గుండెకు కేన్సర్‌ ఎందుకు రాదు?

సమస్య ఏదైనా కావచ్చు. స్కానింగ్‌ రిపోర్టులు చేతుల్లోకి రాగానే ఎక్కడ కేన్సర్‌ అని బయటపడుతుందోనన్న భయం చాలా మందిలో ఉంటుంది. అయితే మిగతా అవయవాల మాట ఎలా ఉన్నా గుండె విషయంలో మాత్రం ఆ భయమేమీ అవసరం లేదని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రముఖ ఆసుపత్రులన్నీ పరిశీలిస్తే సగటున ఏడాదికి ఒకటికన్నా తక్కువగానే గుండె కేన్సర్లు నమోదవుతున్నాయి. శరీరంలోని ఒక అత్యంత ప్రధాన అవయవమైన గుండె అరుదుగా తప్ప కేన్సర్‌ పాలిటపడకపోవడంలోని రహస్యం ఏమిటి? ఈ విషయమై ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ పరిశోధన ఇదుగో ఈ కారణాల్ని చెబుతోంది.కణుతులు ఏర్పడటం అనేది సహజంగా శరీర కణాల విభజన అదుపు తప్పినప్పుడే జరుగుతుంది.

 అయితే ఇతర శరీర అవయవాలకూ గుండెకూ ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా, ఇతర అవయవాలకు మల్లే గుండె కణాలు విపరీతంగా విభజనకు గురయ్యే అవకాశం లేదు. గుండెలో కణ విభజన ఒకవేళ జరిగినా చాలా అరుదుగా గర్భంతో ఉన్నప్పుడు జరుగుతుంది. కాకపోతే చాలా అరుదుగా గర్భస్థ శిశువులోని కొన్ని కణాలు కణుతులుగా మారుతుంటాయి.సహజంగానే గర్భాశయంలోని కణుతుల్లో ఎదుగుదల ఉండదు. అందుకు భిన్నంగా గర్భిణుల గుండెలో ఒక వేళ కణ విభజన జరిగినా ప్రసవ సమయంలో ఆ విభజన తిరుగుముఖం పడుతుంది. లేదా పెరుగుదల ఆగిపోతుంది. స్త్రీలల్లో గుండె కేన్సర్‌ రాకపోవడానికి ఇదొక అదనపు కారణం. గుండెలో ఎక్కువగా కండరాల కణజాలమే ఉంటుంది. సహజంగా ఈ కణాలకు శరీర పరిమాణానికి అవసరమైన మేరకే పెరిగే ధర్మం ఉంది. అంతే గానీ, అతిగా పెరిగే లక్షణం లేదు. కేన్సర్‌ కణుతులు ఏర్పడ కపోవడానికి ఇదీ ఒక కారణమే. కేన్సర్‌కు తావు లేకుండా గుండె కణ విభజన లేకపోవడం ఒక శుభసూచకమే కానీ, గుండెపోటు కారణంగా నశించిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాల ఉత్పత్తి కూడా జరగదు. గుండెకు సంబంధించి ఇదొక ప్రతికూల అంశమే.