యోగాతో గుండె జబ్బులు దూరం

క్రమం తప్పని వ్యాయామంతో గుండె జబ్బులను దూరంగా ఉంచ వచ్చని వైద్యులు సూచించడం తెలిసిందే! అయితే అదే ఫలితాన్ని యోగాతోనూ పొందవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నడక, సైక్లింగ్‌ సహా ఇతర వ్యాయామాలతో లభించే ఫలితాలను యోగాభ్యాసాలతోనూ అందుకోవచ్చని నెదర్లాండ్‌ పరిశోధకులు చెబుతున్నారు. ఈమేరకు సుమారు మూడు వేల మంది వలంటీర్లపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని అన్నారు. ఎలాంటి వ్యాయామం చేయని, యోగా జోలికే వెళ్లని వారితో పోలిస్తే యోగా ప్రాక్టీస్‌ చేస్తున్న వారిలో చెడు కొలెస్ట్రాల్ , బీఎంఐ, సిస్టోలిక్‌ బ్లడ్‌ ప్రెజర్‌ తగ్గడంతోపాటు అధిక బరువునూ వదిలించుకోవచ్చని చెప్పారు. దాంతోపాటు గుండె కొట్టుకునే వేగాన్ని (పల్స్‌రేట్‌ను) క్రమబద్ధీకరించుకోవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు వివరించారు.