గుండెపోటు పనిపడదాం

ఆంధ్రజ్యోతి, 11-08-2013: ఒకప్పుడు ఆరు పదులు దాటిన వారిలో మాత్రమే గుండె జబ్బులు కనిపించేవి. కానీ ఇప్పుడు మూడు పదుల వయసులోనే గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. కుటుంబంలో ఎవరైనా గుండె జబ్బుల బారినపడినట్లయితే వారి పిల్లల్లో మరింత రిస్క్‌ ఎక్కువ. అయితే గుండెపోటుకు కారణమవుతున్న అంశాలను నియంత్రించుకోవడం ద్వారా గుండె జబ్బులు బారినపడకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎ. గురుప్రకాశ్‌. 


ఈ రోజుల్లో ప్రతిదీ విషంగా మారుతోంది. గాలి, నీరు, ఆహారం...ఇలా అన్నీ కాలుష్యమవుతున్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చిపడుతున్నాయి. దీనికితోడు మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు, మారిన జీవన విధానం వంటి కారణాల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు అవుతోంది. పొగతాగే అలవాటు ఉండటం, అధిక రక్తపోటు, డయాబెటిస్‌ వంటి సమస్యలు ఉన్నట్లయితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ.
 
హార్ట్‌ ఎటాక్‌ ఎందుకు వస్తుంది? 
రక్తంలో చెడు కొలెసా్ట్రల్‌, మంచి కొలెసా్ట్రల్‌ ఉంటాయి. చెడు కొలెసా్ట్రల్‌ పెరిగిపోయినప్పుడు రక్తనాళాల్లోని గోడల్లో పేరుకుపోతుంది. ఫలితంగా గుండెకు రక్త సరఫరా జరగక హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. అయితే మంచి కొలెసా్ట్రల్‌ ఎక్కువగా ఉన్నప్పుడు చెడు కొలెసా్ట్రల్‌ రక్తనాళాల్లో పేరుకు పోకుండా చూస్తుంది. ఒకవేళ మంచి కొలెసా్ట్రల్‌ తగ్గి చెడు కొలెసా్ట్రల్‌ పెరిగిపోయినప్పుడు బ్లాక్స్‌ ఏర్పడి హార్ట్‌ ఎటాక్‌కు కారణమవుతుంది. అయితే చెడు కొలెసా్ట్రల్‌ ఎంత ఉంది? మంచి కొలెసా్ట్రల్‌ ఎంత ఉంది? ట్రైగ్లిజరైడ్స్‌ ఏ స్థాయిలో ఉన్నాయి? గుండె పనితీరు ఎలా ఉంది? కండరాలు ఎలా ఉన్నాయి తదితర విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు ఆధునిక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
 
ఇసిజి 
గుండెలో లో వోల్టేజి కరెంటు ప్రవహిస్తుంటుంది. దీని మూలంగా హార్ట్‌ పంపింగ్‌ జరుగుతూ ఉంటుంది.ఈ పంపింగ్‌లో ఏమైనా తేడా ఉంటే ఇసిజిలో తెలిసిపోతంది. గుండె పనితీరు తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన పరీక్ష ఇది.
 
ఎంజైమ్స్‌ టెస్ట్‌ 
ట్రాపనిన్‌ ఐ, ట్రాపనిన్‌ టి అనే ఎంజైమ్‌ పరీక్షలు గుండె పోటును గుర్తిస్తాయి. ఇసిజిలో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఈ ఎంజైమ్స్‌ టెస్ట్‌ చేయడం ద్వారా హార్ట్‌ఎటాక్‌ తాలూకు చిహ్నాలను గమనించవచ్చు.
 
2డి ఎకో 
గుండె నిర్మాణం ఎలా ఉంది? గుండె గదుల మధ్య ఉన్న కవాటాలు ఎలా ఉన్నాయి? హార్ట్‌ పంపింగ్‌ ఎలా ఉందనే విషయం ఈ పరీక్షలో తెలుస్తుంది.

ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ (టిఎమ్‌టి) 
గుండె జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ట్రెడ్‌మిల్‌పై నడిపిస్తూ గుండె పనితీరు ఎలా ఉందో పరీక్షించడం జరుగుతుంది. దీన్ని సె్ట్రస్‌ టెస్ట్‌ అని కూడా అంటారు. ఈ పరీక్షలో పాజిటివ్‌గా ఫలితం వస్తే గుండె జబ్బు ఉన్నట్లుగా నిర్ధారించుకోవచ్చు. అయితే 70 శాతం పైగా ఉన్న బ్లాక్‌లు మాత్రమే గుర్తించడం జరుగుతుంది. అంతకన్నా తక్కువ శాతం ఉన్న బ్లాక్‌లను గుర్తించడం ఈ పరీక్షతో సాధ్యం కాదు.
 
యాంజియోగ్రామ్‌ 
హార్ట్‌ఎటాక్‌తో అత్యవసర విభాగానికి వచ్చినప్పుడు ముందుగా చేసే పరీక్ష ఇది. గుండె రక్తనాళాలలో ఉన్న అడ్డంకులను గుర్తించడానికి ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఇసిజిలో తేడా ఉన్నప్పుడు ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేసుకోవచ్చు.

సి.టి కరోనరీ యాంజియో 
గుండె రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడే అవకాశాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే పరీక్ష ఇది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన పరీక్ష ఇది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే చేయించుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.
 
ఏం చేయాలి? 
ప్రతి ఒక్కరూ ఏడాదికొకసారి కొలెస్ర్టాల్‌ పరీక్షలు చేయించుకోవాలి. కొలెసా్ట్రల్‌ శాతం ఎక్కువగా ఉంటే ఈసీజీ, టీఎమ్‌టీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా గుండె జబ్బులు వస్తున్నట్లయితే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు వైద్యుల సలహా మేరకు సిటీ కరోనరీ యాంజియో చేయించుకోవచ్చు.
 
గుండె పోటు రాకుండా కాపాడుకోవడం ఎలా? 
కొవ్వు తక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. వెన్న, నెయ్యి, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యామామం చేయాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆధిక బరువు తగ్గించుకోవాలి. డయాబెటిస్‌, అధిక రక్తపోటు ఉన్నట్లయితే నియంత్రణలో ఉంచుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే మానుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. 

డాక్టర్‌ ఎ. గురుప్రకాశ్‌ 
సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ 
యశోద హాస్పిటల్స్‌ 
సోమాజిగూడ, హైదరాబాద్‌ 
ఫోన్‌ : 99894 66089