టీనేజ్‌ నుంచే వైద్య పరీక్షలు

ఆంధ్రజ్యోతి, 12/02/2014: ఎప్పటి నుంచి వైద్య పరీక్షలు చేయించుకోవాలి? దీనికి వయసంటూ ఏమైనా ఉందా? ఎందుకైనా మంచిది, 18 ఏళ్లు వచ్చిన దగ్గర నుంచీ బ్లడ్‌ ప్రెషర్‌ పరీక్షించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బుల్లో బ్లడ్‌ ప్రెషర్‌ లేదా రక్తపోటు కీలక పాత్ర పోషిస్తున్నందువల్ల, దీని విషయంలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమని వారు సలహా ఇస్తున్నారు. పద్ధెనిమిదేళ్ల ప్రాంతంలో రక్తపోటు ప్రారంభమైతే నడివయసులో గుండె సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని చికాగో యూనివర్సిటీలో దాదాపు 25 ఏళ్ల పాటు జరిపిన ఓ సమగ్ర అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, నడివయసులో వచ్చే గుండె జబ్బుల్ని ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి 18 ఏళ్ల నుంచే ఆరోగ్య పరీక్షలు జరిపించుకుంటూ ఉండాలని కూడా వాళ్లు మరో విధంగా చెబుతున్నారు.
 
ప్రస్తుత కాలంలో చాలామంది యువతీ యువకుల్లో అతి చిన్న వయసు నుంచే రక్తపోటు లక్షణాలు కనిపిస్తున్నాయని, రక్తపోట్లు రకరకాల స్థాయిల్లో బయటపడుతున్నాయని చార్లెస్‌ వెస్ట్‌ నాయకత్వంలోని ప్రివెంటివ్‌ మెడిసిన్‌ విభాగ అధ్యాపకులు తెలిపారు. ఇప్పటి యువతలో గుండె సంబంధమైన ప్రమాదావకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని, ఆధునిక జీవన శైలి వాళ్లను ప్రాణాంతక వ్యాధులకు దగ్గర చేస్తోందని వారన్నారు. ‘‘పద్ధెనిమిదేళ్లకే రక ్తపోటు లక్షణాలు కనిపిస్తున్న కుర్రకారు సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం లక్షల్లో ఉంది. ఎందుకైనా మంచిది, ఆ వయసు నుంచే తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. లేని పక్షంలో రిస్క్‌ పెరిగి, నడివయసులోనే ఆయుర్దాయానికి తెరపడడం ఖాయం’’ అని వెస్ట్‌ చెప్పారు.
 
రక్తపోటు మొదలైనప్పుడు నడివయసు వరకూ దాన్ని అలాగే వదిలేయకూడదు. చిన్న తనంలోనే ఒక స్థాయి దగ్గర దాన్ని నిరోధించగలిగితే గుండె జబ్బులు, పక్షవాతాలు వగైరా జబ్బుల నుంచి తప్పించుకోవడానికి వీలుంటుంది. 18 నుంచి 55 ఏళ్ల వయసువారి మధ్య రక్తపోటుకు సంబంధించిన పరీక్షలు జరిపినప్పుడు, ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా రక్తపోటు కనిపించిందని, ఇది ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ప్రాణాంతక వ్యాధుల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని వెస్ట్‌ వివరించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు దెబ్బతినడం చాలామందిలో 18 ఏళ్లకే ప్రారంభం కావడం ఆందోళన కలిగిస్తోందని, ప్రతివారూ చిన్న వయసు నుంచే ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవాల్సిన అగత్యాన్ని ఇది చెప్పకనే చెబుతోందని వెస్ట్‌ అన్నారు.
 
యువతీ యువకుల్లో రక్తపోటు లక్షణాలు కనిపించగానే, ఆధునిక జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని వాళ్లకు వివరిస్తున్నామని, అయినప్పటికీ రిస్క్‌ పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేకపోతున్నామని అంటూ ఆయన, రక్తపోటు ఎప్పుడు ఏ ప్రమాదం తెచ్చిపెడుతుందో చెప్పలేమని తెలిపారు.
 
చిన్నతనంలోనే రక్తపోటు లక్షణాలు కనిపించినప్పుడు వెనువెంటనే పరీక్షలు జరిపించుకుని చికిత్స తీసుకోవడం వల్ల ఆయుర్దాయానికి భద్రత ఏర్పడుతుందని డాక్టర్టు చెబుతున్నారు. ‘‘నిజానికి రక్తపోటును వెంటనే అరికట్టవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ గుండె మీదా, రక్త నాళాల మీదా దాని ప్రభావం ఉంటుందనే సంగతిని మరచిపోకూడదు. అందువల్ల ఎంత త్వరగా స్పందిస్తే ఆరోగ్యానికి అంత మంచిది’’ అని కూడా వారు సూచించారు.
 
పిన్నవయసువారిలో గుండె, రక్తం, ఊపిరితిత్తుల పరీక్షలు’’ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని, వేలాది మంది యువతీ యువకులపై డాక్టర్లు పరీక్షలు జరిపారు. టీనేజ్‌ పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రక్తపోటు లక్షణాలు కనిపిస్తున్నాయని. అందుకని 18 ఏళ్ల వయసు నుంచే పరీక్షలు జరిపించుకోవడం శ్రేయస్కరమని చికాగో డాక్టర్లు చెబుతున్నారు. 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు యువతీ యువకుల మీద పరీక్షలు జరిపారు. ఇంతకు ముందు 40 ఏళ్లు దాటితే గానీ రక్తపోటు లక్షణాలు కనిపించేవి కావనీ, కానీ ఇప్పుడు 18 ఏళ్లవారిలో కూడా ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. అమెరికన్‌ మెడిక ల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో యువతలో కొత్త అనారోగ్య లక్షణాలు అనే శీర్షిక కింద ఈ వివరాలను ప్రచురించారు.