గుండెపోటును మొదటే గుర్తించాలి

ఆంధ్రజ్యోతి, 16/01/14: సాధారణంగా ఒక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటే గానీ, మనం గుండెపోటు వచ్చినట్లు గుర్తించం. నిజానికి గుండెపోటు ఒక నిమిషంలో ముగిసిపోయే సంఘటన కాదు. అది స్వల్పంగా మొదలై ఒక్కోసారి కొన్ని గంటలపాటు కొనసాగుతుంది. గుండెకు వెళ్లే రక్తప్రసారంలో ఆటంకం తలెత్తినప్పటి నుంచే గుండెపోటు మొదలైనట్లు గుర్తించాలి. ఈ స్థితిలో క్రమంగా ఆయాసం మొదలవుతుంది. చెమటలు పడతాయి. రక్తపోటు పడిపోతుంది. చివరగా స్పృహ కోల్పోతారు. శ్వాస ఆడ క మెలికలు తిరిగిపోయే దాకా చూడకుండా ముందే ప్రధమ చికిత్సకు సిద్ధం చేస్తే ప్రాణాపాయాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. అందుకు గుండెపోటుకు సంబంధించిన లక్షణాల గురించి అవగాహ న చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. ఆ లక్షణాలను తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందామా మరి..... ! 

గంట క్రితమే నాతో మాట్లాడి వెళ్లాడు. ఈ కాసేపట్లోనే ఇంత ఘోరం జరిగిపోయిందేమిటి ? అంటూ తెలిసిన వాళ్లంతా గుండెలు బాదుకుంటారు. నిజానికి గంట క్రితం అతడు పైకి బాగానే కనిపించి ఉండవచ్చు. కానీ, లోలోపల కచ్చితంగా అతనికేదో అసౌకర్యం ఉండే ఉంటుంది. కాకపోతే, దాని గురించి అతడు ఎవరికీ చెప్పి ఉండకపోవచ్చు అంతే...! అదేదో అతి సాధారణ లక్షణంగానే చాలా మంది భావిస్తారు. ఆ కాస్త నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలికొంటుంది. ఈ నిర్లక్ష్యంలో చాలా వరకు గుండెపోటు లక్షణాల గురించిన అవగాహన లేనితనమే మూలంగా ఉంటుంది. ఛాతీ నొప్పి, ఛాతీ మంటలన్నీ గుండెపోటుకు సంబంధించినవే కాకపోవచ్చు. అంత మాత్రాన ఒకసారైనా ఇసిజి పరీక్ష చేయించకుండా ఉండిపోవడం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే. గుండెపోటు చాలా వరకు ఇతర వ్యాధుల్లో ఉండే కొన్ని సాధారణ లక్షణాలే కనిపిస్తాయి. అయితే ఛాతీనొప్పి పెరగడానికీ, తగ్గడానికీ కారణమయ్యే చర్యల ఆధారంగా కూడా అది గుండెపోటు అవునో కాదో ముందే తెలుసుకోవచ్చు. పరిస్థితి విషమించకుండా అతన్ని కాపాడుకోవచ్చు.

సాధారణ లక్షణాలు 
గుండెపోటుకు కొద్దిరోజుల ముందే చాలా మందిలో ఛాతీనొప్పి, శ్వాస ఆడకపోవడం, కాళ్లవాపు, గుండెదడ, కళ్లుతిరిగి పడిపోవడం, త్వరగా అలసిపోవడం, పట్టేసినట్టు గుండె బరువుగా ఉండడం, ఏదో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అరుదుగా కొందరికి తలనొప్పి, దగ్గుతో పాటు ఒక్కోసారి నోటి నుంచి రక్తం కూడా రావచ్చు. కాకపోతే ఈ లక్షణాలు గుండెపోటులోనే కాకుండా మరికొన్ని ఇతర సమస్యల్లో కూడా కనిపిస్తాయి. ఛాతీ నొప్పినే ఉదాహరణగా తీసుకుంటే ఛాతీ ఎముకలు, ఛాతీ కండరాలు, శ్వాసకోశాలు,చర్మసమస్యల వల్ల కడా ఛాతీ నొప్పి రావచ్చు. అందుకే ఛాతీ నొప్పులన్నీ గుండెనొప్పులేనని నిర్థారించలేం. అయితే ఈ సాధార ణ లక్షణాలకు కొన్ని ఇతర లక్షణాలు కూడా తోడైనప్పుడు గుండెనొప్పిని గుర్తించడం సులువవుతుంది. 
ఛాతీ నొప్పితో పాటు చాలా అసౌకర్యంగా ఉండడాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. నిజానికి ఇది చాలా తీవ్రంగా పరిగణించవలసిన పరిస్థితి. గుండెపోటు తొలిదశలో చాలా మందికి ఛాతీలో మంట రావచ్చు. అలాతే తేన్పులు, వాంతులు కూదా రావచ్చు. ఈ స్థితిని చాలా మంది ఆమ్లతగా (ఆసిడిటి) పొరబడుతుంటారు. అందుకే అసలు సమస్యను గుర్తించడానికి ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. ఈ ఆలస్యంలో ఒక్కోసారి పరిస్థితి చేయిదాటిపోవచ్చు కూడా.
 
