ముందస్తు సూచనలు పట్టించుకోండి...

ఆంధ్రజ్యోతి, 23-06-2015: గతంలో యాభై ఏళ్లు పైబడిన తర్వాత గుండె నొప్పి గురించి ఆలోచించేవాళ్లు. ప్రస్తుతం మారిన జీవన విధానం, కాలుష్యం, ఆహార నియమాలు.. వెరసి ముప్పయ్‌ ఏళ్లు పైబడిన వారు కూడా గుండె జబ్బుల బారినపడుతున్నారు. సుమారు అరవై శాతంపైగా గుండె నొప్పి లక్షణాలు.. గుండెపోటు సంభవించకముందే అనుభవంలోకి వస్తాయని ఒక పరిశోధనలో తేలింది. అయితే ముందుగా వచ్చే ఈ లక్షణాలను చాలామంది తేలిగ్గా తీసుకుని, జాగ్రత్త పడటంలో విఫలం అవుతున్నారు.
 
శారీరక శ్రమకు దూరమవడం వల్ల ఊబకాయం, మధుమేహం, హైబీపీ వంటివి ఒంట్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇవే తీవ్ర రూపం దాల్చి గుండెపై ప్రభావం చూపుతున్నాయి. మిగతా రోగాల్లా కాకుండా.. హృద్రోగం తీవ్ర రూపం దాల్చిన తర్వాతే బయటపడుతుంది. అయితే.. గుండె జబ్బును ముందుగానే పసిగట్టే సూచనలు కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించగలిగితే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
 
గుండెకు రక్తం అందించే రక్తనాళాల లోపల గోడలకు కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు దాని పనితీరులో తేడా ఏర్పడుతుంది. గుండె అసౌకర్యంగా ఉండి.. నొప్పి క్రమేపి ఎడమ చేతికి, కొన్ని సార్లు కుడి చేతికి, గొంతు, దవడలు, పొట్ట భాగాలకు విస్తరిస్తుంది. ఈ అసౌకర్యాన్ని సాధారణ నొప్పులుగా భావిస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే.
 
తరచూ వాంతులు అవడం లేదా వాంతులు అయ్యేలా ఉండి.. అకస్మాత్తుగా తీవ్ర స్థాయిలో తలపోటు రావడం వంటివి జరిగితే మీ గుండె బలహీనపడుతుందని గుర్తించండి.
 
ఉన్నట్టుండి ముఖం నీరసంగా కనిపించడం, కాళ్లు, చేతుల్లో, ముఖ్యంగా ఛాతీ పక్కభాగంలో నొప్పిగా అనిపిస్తుంది.
 
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. మానసికంగా కూడా ఒత్తిడి పెరిగినట్టు అనిపిస్తుంది. మెదడు మీ అధీనంలో ఉండకుండా.. మాటల్లో తికమకపడటం, విషయాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయం కలుగుతాయి.
 
తరచు కళ్లు తిరిగినట్టు అనిపించడం, దృష్టిలో ఆకస్మికంగా తేడాలు ఏర్పడటం, శరీరమంతా చెమటలు పట్టేయడం వంటి తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి.
 
ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. నడుస్తుండగానే తూలిపోతుంటారు. ఛాతీలో ఉబ్బరంగా అనిపిస్తుంది.
 
ఇవన్నీ గుండె నొప్పికి సంకేతాలే. ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు వెంటనే జాగ్రత్త పడండి. ఒంట్లో ఇలాంటి వాతావరణం కనిపించినపుడు రేపూ, మాపూ అనకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.