ఆంధ్రజ్యోతి, 18/03/13: కొన్ని రకాల గుండెజబ్బులు పుట్టుకతోనే వస్తే కొన్ని వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఏర్పడతాయి. గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలతోపాటు వచ్చిన తరువాత చేసుకోవలసిన వైద్య పరీక్షలు, చికిత్సల గురించి తెలియచేస్తున్నారు సన్‌షైన్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్.
గుండె జబ్బులు రాకుండా నివారించుకోవడం, వచ్చిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు, గుండె జబ్బు నిర్ధారణ అయిన తరువాత చేయవలసిన శస్త్ర చికిత్సలు మొదలైన వాటిపై ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా వరకు ఒక అవగాహన ఉంది. దీనికి మన దేశంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం, వార్తాసాధనాల వల్ల ప్రచారం ఎక్కువగా జరగడం కారణం. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా 15 శాతం మేరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే దీనికి వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు మొదలైన వాటిలో వచ్చిన మార్పులు కారణం.
పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు
పుట్టుకతో వచ్చే గుండెజబ్బులకు కొన్ని బలమైన కారణాలు ఉంటాయి. పర్యావరణం, రసాయనాలు, మందులు, ఇన్ఫెక్షన్లు, కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయి. కానీ పెద్దయిన తరువాత వచ్చే వ్యాధులు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. గుండె నిర్మాణాన్ని అలా్ట్రసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎకో పరీక్ష ద్వారా కరొనరీ హార్ట్ డిసీజెస్‌ను గుర్తిస్తారు. ఛాతీ ఎక్స్‌రే కూడా అవసరమవుతుంది.
హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది?
గుండె కండరాలకు రక్తాన్ని ఇచ్చి పోషించే ధమనులు మూడు ఉంటాయి. కరొనరీ ధమనుల్లో రక్తం గడ్డ కట్టి రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించినపుడు వచ్చే పర్యవసానమే హార్ట్ ఎటాక్. హృదయం లోపల రక్తం ఉన్నప్పటికీ గుండెకు రక్త సరఫరా జరగదు. దీనినే యాంజైనా అంటారు. ఈ పరిస్థితిలో రోగికి ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం, క్రమంగా ఎడమ చేతిలోకి నొప్పి పాకడం జరుగుతాయి. కొన్నిసార్లు తల తిరగడం, చెమటలు పట్టడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సార్బిట్రేట్ అనే మాత్రను నోటి కింద పెట్టి కొంత వరకూ రోగిని రక్షించవచ్చు.
ప్రథమ చికిత్స అవసరం
గుండెపోటు వచ్చిన తరువాత 20 నిమిషాల్లో రోగిని ఆసుపత్రికి తరలించాలి. వెంటనే ఇసిజి తీస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. అవసరమైతే యాస్ర్పిన్ కూడా ఉపయోగపడుతుంది. రోగిని శ్రమ పెట్టకుండా ప్రథమ చికిత్స చేయాలి. ఆంబులెన్స్‌ను పిలవాలి.ఆసుపత్రికి వచ్చిన తరువాత తీసే ఇసిజి గుండెపోటును నిర్ధారిస్తుంది. ఇప్పుడు లక్ష్యం అడ్డుపడిన దానిని తొలగించడం లేదా దానిని కరిగించడం. లైటిక్స్ అనే మందు 50 నుంచి 60 శాతం మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తోంది. స్ర్టెస్ టెస్టులు, సి.టి, యాంజియో, రేడియో న్యూక్లైబుల్ ఇమేజింగ్, కార్డియాక్ ఎంఆర్ఐ వంటివి చేస్తారు. రోగికి ముందుగా ఒక యాంజియో గ్రామ్ చేస్తారు. ఇది నేడు మణికట్టు వద్ద చిన్న కోత విధించి వేస్తున్నారు. దీని ద్వారా ఎన్నిచోట్ల మూసుకుపోయిందో కచ్ఛితంగా చూడవచ్చు. యాంజియోప్లాస్టీ లేదా సర్జరీ లేకపోతే రోగిని అదే రోజు డిస్చార్జ్ చేయవచ్చు.
యాంజియోప్లాస్టీ
యాంజియోప్లాస్టీ అవసరమైతే 100 శాతం అడ్డుకున్న నాళానికి ఒక సన్నని వైరు ద్వారా ఒక మెటాలిక్ సెంట్న్ఉ అమర్చి అడ్డు తొలగిస్తారు. ఈ ప్రక్రియలో దాదాపు 100 శాతం ఫలితాలు ఉంటాయి. ఇది అందరిలోను చేయవచ్చు. మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ. అడ్డుకట్టే అనేది చాలా క్లిష్టంగా మారితే కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా తొలగిస్తారు. ఈ దశలో శస్త్ర చికిత్సలు అవసరం కావు. రోగి రెండు మూడు రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఒకటి నుంచి రెండు వారాల్లో తన పని తాను చేసుకోవచ్చు. అనుభవం కలిగిన కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ఇది జరగాలి. బెలూన్ డయలేషన్ 90 నిమిషాల్లో జరిగిపోవాలి. రోగి బంధువులు పర్యవేక్షకులతో మాట్లాడి తొందరగా నిర్ణయించుకోవాలి. కొంతమందికి పేస్‌మేకర్స్ వంటివి అవసరమవుతాయి.
బైపాస్ గ్రాఫ్టింగ్
మూసుకుపోయిన ధమనులు సరిచేయటానికి మరొక విధానం బైపాస్ గ్రాఫ్టింగ్ సర్జరీ. దీనిలో సిపిడి అవసరం ఉంటుంది. రెండు చోట్ల గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఛాతీ లోపలికి మార్గం ఏర్పరుస్తారు. ఇందులో కోతలు ఎక్కువగా ఉండేవి కాని నేడు తక్కువ కోతలతో హార్ట్ లంగ్ మిషన్ అవసరం లేకుండా కూడా కొంతమందిలో ఈ సర్జరీ నిర్వహిస్తున్నాము. గుండెకొట్టుకోవడం స్థిరీకరింపచేసి అవసరమైన పరిహృదయ ధమనులు గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇది 70, 80 సంవత్సరాలకు పైబడిన వారికి కూడా చేసి వారి జీవితకాలం పెంచవచ్చు. కేవలం 6 వారాలు జాగ్రత్తగా ఉండాలి. కొంతమందిలో రెండవసారి కూడా బైపాస్ సర్జరీ చేస్తారు. దీనిలో పూర్తిగా ఓపెన్ చేయకుండా సర్జరీ చేసి వ్యాధి ప్రబలత తగ్గిస్తారు. వ్యాధి వచ్చిన తరువాత కన్నా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యం. మంచి ఆహారం, నడక, వ్యాయామం, కొవ్వు పదార్థాల నియంత్రణ, తీవ్రమైన ఒత్తిడి తగ్గించుకోవడం, డయాబెటిస్ ఉంటే అదుపులో ఉంచుకోవడం, జీవనశైలి మార్చుకోవడం వంటివి ఎంతో ఉపయోగపడతాయి.
డాక్టర్ శరత్
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్,
సన్‌షైన్ హాస్పిటల్స్, ప్యారడైజ్ సమీపాన
పి.జి.రోడ్, సికింద్రాబాద్
ఫోన్: 9000110008లిణ