రక్తనాళాలను శుభ్రపరిచే స్టెంట్‌

 

నెల్లూరు, ఆగస్టు 12: ప్రస్తుత ఆహారపు అలవాట్లు మానవుని ఆరోగ్యంపై   తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒక నియమం లేకుండా ఎప్పుడుపడితే, ఏదంటే అది తినడంతో వ్యాధులు తీవ్రమవుతున్నాయి. ప్రత్యేకించి రక్తనాళాలపై ప్రభావం ఎక్కువగా ఉంటోంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా చేసే నాళాల్లో కొవ్వు పేరుకుని రక్తం సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఇదే విధంగా గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని పోవడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇతర అవయవాలకు వెళ్లే రక్తనాళాలు మూసుకుని పోవడంతో ఆయా భాగాలు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును తొలగించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడానికి అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో ఈ కొవ్వును తొలగించేందుకు స్టెంట్‌లను శస్త్రచికిత్స ద్వారా వేస్తారు. మెటల్‌, ఫాబ్రిక్‌తో తయారు చేసిన ఈ స్టెంట్‌లు రక్తనాళాల్లోకి చొరబడి అందులో పేరుకున్న కొవ్వును తొలగించడంతో రక్తప్రసరణ యథావిథిగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్టెంట్‌లు ఆధునిక వైద్యరంగంలో భాగం కావడంతో అనేక మంది ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు.