జీవనశైలి మార్పులతో గుండె జబ్బులు మాయం

ఆంధ్రజ్యోతి, 10-12-13: గుండె ప్రధాన రక్తనాళాలు పూడిపోతే, గుండెకు చేరవేసే రక్తప్రసరణ బాధ్యతను గుండె పక్కనే ఉన్న సూక్ష్మ రక్తనాళాలు చేపడతాయి. ఇది శరీరంలోని ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ. అయితే, ఈ లోగా జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. అలా ఏమీ చేయకపోతే ఒక దశలో ఆ సూక్ష్మరక్తనాళాలు కూడా పూడిపోయి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి రాకుండా చూసుకునే విధానాలెన్నో ప్రకృతి వైద్య చికిత్సలో ఉన్నాయి. రక్తనాళాల్లో అడ్డంకులు అనగానే ఏకంగా సర్జరీకి సిద్ధమైపోవడం అందరికీ అలవాటైపోయింది కానీ, ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సందర్భాల్లో సర్జరీ అవసరమే లేదంటున్నారు, వేమన యోగ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సత్యలక్ష్మి. 


గుండె జబ్బు అన గానే ఒక అత్యవసర పరిస్థితిగా అదొక ప్రాణాంతక పరిణామంగానే చూస్తాం. రక్తనాళాల్లో ఏ చిన్న అవరోధం ఉన్నా చాలా మంది డాక్టర్లు ఆగమేఘాల మీద సర్జరీ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. పేషంట్లు కూడా వెంటనే అందుకు సిద్ధమైపోతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్న ఒక ప్రచారం అందరిలోనూ ఈ భావజాలాన్నే నింపింది. నిజానికి అత్యాధునిక చికిత్సలన్న పేరుతో వచ్చిన వైద్య విధానాల వినియోగం కన్నా, వాటి దుర్వినియోగమే ఎక్కువ అవుతూ వస్తోంది. అయితే, ఈ దుష్పరిణామాల్ని మన కన్నా పాశ్చాత్య దేశీయులే ముందుగా గుర్తించారు. ఈ క్రమంలో అంటే 1970లోనే డీన్‌ ఆర్నిశ్‌ అనే ఒక డాక్టర్‌, ‘లైఫ్‌ స్టైల్‌ హార్ట్‌ ట్రయల్స్‌’ అంటూ జీవన శైలి మార్పుల ద్వారానే గుండె జబ్బుల్ని ప్రత్యేకించి రక్తనాళాల్లో ఏర్పడిన ఆటంకాలను తొలగించుకోవచ్చనే సూత్రీకరణలు చేశారు. రక్తనాళాల్లో ఏర్పడిన ఆటంకాలను సర్జరీ లేకుండానే తొలగించుకోవచ్చుననే సత్యాన్ని తాను చేసిన ఎన్నో ట్రయల్స్‌ ద్వారా నొక్కి చెప్పారు.
 
ఏది విశిష్ట జీవన శైలి? 
ఈ విషయంలో ప్రకృతి వైద్యం ఎప్పుడైతే శరీరంలో విషపదార్థాలు వచ్చి చేరతాయో అవే ఇతర జబ్బులన్నిటితో పాటు గుండె జబ్బులకు కూడా కారణమవుతాయని ఎప్పుడో స్పష్టం చేసింది. అయితే వేటిని విషపదార్థాలు అనుకోవాలనేది ప్రశ్న. కేవలం మలినాలు, వ్యర్థపదార్థాలే కాదు. శరీరానికి అవసరం లేనిది లేదా అవసరానికి మించి ఉన్నది అంటే కొవ్వు, లేదా ఇతర ద్రవాలు ఇవన్నీ విషతుల్యాలే. . ఈ అవగాహనతోనే ప్రకృతి వైద్య చికిత్స మొదలవుతుంది. దీన్నే రోగాద్వైతం, చికిత్సాద్వైతం అంటాం. రోగానికి మూల కారణం మలినాలైతే, ఆ మలినాలను బయటికి పంపించడమే ఆ రోగానికి వైద్యం.
 
ఒకప్పుడు గుండె జబ్బులన్నిటికీ పెరిగిపోయిన కొలెసా్ట్రల్‌ నిలువలే కారణమని, గుండె రక్తనాళాల్లో అడ్డుపడేది ఈ కొలెస్ట్రాలేనని అభిప్రాయపడేవారు. ఇప్పుడు ఆ భావన మారిపోయింది. రక్తనాళాల్లో ఆటంకాలకు కొవ్వుకణాల్లో రక్తస్రావమైన కారణంగా అక్కడ ఏర్పడే వాపు కారణమని ఇటీవలి పరిశోధ నలో బయటపడింది. ఈ వాపు రావడానికి ఎక్కువ మందిలో మానసిక ఒత్తిళ్లు లేదా శరీరంలోని ఇతర ప్రక్రియల్లోని లోపాలు కారణంగా బయటపడుతున్నాయి. వాపు రావడానికి గల మూల కారణాల్లోకి వెళితే, జీవన యానంలో అతి వేగం, అదుపులేని మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లతో పాటు, శరీర శ్రమ లేకపోవడం కారణాలుగా కనపడుతున్నాయి. ఈ పరిణామాలకు దారితీస్తున్న పరిస్థితులను విడనాడకుండా, ఆధునిక వైద్యం అన్నింటికీ సర్జరీయే మార్గం అంటోంది. అందుకే ఎక్కడ అవరోధం ఏర్పడితే, అక్కడ బైపాస్‌ సర్జరీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి అనంత దూరాలకు వెళ్లేటంత పొడవైనవి మన సూక్ష్మ రక్తనాళాలు. ఆటంకం అన్నది ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే, అంతటి పొడవాటి రక్తనాళాల్లో ఎక్కడెక్కడ సర్జరీ చేస్తారు? ఎన్ని సార్లని చేస్తారు? కానీ జరుగుతున్నది అదే. ఒకసారి బైపాస్‌ సర్జరీ చేయించుకుంటే చాలాసార్లు శాశ్వత చికిత్సగా ఏమీ ఉండడం లేదు. ఒకదాని తరువాత ఒకటిగా మూడు నాలుగు సర్జరీలు చేయించుకున్న వారు మనకు ఎంతమందో కనిపిస్తారు. ఈ స్థితిని అధిగమించే మరో మార్గమే లేదా? అన్ని రక్తనాళాల్నీ ఆరోగ్యంగా ఉంచుకునే మార్గమే లేదా? అంటే ఉంది.
 
సహజ నియమాలు 
మానసిక ఒత్తిళ్లు గుండె జబ్బులకు ప్రధాన కారణంగా చెబుతారు. అయితే, అతిగా ఒత్తిడికి గురయ్యే వారిలో శరీర శ్రమకు లేదా వ్యాయామానికి దూరంగా ఉండేవారే ఎక్కువ. రోజూ వ్యాయామం చేసేవారిలో గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా, వాళ్లు గుండెపోటుకు గురయ్యే అవకాశం లేదు. అయితే, గుండె జబ్బేమీ లేకపోయినా శరీర శ్రమ లేని కారణంగా నాడీ వ్యవస్థ ఒత్తిడికి గురిఅవుతుంది. ఆ క్రమంలో హానికారకమైన అడ్రినలిన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదలై అంతిమంగా అది గుండె పోటుకు కారణమవుతుంది. అందుకే ఏదో ఒక రీతిన శరీరాన్ని రోజూ శ్రమకు గురిచేయాలి. లేదా వ్యాయామం చేయాలి.
 
వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే, 90 శాతం వృక్ష సంబంధమైన ఆహార పదార్థాలు ఉంటే మేలు. ఆహారంలో రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తినకపోతే మంచిది. రసాయనాలకు ఆహార పదార్థాలను నిలువ చేసేందుకు వినియోగించే ప్రిజర్వేటర్స్‌కు దూరంగా ఉండడ ం మంచిది. పిండి పదార్థాలు, కొవ్వు మోతాదును ఆహారంలో బాగా తగ్గించడం చాలా అవసరం. అన్నింటినీ మించి రక్తం పలుచగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ వ హించాలి. అందుకు తరుచూ నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే ఆహారంలో పళ్ల రసాలు అంటే సిట్రస్‌ (విటమిన్‌-సి) ఉండేలా చూసుకోవాలి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. సాలుబుల్‌ అంటే జీర్ణమయ్యేది, ఇన్‌సాలుబుల్‌ అంటే జీర్ణం కానిది ఈ రెండు రకాల పీచుపదార్థాలు మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. జీర్ణమయ్యే పీచుపదార్థం మలబద్దకాన్ని నివారించడానికే కాకుండా మంచి బ్యాక్టీరియా పోషణకు కూడా తోడ్పడుతుంది. అసలు మలబద్దకం రాకుండా నివారించడం అంటే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోకుండా కాపాడుకోవడమే. విషపదార్థాలు పేరకుండాపోవడం అంటే 50 శాతం గుండె జబ్బులకు అడ్డు కట్ట వేసినట్లే. దీనికి తోడు నూనెలు, కొవ్వు పదార్థాలున్న ఆహారం అతి తక్కువగా తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
 
అప్పటికే గుండె జబ్బు ఉంటే 
దానిమ్మ రసం లేదా ఉసిరికాయ రసం ద్వారా రక్తనాళాల్లో చేరిన కొలెసా్ట్రల్‌ లేదా కొవ్వు కరిగిపోతుంది. ఒక వేళ వారికి మధుమేహమే ఉంటే ఇన్సులిన్‌ ఇస్తూనే అయినా దానిమ్మ రసం ఇస్తే, ఆ అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ఇవన్నీ గుండె జబ్బు వచ్చే అత్యవసర పరిస్థితి కన్నా ముందే చేయాలి. కొవ్వు కణాల్లో రక్తస్రావం కావడానికి ఫ్రీరాడికల్స్‌ కారణం కాబట్టి ఆ ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే శక్తి దానిమ్మ రసానికి సమృద్ధిగా ఉంది. ఉసిరి కాయ రసం (రెండు కాయలు)లో కూడా ఈ శక్తి ఉంది. రోజూ ఉదయమే పరగడుపున ఈ రసం తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ రసాల్లో ఏదో ఒకటి తీసుకుంటే కేవలం ఒకటి రెండు వారాల్లోనే గుండె నొప్పి తగ్గిపోతుంది. అదే క్రమంలో మెల్లమెల్లగా రక్తనాళాల్లోని ఆటంకాలు కరిగిపోతాయి. అలాగే ఉదయం లేవగానే 5నుంచి 10 నిమిషాల వ్యవధిలో లీటర్‌నుంచి లీటర్‌ పావు నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తం పలుచబడి రక్తప్రసరణలోని అంతరాయాలు తొలగిపోతాయి. అలాగే యోగాసనాలు, ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. వాస్తవానికి గుండె, శ్వాసకోశాలు ఈ రెండింటికీ మౌలికంగా ఒక యంత్రం ఉంటుంది. అందువల్ల శ్వాసకోశాలను శుద్ధి చేయడంతో పాటు, వాటిని చైతన్య పరిచే ప్రాణాయామం వల్ల గుండె పనితీరు కూడా చక్కబడుతుంది. గుండె జబ్బు నయమవుతుంది. ఉదయం అరగంట, సాయంత్రం ఒక అరగంట ఈ వ్యాయామాలు చేయడం ద్వారా గుండె జబ్బుల సమస్యనుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 
సూక్ష్మరక్తనాళాల (కొల్లాట్రల్స్‌) పనితనం 
గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డ వారికి లేదా ఒక సారి గుండెపోటు వచ్చిన వారికి శరీరంలో రక్తప్రసరణ జరిగే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది. అదే ప్రతి అవయవం చుట్టూ ఉండే సూక్ష్మ రక్తనాళాలు ( కొల్లాట్రల్స్‌) పనిచేయడం మొదలెడతాయి. రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడిన వారిలో ఆ సూక్ష్మ రక్తనాళాలు పనిచేస్తూనే ఉంటాయి. అందుకే వారు గుండె పోటుకు గురికాకుండా ఉండిపోతారు. కాకపోతే రక్తనాళాల్లో ఆటంకాలు క్రమానుగతంగా ఏర్పడినప్పుడే ఈ సూక్ష్మ రక్తనాళాలు పనిచేయడం మొదలెడతాయి. అత్యంత వేగంగా ఆటంకాలు ఏర్పడినప్పుడు ఈ సూక్ష్మ రక్తనాళాల వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవచ్చు. గుండెపోటు వచ్చి హఠాన్మరణం పాలైన వారి విషయంలో వీటి పాత్ర ఏమీ ఉండదు కానీ, సమస్య నిదానంగా మొదలయ్యే వారిని ఈ సూక్ష్మ రక్తనాళాలు కాపాడతాయి. నిజానికి ఇప్పటిదాకా గుండెపోటుకు గురికాని వారి గుండె రక్తనాళాల్లో అసలు ఆటంకాలే లేవనికాదు. అయినా వారి గుండె సక్రమంగా పనిచేయడానికి వారి సూక్ష్మ రక్తనాళాలు పనిచేయడమే కారణం. అందువల్ల రిపోర్టులల్లో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయని తేలినంత మాత్రాన అందరూ వెంటనే శస్త్ర చికిత్సకు వెళ్లాలనేమీ లేదు. కాకపోతే అత్యంత వేగంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రకృతి వైద్య నియమాలన్నీ పాటించాలి. వీటివల్ల గుండెకు అవసరమైన రక్తం అందడమే కాకుండా, అప్పటికే గుండె రక్తనాళాల్లో చేరిన అడ్డంకులు కూడా క్రమంగా తొలగిపోతాయి.
 
సూక్ష్మనాళాలు కూడా పూడిపోతే.... 
గుండె ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెకు రక్తాన్ని చేరవేసే బాధ్యతను సూక్ష్మ రక్తనాళాలు పోషిస్తాయి. ఈ లోగా అప్పటిదాకా పేరుకున్న అడ్డంకులు తొలగిపోయేలా జీవన శైలిలో మార్పులు చేసుకుంటే సరే సరి. లేదంటే ఒక దశలో ఈ సూక్ష్మరక్తనాళాలు కూడా మూసుకుపోతాయి. అప్పుడింక ఆ వ్యక్తి గుండెపోటుకు గురికాక తప్పదు. ఈ ఆటంకాలనేవి కేవలం గుండె రక్తనాళాల దగ్గరే ఆగిపోతాయని కూడా కాదు. శరీరంలోని కీలక అవయవాలకు వెళ్లే అన్ని రక్తనాళాల్లోనూ ఆటంకాలు ఏర్పడవచ్చు. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడితే పక్షవాతం రావచ్చు. అలాగే కిడ్నీ, లివర్‌, శ్వాసకోశాలకు వెళ్లే రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడితే ఆయా అవయవాలు వ్యాధిగ్రస్తం కావచ్చు. అందువల్ల సూక్ష్మ రక్తనాళాలు కూడా పూడిపోయే దుస్థితి ఏర్పడక ముందే జీవన శైలి మార్పులు చేసుకోవడం అత్యంత అవశ్యం. జీవన శైలి మార్పులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు. జీవితాన్నే దివ్యంగా మార్చేస్తాయి. ఇది ముమ్మాటికీ నిజం. 

డాక్టర్‌ కె. సత్యలక్ష్మి