నవ్వు.. హార్ట్‌ని ఆరోగ్యంగా ఉంచు

ఒత్తిడి నుంచి బయటపడి, గుండెను ఆరోగ్యంగా ఉంచుకుని, బి.పి బారిన పడకుండా.... జీవితాన్ని హాయిగా గడిపేయాలనుకుంటున్నారా... అయితే నవ్వండి. అలా చెప్పగానే ఇలా నవ్వు పుట్టుకొస్తుందా అని పెదవి విరిచేయొద్దు. నవ్వు రాకపోయినా పర్వాలేదు నవ్వినట్టు ఫోజు పెట్టండి చాలు. మీరు నిజంగానే నవ్వారనుకుని మీ మెదడు హ్యాపీ కెమికల్స్‌ను విడుదలచేస్తుంది. అవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. 

  • నవ్వులు చిందిస్తున్న వాళ్లను చూస్తే చాలు శరీరం నుంచి డోపమైన్‌, ఎండార్ఫిన్‌, సెరటోనిన్‌లనే హ్యాపీ కెమికల్స్‌ విడుదలవుతాయి. ఇవే చాకొలెట్‌, కాఫీ, కొకైన్‌లలో కూడా ఉంటాయి. అందుకనే వాటిని తిన్నప్పుడు, తాగినప్పుడు ఉత్సాహంగా అనిపిస్తుంది. 
  • నవ్వినప్పుడు శరీరంనుండి న్యూరోపెప్టైడ్‌లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి కారకమైన కార్టిసోల్‌ హార్మోన్‌తో ఫైట్‌ చేస్తాయి. దాంతో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, శరీరానికి ఉపశమనం కలుగుతుంది, రక్తపీడనం తగ్గుతుంది. అలా మనలోని శారీరక వ్యవస్థను సరిచేస్తాయి ఇవి. 
  • ఎండార్ఫిన్లను సహజసిద్ధమైన నొప్పి నివారిణులని తెలుసా. అందుకని ఈ సారెప్పుడైనా శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి ఉంటే వెంటనే పెయిన్‌ కిల్లర్‌ వేసుకునే ఆలోచన చేయకుండా నవ్వి చూడండి. 
  • సెరటోనిన్‌ యాంటి- డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. జీవితాన్ని ఒత్తిడికి దూరంగా ఉంచే మందు మనదగ్గరే ఉన్నప్పుడు హాయిగా నవ్వక మందులు మింగటం ఎందుకు.
ఇన్ని లాభాలున్న నవ్వును... అది వచ్చినప్పుడే నవ్వుతామంటే కుదరదు. నవ్వు రాకపోయినా పెద్ద నవ్వును ముఖాన పులుముకోవాలి. అంతే వెంటనే మీరు నవ్వుతున్నట్టు కండరాల నుంచి మెదడుకి సంకేతాలు వెళ్తాయి. వెంటనే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అవి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. కాకపోతే రాని నవ్వును నవ్వే అలవాటు అయ్యేందుకు కాస్త సమయం పడుతుంది. కాని అలవాటయితే కనుక ఒత్తిడి మీ దరికి చేరదు.
 
మీ నవ్వుతో... వాళ్లకీ ఆరోగ్యం 
మనిషి మెదడు, శరీరం రెండూ సామాజిక సంబంధాలు ఏర్పరచుకునే నైపుణ్యం కలిగినవే. అందుకే మీరు నవ్వితే ఎదుటి వాళ్ల మీద ఆ ప్రభావం పడుతుంది. వాళ్లూ ఆరోగ్యంగా ఉంటారు. అదెలాగంటే... వంద బిలియన్ల చిన్న కణాలను అదుపు చేస్తుంది మెదడు. వీటినే న్యూరాన్స్‌ అంటారు. ఇవి మెదడు నుంచి శరీరానికి సంకేతాలను పంపిస్తాయి. వీటిలోనే మిర్రర్‌ న్యూరాన్స్‌ అనేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే మెదడు చూసేవాటికి ఇవి అద్దంలా పనిచేస్తాయన్నమాట. ఉదాహరణ చెప్పుకోవాలంటే సినిమా తెర మీద కనిపించే నటన. తెరమీద నటులు పలికించే హావభావాలు నటనే అని తెలిసినప్పటికీ ఆయా పాత్రల తాలూకు సంతోషాన్ని, దుఃఖాన్ని చూస్తున్న మీరు కూడా ఫీలవడం. ఇదే సూత్రం నవ్వుకు కూడా వర్తిస్తుంది. మరింకెందుకాలస్యం మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్లని కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు హాయిగా నవ్వండి.