గుండెకు డేంజర్‌ బెల్‌

పేరుకుపోతున్న పొట్ట, నడుము చుట్టు కొవ్వు
చుట్టు కొలత 80- 90 సెం.మీ దాటితే ముప్పే
4 ప్రధాన నగరాల్లో సఫోలా లైఫ్‌ అధ్యయనం

హైదరాబాద్‌ సిటీ, సెప్లెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మీ పొట్ట.. నడుము చుట్టుకొలత 80 నుంచి 90 సెంటీ మీటర్లు దాటుతోందా? అయితే మీ గుండెకు డెంజర్‌ బెల్‌ మోగుతున్నట్లే! పురుషులకు 90 సెంటీమీటర్లు.. మహిళల చుట్టుకొలత 80 సెంటీమీటర్లు దాటితే గుండె జబ్బు ముప్పు పొంచి ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పొట్ట, నడుము చుట్టు భారీ స్థాయిలో పేరుకుపోతున్న కొవ్వు గుండెకు చేటు చేస్తుందని వివరిస్తున్నారు. ఇటీవల సఫోలా లైఫ్‌ హైదరాబాద్‌, లక్నో, ముంబై, ఢిల్లీలో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ శరత్‌చంద్ర, పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ లతశ్రీ వివరించారు. పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.

గుండె జబ్బులకు చేరువలో 58% హైదరాబాదీలు
దేశం మొత్తం మీద 67% మంది గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. ముంబైలో 77 శాతం, ఢిలీల్లో 69 శాతం, లక్నోలో 66 శాతం, హైదరాబాద్‌లో 58 శాతం మందికి గుండె జబ్బు పొంచి ఉందని వారు చెప్పారు. మహిళల కంటే పురుషులలో పొట్ట, నడుము చుట్టు కొవ్వు పేరుకుపోతోందని గుర్తించారు. పురుషులు 68% ఉండగా, మహిళలు 66% మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్తు తెలిపారు. హైదరాబాద్‌లో పొట్ట చుట్ను కొవ్వు ఉన్న 45 ఏళ్ల వయస్కుల్లో 52% మందికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి 10 పది మందిలో ఏడుగురు వారంలో ఒక రోజు బయట ఆహారం తీసుకోడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ ముప్పునకు గురవుతున్నారని సర్వేలో తేలింది.