అందం కోసం ఆగనివ్వద్దు!

26-02-2018: గుండెపోటు అనగానే అది పురుషులకే పరిమితం అనుకుంటాం! కానీ, ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం, ‘కార్డియాక్‌ అరెస్ట్‌’ అనే ఆరోగ్య సమస్య మీద చర్చకు తెరలేపింది. ఇది ఎలా, ఎప్పుడు, ఎవరి మీద దాడి చేస్తుంది? మహిళల్లో ఈ సమస్య పెరగటానికి కారణాలేంటి? కార్డియాక్‌ అరెస్ట్‌ గురించి లోతుగా విశ్లేషిస్తే....

అందంగా, యౌవనంగా కనిపించాలనే ఆతురత, ఆశ సహజమే! అయితే సెలబ్రిటీల విషయంలో ఇది ఆశతోనే ఆగిపోదు. దాన్ని నిజం చేసుకు తీరాల్సిన ఒత్తిడి, పరిస్థితి తలెత్తవచ్చు. గ్లామరస్‌గా వేవేల నీరాజనాలందుకున్న సౌందర్యాన్ని కలకాలం నిలుపుకోవాలనే తాపత్రయంతో, వేరే దారి లేక సౌందర్య చికిత్సలను ఆశ్రయించవచ్చు. అయితే దీర్ఘకాలంపాటు తీసుకునే సౌందర్య చికిత్సలు, వాటిలో వాడే బొటాక్స్‌ ఇంజెక్షన్లు, సర్జరీల ప్రభావం గుండె మీద కచ్చితంగా ఉంటుంది. కార్డియాక్‌ అరెస్ట్‌లో అంటే...గుండె ఆగిపోయి, ప్రాణాలు కోల్పోయిన మహిళల్లో ఎక్కువమంది బొటాక్స్‌ ఇంజెక్షన్లు తీసుకున్నవాళ్లే ఉంటున్నారని అధ్యయనాల్లో తేలింది. మరీ ముఖ్యంగా 40 నుంచి 55 ఏళ్ల లోపు మహిళలే సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తో మృత్యువాత పడుతున్నారు. 2018 ఫిబ్రవరి 3, ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ఓ సర్వేలో బొటాక్స్‌ ఇంజెక్షన్‌ దుష్ప్రభావాలకు లోనైన 30,301 మంది మహిళల్లో 27 మంది కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయారని రుజువైంది.
 
 
బొటాక్స్‌ అంటే?
‘బొట్యులినం టాక్సిన్‌’... దీన్నే బొటాక్స్‌ అని ముద్దుగా పిలుచుకుంటాం! గత పదేళ్లుగా సౌందర్య చికిత్సలో మారుమోగిపోతున్న బొటాక్స్‌కు వైద్య చికిత్సలో 50 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని పూర్వం ఆరోగ్య చికిత్సలో వాడేవారు. ప్రారంభంలో ‘లేజీ ఐ’ (కిందికి వాలిపోయిన కనురెప్పలు) సరి చేయటానికి, ‘బ్లెఫరోస్పాస్మ్‌’ (అన్ని వైపులకు కను రెప్పలను తిప్పలేకపోవటం) లాంటి సమస్యల చికిత్సల్లో బొటాక్స్‌ ఇంజెక్షన్‌ వాడేవారు. అయితే దీనికున్న ప్రత్యేక గుణాల వల్ల క్రమేపీ సౌందర్య చికిత్సల్లో వాడటం మొదలుపెట్టారు వైద్యులు. చర్మం మీద ముడతలు ఏర్పడకుండా ఉండాలంటే కండరాలకు సంబంధిత నరాలకు మధ్య కనెక్షన్‌ కట్‌ చేయాలి. బొటాక్స్‌ ఇంజెక్షన్లు చేసే పని ఇదే! బొటాక్స్‌ ఇంజెక్షన్‌ చేయటం వల్ల కండరాలు ముడుచుకునే గుణం కోల్పోతాయి. దాంతో ముడతలు ఏర్పడవు.
 