మరికొన్ని... 
  • గుండె బరుగా ఉంటూ చెమటలు,ఛాతీ మంట, అసౌకర్యం 
  • నడవడం లేదా ఏదైనా చేస్తున్నాప్పుడు ఛాతీ నొప్పి అధికమవడం, ఆగిపోగానే నొప్పి తీవ్రత తగ్గడం. లేదా నొప్పి మొత్తంగానే తగ్గడం 
  • ఛాతీలో మొదలైన నొపి, రెండు చేతులకూ, దవడలకూ లేదా వెన్ను భాగానికి పాకడం 
  • ఏదైనా బరువు మోస్తూ కొంత దూరం నడవగానే నొప్పి మొదలై, బరువు దించగానే నొప్పి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే గుండె నొప్పిగా అనుమానించవచ్చు. 
  • ఒకవేళ పనిచేస్తున్నప్పుడు ఒక మోస్తరుగా ఉంటూ పని మానగానే నొప్పి అధికమైతే అది గుండె నొప్పి కాదని గ్రహించాలి. ఇలే ఏం చేస్తే నొప్పి పెరుగుతోంది. ఏం చేస్తే నొప్పి తగ్గుతోంది అనే అంశాల ఆఽధారంగా కూడా అది గుండెనొప్పి అవునో కాదో నిర్ధారించడం వీలవుతుంది.
ఆలస్యం ప్రాణాంతకం 
ఛాతీ నొప్పి ఉండే వ్యవధిని బట్టి కూదా గుండెనొప్పికీ గుండెపోటుకూ ఉన్న తేడాను అంచనావే యవచ్చు. సాధారణంగా ఛాతీ నొప్పి మొదలైన మూడు నిముషాల్లోనే దానికదే త గ్గిపోతే అది గుండ నొప్పి అనీ, 10 నిముషాలకు మించి ఉంటే దాన్ని గుండెపోటుగానూ గ్రహించాలి. ఒకసారి గుండెపోటు అన్న అనుమానం కలిగితే తక్షణమే ఆసుపత్రికి తరళించాలి. 
20 ఏళ్ల లోపు వారిలో ఛాతీ నొప్పి వస్తే, చాలా వరకు అది గుండెనొప్పి కాకపోవచ్చు అదే 60 ఏళ్లకు అటుఇటుగా ఉన్న వారికి ఛాతీ నొప్పి వస్తే అది గుండె నొప్పి అయ్యే అవకాశమే ఎక్కువ.
 
ప్రమాద సూచికలు
వృద్ధాప్యం, మధుమేహం, అధిక ర క్తపోటు అధిక కొలెస్టాల్‌, పొగతాగడం వంటివి గుండె జబ్బులకు గురిచేసే అవకాశం ఎక్కువ. అలాగే వారసత్వంగా గుండె జబ్బులు ఉండడం, అంతకు ముందే గుండె జబ్బుకు లోనయి ఉండడం, గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశమిస్తాయి. ఇలాంటి వారికి ఛాతీనొప్పి వస్తే తక్షణమే ఆసుపత్రికి చేర్చాలి. అంతకు ముందే గుండె జబ్బులకు లోనైన వారు డిస్పిరిన్‌, సార్బిట్రేట్‌ మాత్రలను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం ఎంతో శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు.