యంగ్‌ ఎటాక్‌!

నవనవలాడుతూ హుషారుగా ఎదుగుతున్న

మొక్క హఠాత్తుగా వాలిపోతే...
నీరు, గాలి, వెలుతురు...
అన్నీ ఉన్నా ఇలా జరిగిందేంటి? అని చింతిస్తాం!
అయ్యో! పెరిగి ఎంత పెద్ద మహావృక్షమయ్యేదో?
అని బాధ పడతాం!
కానీ అలా జరగడానికి కారణాలు అనేకం!
కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు ‘వైష్ణవ్‌’ విషయంలో జరిగిందిదే!
21 ఏళ్ల ఉరకలెత్తే నవ యువకుడు హఠాత్తుగా
గుండె పోటుతో రాలిపోయాడు.
యుక్త వయసులో గుండె పోటు ఎందుకు? ఈ సమస్యను ముందుగానే కనిపెట్టేదెలా? తెలుసుకుందాం!
 
29-05-2018: హఠా త్తుగా కుప్పకూల్చేసే గుండె సమస్య యుక్త వయస్కుల్లో సాధారణంగా గుండె జబ్బు లక్షణాలు చివరివరకూ కనిపించవు. హఠాత్తుగా మూర్ఛ వచ్చినట్టు పడిపోవడం, కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఇది గుండెకు సంబంధించిన విద్యుత్తు సమస్య. వీరికి ఈసీజీ తీస్తే సమస్యను ముందుగానే గుర్తించి సరిదిద్దే వీలుంటుంది. కానీ ఎలాంటి ఆరోగ్య సమస్య లేని వ్యక్తికి ఈసీజీ తీయించుకునే అవసరం ఉండదు కాబట్టి ఈ సమస్య బయల్పడకుండానే అకస్మాత్తుగా ప్రాణాలను మింగేస్తూ ఉంటుంది. ఇది కూడా పుట్టుకతో వెంట తెచ్చుకునే సమస్యే!
 
‘గుండె పోటుతో పోయారు’.... అనగానే కళ్ల ముందు వృద్ధులే మెదులుతారు. కానీ ఇదంతా ఒట్టి అపోహే! ఇదే కాదు... గుండె సమస్యలు, వాటికి గురయ్యే బాధితులు, కారణాల పట్ల మనలో అపోహలు లెక్కలేనన్ని! వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటేనే గుండె సమస్యలతో కోల్పోయే యువ ప్రాణాలను కాపాడుకోగలుగుతాం! గుండె సమస్యల పట్ల మనలో నెలకొని ఉండే అపోహలు, వాస్తవాలు తెలుసుకుందాం!
 
అపోహ: గుండె పోటు వృద్ధుల్లోనే!
నిజం: ఇది నిజం కాదు. గుండె పోటు ఎవరికైనా, ఎప్పుడైనా రావొచ్చు. గుండె సమస్యలపరంగా అమెరికా, జపాన్‌లతో పోల్చుకుంటే మన దేశం రెండు దశాబ్దాల ముందు ఉంది. అంటే ఆ దేశాల్లో 60 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే, మన దేశంలో 40 ఏళ్లకే వచ్చేస్తోంది. జపనీయులతో పోల్చుకుంటే మన దేశంలో గుండె సమస్యలు 40ు ఎక్కువ. అమెరికన్లతో పోల్చుకుంటే మన దేశంలో గుండె సమస్యలు 5% ఎక్కువ. అయితే యంగ్‌ అడల్ట్స్‌ అని పేర్కొనే 18 నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవాళ్లకి గుండె సమస్యలు తలెత్తే ట్రెండ్‌ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇంతకుముందు 45, 50 ఏళ్లు దాటిన వాళ్లలో మాత్రమే కనిపించేవి. అయితే గత రెండ దశాబ్దాలుగా కొన్ని ‘అన్‌హెల్తీ రిస్క్‌ ఫ్యాక్టర్స్‌’ వల్ల యుక్తవయస్కుల్లోనే గుండె సమస్యలు తలెత్తడాన్ని చూస్తున్నాం! ఈ సమస్య దక్షిణ ఆసియాలో, మరీ ముఖ్యంగా మన దేశంలో ఈ ట్రెండ్‌ ఎక్కువగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం జన్యుపరంగా మన దేశస్థులకు గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడమే! గుండె పోటు తీవ్రత కూడా యుక్తవయస్కుల్లో ఎక్కువ. 50, 60 ఏళ్ల వ్యక్తికి గుండె పోటు వచ్చినా బ్రతికే అవకాశాలు ఉంటాయి. కానీ యుక్త వయస్కుల్లో తక్షణ చికిత్స ఆలస్యమైతే, ఒక్క గుండె పోటుకే ఏకంగా ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది.
 
అపోహ: ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లకే గుండెపోటు!
నిజం: ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా గుండె సమస్యలు రావొచ్చు. తింటూ, తిరుగుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉండే చలాకీ వ్యక్తులకూ గుండె సమస్యలు రావొచ్చు. ఇందుకు కారణాలున్నాయి. అవేంటంటే...
 
వ్యాయామ లోపం: శరీరానికి వ్యాయామాన్ని అందించకుండా, ఆఫీసుల్లో ఎక్కువ సమయంపాటు కూర్చుని పనిచేయడం, ఇంట్లో ఉన్నప్పుడూ ఎక్కువ సమయం విశ్రాంతిలో గడపడం లాంటి అలవాట్ల వల్ల శరీర బరువు పెరుగుతుంది. దాంతో ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బిఎమ్‌ఐ) పెరిగి, కొలెస్ట్రాల్‌ మూలంగా గుండె సమస్యలు రావొచ్చు.
 
స్థూలకాయం: శరీర వైశాల్యం పెరిగేకొద్దీ రక్తాన్ని చర్మం వరకూ సరఫరా చేయడం కోసం రక్తనాళాలు కూడా చెట్ల కొమ్మల్లా పెరుగుతుంటాయి. ఇలా ఒళ్లంతా పెరిగిన రక్తనాళాల్లోకి రక్తాన్ని సరఫరా చేయాలంటే గుండె అవసరానికి మించి బలంగా పని చేయాలి. ఇదే పరిస్థితి కొనసాగితే గుండె మీద భారం పెరిగి సమస్యలు మొదలవుతాయి.
 
ఆహారం: ఆహారశైలిలో తీవ్రమైన మార్పులొచ్చాయి. సమయానికి తినడం మానేస్తున్నాం! వండుకోవడం తక్కువై, తినడానికి సిద్ధంగా, తేలికగా దొరికే ఆహారం మీద ఆధారపడుతున్నాం! వీటి ద్వారా అవసరానికి మించి కొవ్వులు, చక్కెరలు, కృత్రిమ రంగులు, రుచులు, ప్రిజర్వేటివ్స్‌ మన శరీరంలోకి చేరిపోతున్నాయి. వాటి ప్రభావం గుండె మీద పడుతోంది.
 
ఆరోగ్య సమస్యలు: అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, మధుమేహం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ మన దేశంలోని కుర్రకారులో బాగా పెరుగుతోంది. ఇవి కూడా గుండె సమస్యలకు దారి తీస్తాయి.
 
ధూమపానం: విదేశాల్లో ఈ అలవాటు క్రమేపీ తగ్గుతుంటే, మన దేశంలో క్రమేపీ పెరుగుతోంది. గుండెకు ధూమపానం ప్రధమ శత్రువు. పొగ తాగడం వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారతాయి. రక్తం చిక్కబడుతుంది. దాంతో రక్తప్రసారం తేలికగా జరగక గుండె మీద భారం పెరుగుతుంది. ఫలితంగా గుండె సమస్యలు తలెత్తుతాయి.
 
పని ఒత్తిడి: సాఫ్ట్‌వేర్‌లాంటి నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే ఉద్యోగుల్లో పని ఒత్తిడి అధికం. ఈ ఒత్తిడి ప్రభావం గుండె మీద కచ్చితంగా పడుతుంది.
 
అపోహ: గుండె జబ్బులు హఠాత్తుగా మొదలవుతాయి
నిజం: పెరిగే క్రమంలో గుండె జబ్బులు మొదలవుతాయి అనేది అపోహ. ఇలా అందరికీ జరగకపోవచ్చు. కొందరికి పుట్టుకతోనే గుండె సమస్య ఉండొచ్చు. ఇంకొందరు గుండెకు రంథ్రాలతో పుట్టి ఉండవచ్చు. అయితే పుట్టగానే కనిపించని ఇబ్బంది బాల్యంలో మొదలవవచ్చు. కొందరికి యుక్తవయసులో బయట పడొచ్చు. గుండె సమస్య కొందరికి జన్యుపరంగా సంక్రమించి ఉండవచ్చు. ఇంకొందరికి వంశపారంపర్యంగా సంక్రమించి ఉండొచ్చు. ఇలా పుట్టుకతోనే వెంట తెచ్చుకునే గుండె సమస్యలకు మిగతా వారిలా ఇతరత్రా అంశాలేవీ కారణాలు కావు. అయినా అంతే తీవ్రమైన పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
 
గుండె జబ్బులు అందరిలోనూ ఒకలాగే ఉంటాయి
నిజం: యుక్త వయస్కులకూ, పెద్దలకూ వచ్చే గుండె జబ్బులు వేర్వేరుగా ఉంటాయి. యుక్త వయస్కుల్లో జన్యుపరంగా లేదా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఎక్కువ. జన్యుపరంగా వచ్చే గుండె జబ్బుల్ని నియంత్రించడం కష్టం. అలాకాకుండా గుండె లోని రక్తప్రసరణలో లోపం వల్ల వచ్చే గుండె జబ్బులు, గుండె కండరం పాడైపోవడం వల్ల వచ్చే గుండె జబ్బులు, గుండె పనితీరు దెబ్బతినడం వల్ల వచ్చే గుండె జబ్బులు యుక్త వయస్కుల్లో ఎక్కువ. గర్భంలో ఉన్నప్పుడే గుండె ఏర్పడే దశలో కవాటాలు పాడైపోవడం, గుండెకు రంథ్రాలు ఏర్పడడం (స్ట్రక్చరల్‌), ఇన్‌హెరిటెడ్‌ కార్డియోమయోపతి (వంశపారంపర్యంగా సంక్రమించే గుండె జబ్బులు), గుండె కండరాలు మందంగా తయారై గుండె పనితీరు దెబ్బతినడం, గుండె కొట్టుకునే తీరులో మార్పులొచ్చి గుండె పోటు రావడం (ఇన్‌హెరిటెడ్‌ ఎరిథిమియా డిసీజ్‌), గుండెలో ఎలక్ట్రిక్‌ ఇంపల్స్‌లో తేడాలు, గుండె, కవాటాలు... అన్నీ బాగున్నా, దాన్లోని అయాన్‌ ఛానళ్లు పాడవడం వల్ల గుండె పోటు రావడం (మాలిక్యులర్‌ అబ్నార్మాలిటీ), గుండె కొట్టుకునే తీరులో పుట్టుకతోనే తేడాలుండడం (ఇన్‌హెరిటెడ్‌ ఎరిథిమియా సిండ్రోమ్‌)... ఇలా యుక్త వయసులో బయల్పడే గుండె జబ్బులకు, గుండె పోట్లకు కారణాలు అనేకం.
 
అపోహ: లక్షణాలు కనిపెట్టడం కష్టం
నిజం: అన్నిటికీ కాకపోయినా, కొన్ని గుండె జబ్బుల్లో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. లక్షణాలు కనిపించినా వాటిని గుండె జబ్బు లక్షణాలుగా భావించకపోవడం వల్ల అసలు గుండె జబ్బులో ఎటువంటి లక్షణాలూ ఉండవు అనుకుంటాం. కానీ గుండె జబ్బులో బయల్పడే లక్షణాలను సాధారణంగా అశ్రద్ధ చేయడమే జరుగుతూ ఉంటుంది.
 
పిల్లల్లో, యుక్తవయస్కుల్లో ఈ  లక్షణాలు ఎలా ఉంటాయంటే...
కొద్ది దూరం పరిగెత్తితే ఆయాసపడడం
మిగతా పిల్లలతో సమానంగా ఆటలు ఆడలేకపోవడం
నీరసం
కళ్లు తిరగడం
చమటలు పట్టడం
అపోహ: గుండె పోటు వస్తే సిపిఆర్‌ చేయాలి
నిజం: నిజమే! సిపిఆర్‌తో ఆగిన గుండెను పని చేయించే వీలుంది. అయితే ఎలాంటి గుండె సమస్యతో వ్యక్తి కుప్ప కూలాడో తెలియకుండా సిపిఆర్‌ చేయడం సమంజసం కాదు. ఆ పద్ధతి మీద అవగాహన ఉన్న వ్యక్తులే చేయాలి. తెలియని వ్యక్తులు తమకున్న మిడిమిడి జ్ఞానంతో సిపిఆర్‌ చేయడానికి ప్రయత్నించడం వల్ల విలువైన సమయం వృథా అవుతుంది.
 
గుండె పోటుకు గురయిన వ్యక్తికి సాధ్యమైనంత తొందరగా వైద్య సహాయం అందించాలి. ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే గుండెకు అంత తక్కువగా నష్టం జరుగుతుంది. యాస్పిరిన్‌ మాత్ర ఉంటే వెంటనే పోటుకు గురైన వ్యక్తి చేత చప్పరించేలా చేయాలి. తర్వాత వీలైనంత త్వరగా గుండె సమస్యతో కూలిపోయిన వ్యక్తిని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి.
అపోహ: గుండె జబ్బుకు సర్జరీ ఒక్కటే మార్గం
నిజం: పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను రాకుండా ఆపలేం, నియంత్రించలేం! కానీ కనిపెట్టగలం. ముందుగానే గుర్తించి చికిత్స మొదలుపెడితే సర్జరీ వరకూ వెళ్లవలసిన అవసరం తప్పుతుంది. హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయే దుస్థితినీ తప్పించవచ్చు. నోటి మాత్రలు, పేస్‌ మేకర్లు, స్పెషల్‌ డివైజ్‌లు, బెలూన్‌ ట్రీట్మెంట్‌.... ఇలా సమస్యనుబట్టి చికిత్సలు ఉంటాయి.
 
అపోహ: గుండె జబ్బుల్ని ముందుగా గుర్తించడం కష్టం
నిజం: వీటిని గుర్తించే వీలుంది. పుట్టిన వెంటనే పిల్లల గుండెను పరిశీలించే పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వీలైతే సమస్య సరిచేయవచ్చు. అలాగే పుట్టుకతో ఎలాంటి గుండె సమస్యలూ లేకపోయినా జన్యుపరంగా కూడా గుండె జబ్బులు సంక్రమించే వీలుంది కాబట్టి 20 ఏళ్ల వయసులో కచ్చితంగా గుండె పరీక్ష చేయించాలి. 20 నుంచి 25 ఏళ్లలో గుండె సమస్య బయల్పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆ వయసులోకి అడుగు పెట్టిన వెంటనే పరీక్షలు చేయించాలి.

ఈ సమస్యతో హఠాన్మరణం

కొందరికి గుండె ఆకారం మామూలుగా ఉండి, ఈసీజీ కూడా మామూలుగానే ఉన్నా గుండె కొట్టుకునే పద్ధతిలో తేడాలుండొచ్చు. ఈ సమస్యను ‘హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి’ అంటారు. ఈ సమస్య బాల్యంలోనే తీవ్రమైతే నిద్ర పోతున్నప్పుడే పిల్లలు ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ యుక్తవయసులో మొదలైతే అప్పటిదాకా చలాకీగా తిరుగుతున్న కుర్రాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతారు. ఇలా క్రీడాకారుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తుల్లో అంతకుముందు వరకూ గుండె సమస్యకు సంబంధించి ఎటువంటి లక్షణాలూ కనిపించవు. ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోతారు. ఈత కొడుతున్నప్పుడూ, వ్యాయామం చేస్తున్నప్పుడు సమస్య తలెత్తి ప్రాణాలు వదులుతారు.
 
బరువు తగ్గించే పద్ధతుల ప్రభావం గుండె మీద
బరువు తగ్గించే కొన్ని రకాల మందులు, వ్యాయామాలు, ఆహార పద్ధతుల ప్రభావం గుండె మీద ఎంతో కొంత పడుతుంది. కాబట్టి ఏ కొత్త విధానాన్ని అవలంబించాలన్నా ముందుగా వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. బరువు తగ్గడం కోసం అనుసరించే డైట్‌ల వల్ల శరీరంలోని లవణాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి ఫలితంగా గుండె మీద ప్రభావం పడుతుంది. మనకు తెలియకుండానే గుండె సమస్య ఉండి, గుండె వేగాన్ని పెంచే వ్యాయామాలు మొదలుపెట్టడం వల్ల గుండె జబ్బు తీవ్రమవ్వొచ్చు. కాబట్టి బరువు తగ్గించే ఎలాంటి పద్ధతి అవలంబించాలనుకున్నా ముందుగా వైద్యులను సంప్రతించాలి.
 
 
డాక్టర్‌ వి.రాజశేఖర్‌,
ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ అండ్‌ ఎలకో్ట్రఫిజియాలజిస్ట్‌,
యశోదా హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.