క్షీణించిన గుండెకు రక్ష పేస్‌మేకర్‌

ఆంధ్రజ్యోతి, 20-01-2013:  శరీరంలో కొన్ని అవయవాలు బలహీనపడినా నెట్టుకురావచ్చు. కానీ గుండె వీక్‌ అయితే దాని ప్రభావం ప్రతీ అవయవంపై పడుతుంది. మెల్లమెల్లగా మరణం చేరువవుతుంది. అయితే వీక్‌ అయిన గుండెకు కవచంలా పేస్‌మేకర్‌ ఉపయోగపడుతుందని, జీవితకాలం పెరుగుతుందని అంటున్నారు సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ అండ్‌ ఎలక్ర్టోఫిజియాలజిస్ట్‌ డా. రాజశేఖర్‌. 

శరీరంలో ప్రతీ అవయవం పనిచేయాలంటే వాటి అవసరాలకు అనుగుణంగా గుండె రక్తం సరఫరా చేస్తుండాలి. అయితే కొన్ని కారణాల వల్ల గుండె రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. గుండె కండరం వీక్‌ అయినపుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితిని హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటారు. దీనికి అనేక కారణాలుంటాయి. గుండెలోకి 100 మి.లీల రక్తం లోపలికి వెళితే కనీసం 60 మి.లీల రక్తం బయటకు పంప్‌ చేయబడాలి. 35 మి.లీల కన్నా తక్కువ రక్తం పంప్‌ అవుతున్నప్పుడు హార్ట్‌ ఫెయిల్యూర్‌గా భావించాలి. ఈ స్థితిలో రక్తం గుండెలోనే నిలిచిపోతుంటుంది. ఫలితంగా గుండె ఎన్‌లార్జ్‌ అవుతుంది.
 
కారణాలు 
గుండెకు వచ్చే అన్ని జబ్బులు హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. అంటే రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడటం, కవాటాలు దెబ్బతినడం, హార్ట్‌ బీటింగ్‌లో మార్పులు వంటి జబ్బులన్నీ హార్ట్‌ ఫెయిల్యూర్‌కు కారణమవుతాయి. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల వల్ల కూడా హార్ట్‌ ఫెయిల్యూర్‌ కావచ్చు. గుండె పోటు కారణం కావచ్చు. గుండెకు మూడు రక్తనాళాల ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. ఈ నాళాలలో ఏదైనా రక్తనాళంలో బ్లాక్‌ ఏర్పడినపుడు రక్తసరఫరా నిలిచి గుండెలో ఆ భాగం చచ్చుబడిపోయి, కండరాలు క్షీణిస్తాయి. ఫలితంగా పంప్‌ చేసే శక్తి తగ్గిపోతుంది.
 
లక్షణాలు 
నీరసం, ఎక్కువగా పనిచేయలేకపోవడం, కొద్ది దూరం నడిచినా ఆయాసం రావడం, కాళ్లలో, పొట్టలో నీరు చే రడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెలో రక్తం నిలిచిపోవడం వల్ల బ్యాక్‌ప్రెషర్‌ పెరిగి నీరు చేరిపోతుంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఈసీజీ. 2డి ఎకో పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె పనితీరును తెలుసుకోవచ్చు. రక్తనాళాల్లో బ్లాక్స్‌ తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్‌ ఉపయోగపడుతుంది.
 
మందులతో చికిత్స 
హార్ట్‌ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న వారికి ముందుగా లక్షణాలను తగ్గించే మందులు ఇవ్వాలి. శరీరంలో చేరిపోతున్న నీరును యూరిన్‌ ద్వారా బయటకు పంపించడానికి డైయూరిటిక్స్‌ ఇవ్వాలి. అదే సమయంలో హార్ట్‌ పంపింగ్‌ను పెంచే మందులు, హార్ట్‌పైన ఒత్తిడిని తగ్గించే మందులు ఇవ్వాలి. రక్తసరఫరాలో ఏదైనా లోపం ఉన్నట్లయితే యాంజియోప్లాస్టి, బైపాస్‌ సర్జరీ వంటివి చేసి రక్తసరఫరా పెరిగేలా చేయాలి. వాల్వ్‌ లీకేజ్‌ ఉన్నట్లయితే వాల్వ్‌ రీప్లేస్‌ చేయాలి. కొందరిలో ఏ కారణం లేకుండానే గుండె కండరం దెబ్బతింటుంది. దీనిని ఇడియోపతిక్‌ కార్డియోమయోపతి అంటారు. రక్తసరఫరా సాఫీగా జరిగేలా చేసినా హార్ట్‌ పంపింగ్‌ పెరగదు. ఈ సమయంలో మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గవు. జీవితకాలం కూడా బాగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో పేస్‌మేకర్‌ ఒక్కటే జీవితకాలాన్ని పెంచగలుగుతుంది.
 
పేస్‌మేకర్‌ 
గుండె కొట్టుకునే వేగం నెమ్మదించినపుడు దాన్ని పెంచే ఎలకా్ట్రనిక్‌ పరికరమే పేస్‌మేకర్‌. గుండె సాధారణంగా 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. కొందరిలో ఇది 30 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అటువంటి వారికి పేస్‌మేకర్‌ అమర్చితే గుండె సాధారణ స్థితిలో కొట్టుకుంటుంది. ఇదేవిధంగా హార్ట్‌ ఫెయిల్యూర్‌ అయిన వారికి కూడా పేస్‌మేకర్‌ ఉపయోగపడుతుంది. అయితే ఈ పేస్‌మేకర్‌ ప్రత్యేకమైనది. దీన్ని కార్టియాక్‌ రీసింక్ర నైజేషన్‌ థెరపీ అంటారు. అంటే హార్ట్‌ ఫెయిల్యూర్‌ నుంచి హార్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ అయిన వారికి కుడి ఎడమ గదుల బీటింగ్‌లో తేడా వస్తుంది. గదులు కొట్టుకోవడంలో యూనిటీ, కోఆర్డినేషన్‌ లోపిస్తుంది. దీనివల్ల గండె పనితీరు మరింత దిగజారే అవకాశం ఉంటుంది. దీన్ని సరిదిద్దడానికి ఉపయోగించే పేస్‌మేకర్‌నే కార్డియాక్‌ రీసింక్రనైజేషన్‌ థెరపీ అంటారు. ఇందులో గుండెలోని కుడి భాగానికి, ఎడమ భాగానికి వైౖర్లను వేసి పేస్‌మేకర్‌కు కలుపుతారు. దీనివల్ల గుండె సాధారణ స్థితిలో ఒకేతీరున కొట్టుకుంటుంది. అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే ఈ చికిత్సను అందించగలుగుతారు. ఒక్కోసారి హార్ట్‌ ఎన్‌లార్జ్‌ అయినప్పుడు హార్ట్‌ బీటింగ్‌లో తేడా వచ్చి ఎరాటిక్‌ హార్ట్‌ బీటింగ్‌ వచ్చి కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రిస్క్‌ను నివారించడానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉపయోగపడుతుంది. దీన్ని ఏఐసిడి (ఆటోమేటిక్‌ ఇంప్లాంటబుల్‌ కార్డియోవర్టర్‌ డీఫిబ్రిలేటర్‌) అంటారు. ఇది కూడా పేస్‌మేకర్‌లాంటిది. ఇది హార్ట్‌బీటింగ్‌ ఎరాటిక్‌ అయినపుడు గమనించి గుండెకు చిన్న కరెంట్‌ షాక్‌ను ఇవ్వడం ద్వారా బీటింగ్‌ను సరిచేస్తుంది. పేస్‌మేకర్‌ను చిన్న శస్త్రచికిత్స ద్వారా అమర్చడం జరుగుతుంది. కాలర్‌బోన్‌ కింద చర్మం లోపల అమర్చుతారు. ఇందులో బ్యాటరీ 9 ఏళ్ల వరకు పనిచేస్తుంది. బ్యాటరీ తగ్గిందనకున్నప్పుడు చిన్న సర్జరీతో బ్యాటరీ మార్చుకోవచ్చు.
 
గుండె మార్పిడి 
పేస్‌మేకర్‌ వల్ల కూడా ఫలితం లేని వారికి గుండె మార్పిడి చేయడం ఒక్కటే మార్గం. బ్రెయిన్‌డెత్‌ అయిన వ్యక్తుల నుంచి గుండెను సేకరించి శస్త్రచికిత్స ద్వారా వీరికి అమర్చాల్సి ఉంటుంది. అయితే గుండెను దానం చేసే వారు దొరకడం చాలా అరుదు. దొరికే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అలాంటప్పుడు రోగికి ఆర్టిఫిషియల్‌ పంప్‌ను అమర్చడం జరుగుతుంది. దీన్ని అసిస్ట్‌ డివైస్‌ అంటారు. దీంతో రోగి కొన్ని నెలల వరకు ఇబ్బంది లేకుండా గడపవచ్చు. ఏమైనా హర్ట్‌ ఫెయిల్యూర్‌ అయిన వారి జీవిత కాలం పొడిగించడానికి పేస్‌మేకర్‌ ఒక వరంగా చెప్పవచ్చు. 

డా. రాజశేఖర్‌ .వి. 
సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ అండ్‌ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్‌ 
యశోద హాస్పిటల్‌ 
సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ 
ఫోన్‌ : 98480 25483