గుండె నిండా భరోసా

29-01-2019:గుండె సమస్య అనగానే పురుషులే కళ్లముందు మెదలుతారు. కానీ మనసులాగే మహిళల గుండె కూడా సున్నితమే! వారినీ గుండె సమస్యలు వేధిస్తున్నాయి. అయినా ఆరోగ్యకరమైన జీవనశైలితో హృద్రోగాలను దూరం పెట్టవచ్చు!
 
మహిళల హృదయారోగ్యానికి తోడ్పడే అంశాలు బోలెడు! వాటి పట్ల అవగాహన, అప్రమత్తత కరవవడంతో, హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ వాటి పట్ల భయం తొలగి గుండె నిండా భరోసా నిండుకోవాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే....
 
మెనోపాజ్‌ దశలో...
ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ గుండె రక్తనాళాల లోపలి పొరను మృదువుగా ఉంచుతుంది. దీనివల్ల రక్తనాళం సాగుతూ రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అయితే బహిష్టు ఆగిపోయిన మెనోపాజ్‌ దశలో ఈస్ట్రోజన్‌ నిల్వలు తగ్గిపోవడంతో, రక్తప్రసరణలో అంతరాయాలు వచ్చి గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఈస్ట్రోజన్‌ తగ్గిపోవడం వల్ల క్యాల్షియం పనితీరు కూడా కుంటుపడుతుంది. ఈస్ట్రోజన్‌ ఆధారంగానే విటమిన్‌-డి, ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది. అయితే ఈస్ట్జోజన్‌ నిల్వలు తగ్గిపోగానే డి-విటమిన్‌ శ క్తిహీనమవుతుంది. ఈ క్రమంలో విటమిన్‌-డి పరిపుష్టంగా ఉన్నవారితో పోలిస్తే, విటమిన్‌- డి లోపాలతో ఉన్నవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. రక్తనాళాల్లో క్యాల్షియం పేరుకుపోకుండా నిలువరించడానికి ఎం.జి.పి (మ్టాట్రిక్స్‌ గ్లా ప్రొటీన్‌) చాలా అవసరం. అయితే ఈ ప్రొటీన్‌ తయారు కావడానికి డి- విటమిన్‌ అవసరం. డి- విటమిన్‌ లోపించిన వారిలో ఈ ప్రొటీన్‌ ఉండదు కాబట్టి, గుండె రక్తనాళాల్లో క్యాల్షియం పేరుకుని గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. విటమిన్‌ కె-2 లోపం కూడా గుండె రక్తనాళాల జబ్బులు రావడానికి మరో కారణం. కాబట్టి ఈ లోపాన్ని కూడా పూరించాలి.
 
మధుమేహులైతే....
మధుమేహానికి ప్రధాన కారణం శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం. ముఖ్యంగా మధువేహులైన స్త్రీలు గర్భం దాల్చినప్పుడు వారి శరీరం పైన హర్మోన్ల ప్రభావం పెరుగుతుంది. ఈ స్థితిలో క్లోమ గ్రంథి ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడి ఇన్సులిన్‌ నిరుపయోగం అవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర పరిమాణం పెరిగిపోతుంది. అయితే, ఇన్సులిన్‌ నిరుపయోగం కావడం వల్ల రక్తంలోని గ్లూకోజు జీవకణాల్లోకి పోలేదు. ఈ లోటును పూరించుకోవడానికి శరీరం వేరే ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొవ్వు పదార్థాల నుంచి శక్తిని విడుదల చేసే ప్రక్రియలో హెచ్‌.డి.ఎల్‌ కొలెస్ట్రాల్‌ తక్కువగానూ, ఎల్‌.డి.ఎల్‌ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, మధుమేహుల్లో ఈ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉత్పత్తి అయితే, రక్తనాళాలు గట్టిపడి కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గిపోతుంది. ప్రత్యేకించి గుండె రక్తనాళాలు కుంచించుకుపోవడంతో గుండె నొప్పి రావడం, రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతే గుండెపోటు రావడం జరుగుతాయి. గుండె రక్తనాళాల్లో కొవ్వు అడ్డుపడటం అనేది పురుషుల్లో ప్రధాన రక్తనాళాల్లో జరిగితే, స్త్రీలల్లో సూక్ష్మ రక్తనాళాల్లో జరుగుతూ ఉంటుంది.
 
