ముఖాన్ని చూస్తే గుండె గుట్టు తెలుస్తుంది

ఆంధ్రజ్యోతి, 03/09/14: మీ ముఖాన్ని చూసి మీ గుండె స్థితిని చెప్పవచ్చు. అదెలా సాధ్యమనుకుంటున్నారా? సాధ్యమేనని రోచెస్టర్‌ యూనివర్శిటీ పరిశోధకులు నిరూపించారు. అసాధారణ గుండెలయలు మన రక్త నాళాల్లోని రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. అప్పుడు మన చర్మం రంగులో కంటికి కనిపించని ఎన్నో మార్పులు సంభవిస్తుంటాయి. ఆ మార్పులను కెమెరా సెన్సర్లు గ్రహించి.. మన గుండె స్థితిని చెప్పేస్తాయి. దీనిపై అధ్యయనం చేసే సమయంలో మనకి ఎలక్ర్టోకార్డియోగ్రామ్‌ను తగిలిస్తారు. అధ్యయనం తర్వాత మన ముఖంలో వచ్చిన మార్పులను సాధారణ సమయాల్లో మన గుండె ఉండే స్థితితో పోలుస్తారు. ఈ డిజిటల్‌ కెమెరాలోని సెన్సర్లను ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను నమోదు చేసే విధంగా రూపొందించారు. కాంటాక్ట్‌లెస్‌ వీడియో మానిటరింగ్‌ను ఉపయోగించి గుండెకు సంబంధించిన వ్యాధులను నిర్ధారించవచ్చునని రోచెస్టర్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జీన్‌ ఫిలిప్‌ తెలిపారు. ఈ టెక్నాలజీలోని సాఫ్టవేర్‌ ఆల్‌గారిధమ్‌ను జిరాక్స్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది.