గుండెకు పాల దన్ను

26-10-2017: పాలలోని కాల్షియం కండరాలకు ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుందన్న సంగతి తెలిసిందే! పాలు వీటినే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయనీ, గుండెపోటు ముప్పు నుంచి తప్పిస్తాయి అంటున్నారు లాస్‌ఏంజెల్‌ యూనివర్శిటీ పరిశోధకులు. శరీరంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉంటే గుండెపోటు(కార్డియక్‌ అరెస్ట్‌) వచ్చే ప్రమాదం పది శాతం వరకూ ఉంటుందని వీరు చెబుతున్నారు. గుండెనొప్పి వచ్చిన పేషెంట్లను మృత్యుబారి నుంచి కాపాడే అవకాశం ఉంటుంది కానీ గుండెపోటు వచ్చిన వారిలో ఆ అవకాశం ఉండదనీ, వీరిలో శరీరానికి రక్తసరఫరా నిలిచిపోయి ప్రాణం పోతుందని వీరు చెబుతున్నారు. సుమారు 800 మంది గుండెనొప్పి బాధితుల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరి రక్తంలో కాల్షియం స్థాయిని పరిశీలించారు. రక్తంలో కాల్షియం నిల్వలు తక్కువగా ఉన్న వారిలో రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న విషయాన్ని వీరు గమనించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా మందులు వాడడంతో పాటు కాల్షియం నిల్వలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడం కూడా ముఖ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో కాల్షియం నిల్వలకీ గుండెపోటుకి సంబంధం ఉన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేకపోతున్నారు. దీని మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాలని వారు చెబుతున్నారు.