ఇక మనిషికి 2 గుండెలు!

హృద్రోగులకు పొత్తికడుపులో మరొకటి

చెన్నైలో రెండు కుక్కలపై ప్రయోగం
మనుషులపై ప్రయోగాలకు ఎథిక్స్‌ కమిటీకి లేఖ
చెన్నై, డిసెంబరు 10: మనిషికి ఎన్ని గుండెలు? ఇదేం ప్రశ్న అని చిరాకు పడకండి! ఏ మనిషికైనా గుండె ఒక్కటే! కానీ, మన డాక్టర్లు చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తే మాత్రం ఈ ప్రశ్న వేయక తప్పదు! గుండెజబ్బుతో బాధపడేవారికి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయకుండానే శరీరంలో ఇంకో హృదయం పెట్టేస్తారట! అదే నిజమైతే మాత్రం అలా ఆపరేషన్‌ చేయించుకున్న వారికి రెండు గుండెలు అని చెప్పక తప్పదు! ఉన్న గుండెను తీయకుండా రెండో గుండెను శరీరంలో ఎక్కడ పెడతారనే డౌట్‌ రావొచ్చు. దీనికీ వైద్యులు ప్లేస్‌ ఫిక్స్‌ చేశారు. రెండో గుండెను మన పొత్తి కడుపులో పెట్టి...మొదటి గుండెకు దీనికి లింక్‌ చేస్తారు. వినడానికి తేలిగ్గా ఉన్నా...ఇది సాధ్యమేనా అనే అనుమానం మీకు అక్కర్లేదు. ఈ దిశగా చెన్నై వైద్యులు రెండు కుక్కలపై చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...చెన్నై ఫ్రాంటియర్‌ లైఫ్‌లైన్‌ ఆస్పత్రికి చెందిన డాక్టర్ల బృందం రెండు శునకాల పొత్తికడుపులో మరో రెండు కుక్కల నుంచి సేకరించిన గుండెలను అమర్చింది.
 
రెండో గుండె రక్తనాళాలను మొదటి గుండె రక్తనాళాలతో జత చేశారు. ఆపరేషన్‌ తర్వాత పరిశీలించగా..మొదటి గుండెకు అది సహాయకారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పనిచేసినట్లు పరీక్షల్లో గుర్తించామని డాక్టర్‌ మధు శంకర్‌ తెలిపారు. అయితే ఇక్కడో చిన్న విషాదం ఉంది. డోనార్‌ నుంచి సరిపడా రక్తం లభించకపోవడంవల్ల ఒక కుక్క ఆపరేషన్‌ అయిన రోజే చనిపోగా...రెండోది 48 గంటలపాటు చాలా చలాకీగా కనిపించిందట. హుషారుగా నడవడంతోపాటు ఎప్పటిగాలే ఆహారం తీసుకుందని ఆయన వివరించారు. ఆ రెండు శునకాల పోస్టుమార్టంలో హార్ట్‌ మజిల్స్‌ చనిపోయిన తర్వాత కూడా జీవించి ఉండటం ఆశ్చర్యపరిచిందన్నారు. దీనిపై మరిన్ని ప్రయోగాల కోసం క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన ఎథిక్స్‌ కమిటీని అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
 
రెండో గుండె ఎందుకు?
గుండె బలహీనంగా ఉన్న రోగులు చాలా మంది హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌కు అంగీకరించరు. ఇతర అవయవాలు దెబ్బతింటాయనో...ఇతరత్రా ఆరోగ్య ఇబ్బందులు వస్తాయనో భయపడతారు. ఇలాంటి వారికి ఒక మెకానికల్‌ పంప్‌ ఏర్పాటు చేసి రక్తం సరఫరా అయ్యేలా చూస్తారు. దీనికయ్యే ఖర్చు ఒక్కోసారి రూ.కోటి వరకూ ఉంటుందని ఫ్రాంటియర్‌ లైఫ్‌లైన్‌ ఆస్పత్రి చీఫ్‌ డాక్టర్‌ కేఎం చెరియన్‌ చెప్పారు. హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లో గుండెను కోసి, మొత్తం బయటకు తీసి..మరో గుండెను నిర్ణీత సమయంలో అమర్చాలి. ఇది చాలా రిస్క్‌తో కూడిన ఆపరేషన్‌. అందుకే వీక్‌గా ఉన్న గుండెకు సహయకారిగా పొత్తికడుపులో మరో గుండెను జత కలిపి రోగి కోలుకునే వరకూ చికిత్స అందిస్తే సరిపోతుందని, దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుందని డాక్టర్‌ మధు శంకర్‌ వివరిస్తున్నారు.
 
ఈ ఏడాది మొదట్లో కోయంబత్తూరు డాక్టర్లు ఒక రోగికి ఆపరేషన్‌ చేస్తూ గుండె సంధుల్లో మరో చిన్న గుండెను పెట్టి ఇలాంటి ప్రయోగమే చేశారని డాక్టర్‌ చెరియన్‌ తెలిపారు. కానీ, తాము ఎంచుకున్న పద్దతిలో అయితే గుండెను కోయకుండానే రోగి ప్రాణాలు కాపాడొచ్చని చెబుతున్నారు. కాగా, ఈ మధ్య కుక్కలపై జరిపిన ఆపరేషన్‌ వివరాలను, దృశ్యాలను ఇతర కార్డియాక్‌ నిపుణులకు, ట్రాన్స్‌ప్లాంట్‌ అథారిటీ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ తమిళనాడు (ట్రాన్స్‌టాన్‌) ప్రతినిధులకు చూపించారు. అయితే మనుషులపై ప్రయోగాలు జరిపితేనే ఇది ఎంత వరకూ సక్సెస్‌ అవుతుందో చెప్పగలమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకే దీనికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ట్రాన్స్‌టాన్‌ సభ్య కార్యదర్శి డాక్టర్‌ పి. బాలాజీ తెలిపారు.