పగిలిన గుండెకు కృత్రిమ కండరం!

వాషింగ్టన్‌, నవంబరు 29: ఒకప్పుడు గుండెపోటు అంటే మన ‘కథ’ ముగిసినట్టే.. కానీ ప్రస్తుత అత్యాధునిక యుగంలో మెరుగైన చికిత్సా విధానాల ద్వారా గుండెపోటు విపత్తు నుంచి కూడా బయటపడగలుగుతున్నాం. తాజాగా అమెరికాలో డ్యూక్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఓ కృత్రిమ కండరాన్ని తయారు చేశారు. సాధారణంగా గుండె కండరం దెబ్బతినడం వల్ల ఎక్కువ మందికి గుండెపోటు వస్తుంది. ఈ కండరంలో నిర్జీవ కణజాలం తిరిగి రూపొందడానికి నెలల సమయం పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో గుండెకు ప్యాచ్‌లాగా అమర్చేందుకు ఓ కృత్రిమ కండరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. సాధారణ కండరం మాదిరిగానే ఈ కృత్రిమ కండరం పనిచేస్తుందని పరిశోధకులు చెప్పారు.