స్థూలకాయమూ సమస్యే!
స్థూలకాయుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం 70 శాతం ఎక్కువ. నిమిషానికి 72 సార్లు స్పందించవలసిన గుండె బరువు పెరిగేకొద్దీ ఆ వేగం పెంచుకుంటుంది. 20 కేజీలు అధిక బరువు పెరిగితే, ఆ అదనపు శరీరాన్ని పోషించడానికి గుండె అధికంగా, 80 నుంచి 90 సార్లు స్పందిస్తుంది. ఇలా గుండె కొట్టుకునే వేగం ఎంత పెరిగితే, గుండె మీద భారం అంత పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా గుండె జీవితకాలం తగ్గిపోతుంది. స్థూలకాయుల్లో కొలెస్ట్రాల్‌ కారణంగా, రక్తనాళాలు మూసుకుపోవడానికి, గుండె జబ్బులు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ.
 
థైరాయిడ్‌తోనూ చిక్కే!
శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే థైరాక్సిన్‌ తగ్గిపోవడంతో వచ్చే సమస్య హైపోథైరాయిడిజం. దీనివల్ల గుండె పనితనం తగ్గిపోతుంది. సమస్యను సకాలంలో గుర్తించి థైరాక్సిన్‌ సప్లిమెంట్లు తీసుకుంటే సరేసరి! లేదంటే, గుండె స్పందనలు తగ్గిపోవడంతో మిగతా జీవక్రియలన్నీ కుంటుపడతాయి. ఇదే క్రమంలో గుండెలో కూడా వాపు ఏర్పడవచ్చు. అంతకు ముందే గుండె జబ్బులు ఉన్నవారిలో ఈ సమస్య తలెత్తితే, గుండె పనితీరు మరింత వేగంగా క్షీణిస్తుంది.
హైపర్‌ థైరాయిడిజం సమస్యలో థైరాక్సిన్‌ హార్మోన్‌ అతిగా ఉత్పన్నం కావడం వల్ల, గుండె ఎక్కువ వేగంగా కొట్టుకోవడంతో పాటు, లయ తప్పి కొట్టుకుంటుంది. ఈ క్రమంలో శ్వాసకోశాలు దెబ్బతింటాయి. కాబట్టి తరుచూ ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తూ, సమస్యను అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి.

నివారణ చర్యలు ఇవే!

ఆహారంలో పళ్లు తాజా ఆకుకూరలు, కాయగూరల మోతాదు పెంచాలి.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల మెటబాలిక్‌ సిండ్రోమ్‌ అనే జీవక్రియల జబ్బు రాదు. పొట్ట భాగంలో కొవ్వు పెరిగే సమస్య కూడా రాదు.
బాడీ మాస్‌ ఇండెక్స్‌ (శరీర ద్రవ్యసూచి) తగ్గడానికి అవసరమైన జాగ్రత్తలు పాటించాలి. తరుచూ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించాలి.
రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి ఉంచుకోవాలి. మానసిక ఒత్తిళ్లకు, డిప్రెషన్‌కూ దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ జాగ్రత్తలు ఒక క్రమవిధానంలో పాటిస్తూ ఉంటే, గుండె రక్తనాళాల సమస్యలు చాలా వరకు నివారించబడతాయి.
- డాక్టర్‌ శంకర్‌ టి.ఎస్‌.ఆర్‌.
మోహన్‌ సెల్వన్‌,
కాన్సెప్ట్‌ హాస్పిటల్స్‌, చెన్నై.