బొటాక్స్‌ ఇంజెక్షన్లు సాధారణంగా ముఖం మీదే ఉపయోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా క్రోస్‌ ఫీట్‌ (కళ్ల చివర్లలో ఏర్పడే గీతలు), లాఫింగ్‌ లైన్స్‌ (నవ్వినప్పుడు పెదవుల పక్కన కనిపించే ముడతలు), ఫ్రౌన్‌ లైన్స్‌ (భృకుటి ముడిచినప్పుడు కనిపించే ముడతలు), ఫోర్‌హెడ్‌ లైన్స్‌ (నుదుటి మీద అడ్డంగా ఏర్పడే గీతలు)....వీటిని బొటాక్స్‌తో తగ్గించే వీలుంది. అయితే, సూర్యరశ్మి వల్ల తలెత్తే ముడతలు, గీతలు, భూమ్యాకర్షణ ఫలితంగా కిందకు సాగిన చర్మాన్ని బొటాక్స్‌ ఇంజెక్షన్లు సరి చేయలేవు. ఏదేమైనా, సౌందర్యాన్ని కాపాడుకునే క్రమంలో వాడే బొటాక్స్‌ ఇంజెక్షన్లు దీర్ఘకాలంలో గుండె మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వీటి వాడకాన్ని నియంత్రించుకోవటం ఎంతో అవసరం.
 
మహిళల్లో అరుదే! అయినా....
సాధారణంగా పురుషులతో పోలిస్తే, మహిళల్లో గుండె సమస్యలు చాలా తక్కువ. పైగా పురుషులకు, మహిళలకు గుండె సమస్యలు వచ్చే వయః పరిమితిలో పదేళ్ల తేడా ఉంటుంది. పురుషులకు 50 ఏళ్ల వయసులో గుండె సమస్యలు తలెత్తితే, మహిళల్లో పదేళ్లు ఎక్కువ వయసులో...అంటే 60 ఏళ్ల వయసులో ఆ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇది మహిళలకు అనుకూలించే విషయమే! అయితే, దీన్లో ఉన్న ప్రతికూలత ఏంటంటే... మహిళలకు సానుకూలమైన గుండె సమస్య వస్తే, అది పురుషుల కంటే తీవ్రంగా, ప్రాణాంతకంగా ఉంటుంది. బ్రతికించుకునేంత వ్యవధి ఉండదు.
 
ప్రాణాలు హరించేంత తీవ్రం
గుండె సమస్యలకు సంబంధించి గుండె పోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌ లాంటివే ఎక్కువ మందికి తెలుసు. కానీ కార్డియాక్‌ అరెస్ట్‌ అనే సమస్య ఈ రెండింటి కంటే తీవ్రమైనది, భిన్నమైనది. మిగతా గుండె సమస్యలన్నీ ముందస్తు లక్షణాలు, సమస్యలు, చికిత్సలతో అంతో ఇంతో రోగిని అప్రమత్తంగా ఉంచుతాయి. పైగా ఈ గుండె సమస్యల్లో రోగిని బ్రతికించుకునే అవకాశాలు ఎక్కువ. కార్డియాక్‌ అరెస్ట్‌ ఇందుకు పూర్తి భిన్నం. లక్షణాలు ఒకదాని వెంట మరొకటిగా అలల్లా పోటెత్తి, కారణమేంటో అర్థం చేసుకునేలోపే, ప్రాణాలు హరిస్తాయి. కేవలం గంట వ్యవధిలోనే అంతా అయిపోతుంది.
 
‘కార్డియాక్‌ అరెస్ట్‌’లో ఏం జరుగుతుంది?
గుండె లబ్‌డబ్‌ అంటూ కొట్టుకోవటానికి అవసరమైన ప్రేరణ... ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌! ఈ విద్యుత్తు సంకేతాలు గుండెను సమమైన వేగంతో కొట్టుకునేలా చేస్తాయి. గుండెలోని ఈ ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌లో ఏదైనా లోపం తెలిత్తితే, గుండె అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇదే...‘కార్డియాక్‌ అరెస్ట్‌’. ఇలా జరిగినప్పుడు గుండె నుంచి శరీరం మొత్తానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. మెదడుకు కూడా రక్తం అందదు. రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్‌ అందకపోవటం వల్ల మెదడు పనిచేయటం మానేస్తుంది. దాంతో హఠాత్తుగా కుప్ప కూలిపోయి, స్పృహ కోల్పోతారు. ఊపిరి ఆగిపోతుంది.
 
లక్షణాలు ఇవే!
కార్డియాక్‌ అరెస్ట్‌లో లక్షణాలు కనిపించేంత వ్యవధి ఉండదు. కొన్ని సందర్భాల్లో గుండె పోటే కార్డియాక్‌ అరెస్ట్‌కు దారి తీయొచ్చు. గుండె పోటులో తల తిరుగుడు, నీరసం, ఛాతీలో నొప్పి, శ్వాస అందకపోవటం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపించిన వెంటనే చికిత్స అందించగలిగితే గుండె పోటును, తదనంతర కార్డియాక్‌ అరెస్ట్‌ను నియంత్రించవచ్చు. అయితే గుండెపోటుతో సంబంధం లేకుండా ఏకంగా కార్డియాక్‌ అరెస్ట్‌ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా దాడి చేస్తుంది.
 
కారణాలు ఉన్నాయి!
ఎటువంటి వ్యాధులూ లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి కూడా కార్డియాక్‌ అరెస్ట్‌ గురి కావొచ్చు. అయితే ఈ సమస్యకు కొన్ని ఆరోగ్యపరమైన అంశాలు దోహదపడతాయి.
 అవేంటంటే....
 
దీర్ఘకాలిక గుండె సమస్యలు: పదేళ్లకు మించి, పరీక్షల్లో బయటపడకుండా, చాప కింద నీరులా పాకే గుండె జబ్బులు ఉన్నాయి. ఎలాంటి లక్షణాలు, ఇబ్బందులు లేకుండా ఒకేసారి ఈ వ్యాధులు విశ్వరూపం దాల్చి కార్డియాక్‌ అరెస్ట్‌గా బయల్పడతాయి.
గుండె పోటు: గుండె పోటు కొన్ని సందర్భాల్లో కార్డియాక్‌ డెత్‌కు దారి తీయొచ్చు.
మైక్రో వాస్క్యులర్‌ యాంజైనా: గుండె రక్త నాళాల్లో సూక్ష్మమైన అడ్డంకులు ఏర్పడి, కొన్ని సంవత్సరాలకు అవే పెద్ద బ్లాకేజ్‌గా మారి హఠాత్తుగా కార్డియాక్‌ అరెస్ట్‌ డెత్‌కు దారి తీయొచ్చు. అడ్డంకులు సూక్ష్మంగా ఉండటం మూలంగా గుండె పరీక్షల్లో బయట పడకపోవచ్చు.
బొటాక్స్‌ ఇంజెక్షన్లు: సౌందర్య చికిత్సల్లో భాగంగా తీసుకునే బొటాక్స్‌ ఇంజెక్షన్లు, నొప్పి తగ్గించే టైలినాల్‌ లాంటి పెయిన్‌ కిల్లర్స్‌ ప్రభావం గుండె మీద కచ్చితంగా ఉంటుంది. ఈ మందులు అప్పటికప్పుడే గుండె మీద ప్రభావం చూపించకపోయినా, దీర్ఘకాలంలో కార్డియాక్‌ అరెస్ట్‌ రూపంలో బయల్పడవచ్చు.
అస్తవ్యస్త జీవనశైలి: శారీరక వ్యాయామం లేకుండా సెడెంటరీ లైఫ్‌ స్టయిల్‌ గడుపుతూ, ఆరోగ్య, ఆహార నియమాలు పాటించకుండా, వ్యాయామం చేయకుండా ఉండే మహిళలు గుండె జబ్బులకు లోను కావొచ్చు. ఈ జబ్బులే గతి తప్పి, కార్డియాక్‌ అరెస్టుకు దారి తీయొచ్చు.
ఒత్తిడి: మానసిక ఒత్తిడి, ఆందోళనలతో కూడుకున్న జీవితాన్ని గడిపే వ్యక్తుల గుండె కాలక్రమేణా బలహీనపడటం ఖాయం. ఈ స్థితి కూడా కార్డియాక్‌ అరెస్టుకు దారి తీయొచ్చు.
జన్యుపరంగా: గుండె జబ్బులు వంశపారంపర్యం. తల్లి తండ్రుల్లో ఒకరు 50 ఏళ్లలోపు గుండె జబ్బుతో మరణిస్తే, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి.
 
థైరాయిడ్‌తో గుండెకు నష్టం లేదు!
థైరాయిడిజమ్‌ సమస్యలు ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి సహజం. థైరాయిడ్‌ హార్మోన్‌ తగుపాళ్లలో తయారుకాని ‘హైపో థైరాయిడిజమ్‌’, అవసరానికి మించి హార్మోన్‌ ఉత్తత్తయ్యే ‘హైపర్‌ థైరాయిడిజమ్‌’...ఈ రెండు సమస్యలనూ నోటి మాత్రలతోనే అదుపు చేయొచ్చు. ఈ సమస్యలున్నంత మాత్రాన వీటి ప్రభావం గుండె మీద ఉండదు.
 
ముందస్తు అప్రమత్తత తప్పనిసరి
కార్డియాక్‌ అరెస్టుకు గురవకుండా ఉండాలంటే...35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా తన గుండె ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ముందస్తు గుండె సంబంధ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటా ఉండాలి.
35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలి. గుండె రక్తనాళాల్లో ఒకవేళ సూక్ష్మ అడ్డంకులు ఉంటే ఈ పరీక్షల్లో బయల్పడతాయి కాబట్టి వాటిని మందులతోనే తొలగించుకునే వీలుంటుంది.
పూర్తి హెల్త్‌ చెకప్‌ చేయించుకుని శరీరంలోని హార్మోన్లు, ప్రధాన అంతర్గత అవయవాల పనితీరును పర్యవేక్షించుకుంటూ ఉండాలి.
వీలైనంత వరకూ సౌందర్య చికిత్సలకు దూరంగా ఉండాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
సమతులాహారం తీసుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.
కొవ్వు కలిగిన ఆహారం, ధూమపానం, రక్తపోటు, మధుమేహం, అధిక బరువు తగ్గించాలి.
 
బాత్రూమ్‌ డేంజర్‌!
ఎక్కువశాతం గుండె పోట్లు, కార్డియాక్‌ అరెస్ట్‌లు బాత్రూముల్లో, ఉదయం వేళల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇందుకు బలమైన కారణాలు లేకపోలేదు. అవేంటంటే...
స్నానం చేసే పద్ధతి: మనలో ఎక్కువ మందికి తల మీద నుంచి నీళ్లు పోసుకునే అలవాటు ఉంటుంది. ఇలా నీళ్లు పోసుకోవటం వల్ల శరీరం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోలేదు. ఉష్ణోగ్రతను సమం చేసుకునే ప్రయత్నంలో రక్తం తల వైపు పరుగులు తీస్తుంది. ఈ వేగానికి రక్తంలో అప్పటికే ఏవైనా అడ్డంకులు ఉంటే అవన్నీ గుండె వైపు ప్రవహించి ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకులుగా మారతాయి. దాంతో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండె పోటు, కార్డియాక్‌ అరెస్ట్‌ రావొచ్చు. వీటికి చికిత్స ఆలస్యమైతే పక్షవాతం, ప్రాణహాని జరగొచ్చు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగా తలను కాకుండా కాళ్లను తడుపుకోవాలి. తల మీద నుంచి పాదాల వైపు కాకుండా, పాదాల నుంచి తల వైపుగా శరీరాన్ని తడపాలి.
 
మలవిసర్జన తేలికగా!: మల విసర్జన సమయంలో ఒత్తిడి ఏర్పడితే దాని ప్రభావం, గుండె దగ్గరుండే ‘వేగస్‌’ నరం మీద పుతుంది. ఈ నరానికి గుండె వేగాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. అప్పటికే ఆ వ్యక్తికి గుండె సమస్య ఉంటే, వేగస్‌ నరం ఒత్తిడికి గురవటం మూలంగా గుండెలో విద్యుత్తు ప్రసారం తగ్గి, ఫలితంగా కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవించవచ్చు. అంతేకాకుండా మల విసర్జన సమయంలో ముక్కటం వల్ల రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు గుండె వైపు ప్రవహించి, గుండె పోటుకు దారి తీసే ప్రమాదం ఉంది.
 
 
బొటాక్స్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌
బొటాక్స్‌ ఇంజెక్షన్‌తో తక్షణం కనిపించే స్వల్ప ఇబ్బందులతోపాటు, దీర్ఘకాలంలో గుండెకు హాని కలిగించే ప్రమాదాలూ ఉన్నాయి. బొటాక్స్‌ ఇంజెక్షన్‌ దుష్ప్రభావాల్లో మొదట కనిపించేది తలనొప్పి, జ్వరం, నొప్పులు. కొన్ని సందర్భాల్లో ఈ ఇంజెక్షన్‌ వికటిస్తే కనురెప్పలు వాలిపోయి శాశ్వతంగా అలాగే ఉండిపోతాయి కూడా! కొన్ని సందర్భాల్లో బొట్యులినం టాక్సిన్‌ నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థ మీద దాడి చేసి, దీర్ఘకాలిక నష్టాన్ని కూడా కలిగించవచ్చు. కొంతమందికి బొటాక్స్‌ ఇంజెక్షన్‌ తీసుకున్న తర్వాత ఆహారం మింగటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులూ తలెత్తుతాయి. గుడ్డు అలర్జీ ఉన్నవాళ్లు బొటాక్స్‌ ఇంజెక్షన్‌ తీసుకోవటం ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్‌ తయారీ ఆల్బ్యుమిన్‌ (గుడ్డు) వాడతారు కాబట్టి ఎగ్‌ అలర్జీ ఉంటే బొటాక్స్‌ తీసుకోకూడదు. అలాగే గర్భిణులూ బొటాక్స్‌ తీసుకోకూడదు.
 
 
ఇలా చేస్తే బతికించొచ్చు!
కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సిపిఆర్‌)....గుండెకు ఫస్ట్‌ ఎయిడ్‌. గుండె ఏ కారణం చేత ఆగినా దాన్ని తిరిగి పని చేయించటం కోసం చేసే ప్రథమ చికిత్స ఇది. సాధారణంగా గుండె సమస్యతో ఎవరైనా కుప్పకూలిపోతే, ఆ వ్యక్తి చుట్టూ గుమిగూడటం, మాట్లాడించటానికి ప్రయత్నం చేయటం చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలిస్తాం! కానీ గుండె సమస్యలో ప్రతి సెకన్‌ కాలమూ విలువైనదే! ఎంత త్వరగా చికిత్స అందించగలిగితే గుండె అంత త్వరగా, మెరుగ్గా కోలుకుంటుంది. మరీ ముఖ్యంగా కార్డియాక్‌ అరెస్ట్‌ లాంటి సమస్యల్లో తక్షణ చికిత్స అత్యవసరం. సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌లో గుండె ఆగిపోతుంది. కాబట్టి దాన్ని తిరిగి కొట్టుకునేలా చేయటం కోసం తక్షణమే సిపిఆర్‌ చేయాలి.
 
అంటే...శ్వాస ఆగిపోయి, గుండె నిశ్చలంగా మారి పడిపోయిన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి, ఛాతీ మధ్య నుంచి ఎడమ వైపు భాగంలో, పక్కటెముకల కింద...రెండు అర చేతులతో ప్రెషర్‌ ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల గుండెకు ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌ అంది తిరిగి కొట్టుకోవటం మొదలు పెడుతుంది. గుండె కొట్టుకోవటం మొదలవగానే సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లగలిగితే ప్రాణాలు నిలబడతాయి. కార్డియాక్‌ అరెస్ట్‌లో సిపిఆర్‌ సహాయంతో రోగి బ్రతికే అవకాశాలను 50ు మేర పెంచుకోవచ్చు. కాబట్టి కుటుంబంలో కనీసం ఒకరికైనా సిపిఆర్‌ చేసే పద్ధతి తెలిసి ఉండటం ఎంతో అవసరం.
 
 
 
-డాక్టర్‌ సాయి సుధాకర్‌,
చీఫ్‌ కార్డియాక్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజిషియన్‌,
సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌,
గ్లెనిగేల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.