16-03-2018: నా వయసు 64 సంవత్సరాలు. హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాను. నీరసం, కాళ్ళు లాగడం ఉంది. ఆహారంలో ఎలాంటి మార్పులు చేస్తే కుదుట పడతానో చెప్పండి.
హార్ట్ ఫెయిల్యూర్, గుండె సంబంధిత వ్యాధులున్నవారు జీవనవిధానంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది.
ఆహారంలో పీచు పదార్థం : హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం. పీచు పదార్ధం బాడీఫ్యాట్ని, బ్లడ్ఫ్యాట్ని నార్మల్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. తొక్క వున్న గింజలు ఉదా: శెనగలు, రాజ్మా, అలసందలు, బొబ్బర్లు, పెసలు మొదలైనవాటిలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వాటిని కూరల్లో కలిపి తినాలి. అలాగే కాయగూరలు, పళ్ళలో కూడా పీచు పదార్థం అధికం. రోజుకి రెండు కప్పుల కాయగూరలు, రెండు కప్పుల పళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. పళ్ళు, కాయగూరలు పీచుపదార్ధం ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని బాగు చేసే యాంటాక్సైడ్ని ఇస్తాయి.
ఉప్పు నియంత్రణ: రోజుకు 5 గ్రాముల ఉప్పుకంటే ఎక్కువ వాడకూడదు. ఒక టీ స్పూను ఉప్పులో 2300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇది నార్మల్‌గా అందరు వాడవచ్చు. హార్ట్‌ఫెయిల్యూర్ ఉన్నవారు ముప్పావు టీ స్పూను (1725 మిల్లీగ్రాములు) ఉప్పువాడితే మంచిది. హార్ట్‌ఫెయిల్యూర్ తీవ్రతను బట్టి ఉప్పు తగ్గించాలి. పొటాషియం ఎక్కువగా ఉన్న ఉప్పు మార్కెట్లో దొరుకుతుంది అది వాడటం మంచిది. సోడియంని పొటాషియం బ్యాలెన్స్ చేస్తుంటుంది కాబట్టి పొటాషియం అధికంగా ఉన్న పళ్ళు, కూరగాయలు ఆహారంలో ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు, దానిమ్మ, నిమ్మకాయల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. భోజనంలో నిమ్మరసం పిండుకుంటే రుచితో పాటు సోడియంని బాలెన్స్ చేస్తుంది.
అధికంగా ఉప్పు ఆహారంలో చేరకుండా ఉండాలంటే: భోజనంలో ఉప్పు చల్లుకోవడం మానేయాలి. ఇడ్లీ, దోసె, చపాతీ పిండిలలో ఉప్పు కలపడం మానేయాలి. నిలవ పచ్చళ్లకు దూరంగా ఉండాలి. బేకరీఫుడ్స్లో సోడియం ఇతర రసాయనాలు ఉపయోగిస్తారు. అందుకే వాటిని కూడా దూరం పెట్టాలి. బయటి ఆహారం, సాఫ్ట్‌డ్రింక్స్, నిల్వ ఉండే పదార్థాలు బాగా తగ్గించాలి.
నీరు ఎంత తాగాలి: రోజుకి 8 కప్పులు లేక 2 లీటర్ల నీళ్లు తాగాలి. మందులు వేసుకునేందుకు తాగే నీళ్లు కూడా లెక్కలోకి వస్తాయి. కొందరికి డాక్టర్ ఫ్లూయిడ్ రిస్ట్రిక్ట్ చేస్తారు. అటువంటి వారు కొలత ప్రకారంగా నీళ్లు తాగాలి.
ఆహారంలో ఎప్పుడూ ఒకే రకం పదార్థాలు కాకుండా వేరువేరు పదార్థాలు తినాలి. పళ్ళు, కాయగూరలు సీజన్లో దొరికేవి తప్పక తీసుకోవాలి. మితంగా, సులువుగా జీర్ణమయ్యేలా టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి. తొక్కతో ఉన్న ముప్పావు కప్పు గింజలు మూడు సమభాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కో పూట తీసుకోవాలి. నట్స్, సీడ్స్ రోజుకి ఒక గుప్పెడు తినొచ్చు. వీటిని స్నాక్స్‌లా తీసుకుంటే మంచిది. పంచదార 4 టీస్పూనుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. నూనె కూడా 4 టీ స్పూన్లు వాడాలి. చేపలు వారానికి రెండు సార్లు తింటే మంచిది. శాఖాహారులు సోయా తీసుకోవాలి. రోజుకి ఒక గుడ్డు (పచ్చసొనతో పాటు) తీసుకోవచ్చు.
మద్యం ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. వ్యాయామం చాలా అవసరం. అయితే ఇది కూడా క్రమపద్ధతిలో, ఎంత అవసరమో అంతే చేయాలి.