2 లక్షల మందిని ఆరున్నర సంవత్సరాల పాటు పరిశీలించింది. వీరిలో నెమ్మదిగా నడిచే 8,598 మంది వ్యక్తులు హృద్రోగ జబ్బులు, కేన్సర్ల కారణంగా మరణించారని తెలిపింది. వేగంగా నడిచేవారిలో గుండెపనితీరు, రక్తప్రసరణ మెరుగ్గా ఉంటాయని, అవి వారిని హృద్రోగ ముప్పునకు, వివిధ కేన్సర్లకు దూరం చేస్తున్నాయని వెల్లడించారు.