వీటితో హృదయం పదిలం

ఆంధ్రజ్యోతి, 10-06-2015: శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో గుండె ప్రధానమైంది. అలాంటి గుండె సరిగా పని చేయలేకపోతున్నప్పుడు బలహీనత, ఆకలి మందగించటం, శరీరమంతా వాపు, ఊపిరి తీసుకోలేకపోవడం, గాలిని పీల్చుకోవడం వదలడం, నాడి తీవ్రంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా గుండె భాగాల పనితీరు లోపించినపుడు ప్రత్యేకించి ఛాతి మధ్య భాగంలో నొప్పి కలుగుతుంది. సహజంగా ఆరోగ్యవంతుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ధమనుల ద్వారా రక్తాన్ని శరీర భాగాలకు పంపించి సిరలద్వారా తిరిగి గుండెకు రక్తాన్ని చేర్చుతుంది. రక్తప్రసరణ ఒకసారి పూర్తి కావడానికి 15 సెకన్లు పడుతుంది.
 
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో ఏర్పడిన అవరోధం వల్ల గుండెనొప్పి కలుగుతుంది. ఇది ఛాతిలో తీవ్రమైన నొప్పితో మొదలవుతుంది. చెమటలు పట్టి చల్లబడటం, గొంతు ఆరిపోవడం, ప్రాణం పోయేంత భయం కలుగుతుంది. దీన్నే ఆఽధునిక వైద్యంలో ‘‘అంజైనా పెక్టొరిస్‌’’ అంటారు. గుండె వ్యాధుల్లో ఇది మొదటి రకం. రెండవది గుండెపోటు. దీనిలో గుండె పనిచేయడం పూర్తిగా విఫలమవుతుంది. ఒక్కొక్కసారి ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది. గుండెదడ, రక్తనాళాలు సన్నబడటం వల్ల వచ్చే నొప్పి మొదలైనవి గుండెకు సంబంధించిన ఇతర వ్యాధులుగా చెప్పుకోవచ్చు. త్రిదోషాలైన వాత, పిత్త, కఫ దోషాలు ప్రకోపించినపుడు రస ధాతువు సమతుల్యతను కోల్పోయి గుండె అనేకరకాల వ్యాధులకులోనవుతుంది. ఇలా గుండె వ్యాధులకు గురి కాకుండా ఉండాలంటే ఈ క్రింది మూలికా చికిత్సలు ఎంతో ఉపయోగపడతాయి.
 
  • 5 గ్రాముల మద్ది చెక్క నీటితో మెత్తగా నూరి, 5గ్రాముల చక్కెర కలిపిన కప్పు పాలలో కలిపి కాచి తాగితే అన్ని రకాల గుండె జబ్బులు తగ్గుతాయి. 
  • 2గ్రాముల చిన్న యాలకుల చూర్ణం, 2 గ్రాములు పిప్పలిమోడి చూర్ణం కలిపి, మెత్తగా నూరి నెయ్యితో కలిపి రోజు ఉదయాన్నే తింటుంటే గుండె జబ్బులు త్వరగా తగ్గుతాయి. 
  • తిప్ప తీగె 5 గ్రాములు, మిరియాలు 5 గ్రాములు కలిపి మెత్తగా నూరి గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే తాగుతుంటే వాత ప్రకోపాల వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. 
  • తియ్య దానిమ్మ పళ్ల రసానికి సమంగా చక్కెర కలిపి, తేనెపాకం వచ్చేవరకు కాచి తాగుతుంటే గుండె జబ్బులు తగ్గుతాయి. 
  • మాదిఫల రసంలో యవక్షారం తేనె కలిపి వాడుతుంటే గుండె నొప్పి తగ్గుతుంది. 
  • ఉసిరికాయలను ఆవు నెయ్యిలో దోరగా వేయించి తేనెలో ఊరబెట్టి రోజు ఉదయాన్నే ఒక ఉసిరికాయ తింటుంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. 
  • ఎండు ద్రాక్ష పండులో పొంగించిన ఇంగువ గురిగింజంత పెట్టి మింగితే గుండె నొప్పి త్వరగా తగ్గుతుంది. 
  • పిప్పళ్లు 2 గ్రాములు, అతి మధురం 2 గ్రాములు మెత్తగా నూరి వేడిపాలల్లో కలిపి తాగుతుంటే గుండెజబ్బులు తగ్గుతాయి, 
  • అరకప్పు కాకరాకు రసంలో అరకప్పు నిమ్మరసం గాని, ఉసిరికాయల రసం గాని కలిపి రోజూ ఉదయాన్నే తాగుతుంటే గుండెజబ్బులు తగ్గుతాయి. 
  • తమలపాకుల రసం 1 టీ స్పూన్‌, అల్లం రసం 1 టీస్పూన్‌, వెల్లుల్లి రసం 1 టీ స్పూన్‌, తేనె 1 టీ స్పూన్‌ కలిపి రోజూ ఉదయాన్నే తాగుతుంటే గుండెపోటు రానివ్వదు. 

డాక్టర్‌ కందమూరి 
ఆయుర్విజ్ఞాన కేంద్రం