ఇలా చేస్తే... గుండె పదిలం..!

ఆంధ్రజ్యోతి, 02-10-2018: గుండెను ప్రాణస్థానంగా చెప్పుకునే మనిషి, ఆ గుండె కోసం చేస్తున్నదేమిటి? కాపాడుకోవడం కన్నా ఎక్కువమంది అది చె డిపోయే దిశగానే అడుగులు వేస్తున్నారు. ఫలితంగా...ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. అయితే, వీరిలో 80 శాతం మంది అభివృద్ది చెందుతున్న దేశాలకు చెందిన వారే కావడం గమనార్హం. 2030 నాటికి ప్రాణాపాయ వ్యాధుల్లో ప్రథమ స్థానాన్ని గుండెజబ్బులే ఆక్రమిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2016 నాటికే భారతదేశంలోనే హృద్రోగాల బారిన పడిన వారి సంఖ్య 5 కోట్ల 50 లక్షలకు చేరుకుంది. ఇందుకు నివారణగా ఓ 10 నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు.....
 
అనునిత్య వ్యాయామం
సహజంగా నెలరోజుల పాటు వ్యాయామ చేయడం ద్వారా ఏర్పడిన శారీరక దృఢత్వాన్ని, ఓ వారం రోజుల పాటు వాటికి దూరంగా ఉండడం ద్వారా కోల్పోతాం. అందుకే వ్యాయామాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. అందులో భాగంగా రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాలు విప్పారి గుండె సుఖంగా పనిచేయగులుగుతుంది. ఆఫీసులో లిఫ్ట్‌లో వెళ్లే అవకాశం ఉన్నా, మెట్ల మీదుగా వెళ్లడానికే ప్రాధాన్యమివ్వాలి. అదే కాదు కాలినడకన వెళ్లే వీలున్న ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు.
 
ఆరోగ్యకర ఆహారం
బరువు పెంచకుండానే శరీరానికి కావలసిన శక్తినంతా ఇచ్చే ఆహారపదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. అలాంటి వాటిల్లో ఆకుకూరలు ముఖ్యమైనవి. పండ్ల రసాలు కాకుండా, పండ్లు తినడం మేలు. షుగర్‌ ఎక్కువగా ఉండే ఇతర పానీయాలకు దూరంగా ఉండడమూ ముఖ్యమే. శుద్ధిచేసిన ఆహార పదార్థాలను, పిండిపదార్థాలను వాడకూడదు.
 
ఉప్పు ఎక్కువగా వాడితే, శరీరంలో నీరు నిలిచిపోతుంది. దీని వల్ల గుండె మీద ఒత్తిడి పడుతుంది. అందువల్ల ఆయుర్వేద, మూలికా విధానాల్లోని ద్ర వ్యాలను ఉప్పునకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. గుండె సమస్యల్ని నివారించడానికి శరీరంలో కొలెస్ట్రాల్‌ నియంత్రించేలా మాంసాహారాన్ని, నూనెల వాడకాన్ని బాగా తగ్గించాలి. పీచుపదార్థం కోసం కీరా లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
 
రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రించే వారితో పోలిస్తే, రోజుకు 6 గంటలకన్నా తక్కువగా నిద్రించే వారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు రెట్టింపుగా ఉంటున్నాయని అధ్యయనాల్లో తేలింది. నిద్రాలోపాలు అంతర్గత వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు, రక్తపోటును పెంచి రక్తనాళాల్లో వాపు ఏర్పడటానికి కారణమవుతున్నాయి.
 
శరీరం బరువు పెరగడం వల్ల కదలికలు కష్టమవుతాయని మాత్రమే కాదు. ఆ కారణంగా పెరిగే కొలెస్ట్రాల్‌ అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు, రక్తనాళాల సమస్య కూడా తలెత్తుతుంది. అందువల్ల బాడీమాస్‌ ఇండెక్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.
 
రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగడం ఎవరికైనా తప్పనిసరి. ఎందుకంటే నీళ్లు రక్తాన్ని పలుచబరచడం ద్వారా రక్తం గడ్డలు ఏర్పడకుండా చేస్తాయి. ఫలితంగా గుండెపోటు సమస్యలు దాదాపు 54 శాతం దాకా తగ్గుతాయి.
 
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పొగతాగడం, మద్యం సేవించడం కొనసాగిస్తే ఏ ప్రయోజనమూ ఉండదు. గుండె జబ్బులకు దారి తీసే అతి పెద్ద కారణాలివి. ఇవి రక్తపోటును పెంచడమే కాకుండా, గుండె లయను అస్తవ్యస్తం చేస్తాయి. పక్షవాతానికి కారణమవుతాయి. అందువల్ల ఈ అలవాట్లను ముందు కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వచ్చి ఆ తర్వాత పూర్తిగా మానేయాలి.
 
ఉదయమో, సాయంత్రమో వ్యాయామాలేవో చేసినా, మిగతా రోజంతా కుర్చీల్లో ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం వల్ల నష్టమే జరుగుతుంది. ఆఫీసుల్లో అలా కూర్చునే వారు లేదా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్లు రక్తం గడ్డలు కట్టే డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌ సమస్య బారిన పడే ప్రమాదం ఉంది.
 
గుండెను దెబ్బ తీయడంలో మానసిక ఒత్తిళ్లు కూడా అతిపెద్ద కారణమే. మెలకువతో ఉన్న అన్ని గంటలూ, వృత్తిపరమైన విషయాల్లోనే తలమునకలు కావడంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అందువల్ల వృత్తికి సంబంధం లేని సంగీతం వినడం, సాహిత్యం చదవడం, ఆటలు ఆడడం వంటి ఇతర వ్యాపకాల్లో రోజూ కొంత సమయాన్ని వెచ్చించడం చాలా అవసరం.
 
దంతాల ఆరోగ్యం మొత్తం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. చిగుళ్ల వ్యాధులు ఉన్న వాళ్లు, గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఎక్కువ. నోటిలోని బ్యాక్టీరియా రక్తంలోకి వెళ్లి రక్తనాళ్లాల్లో వాపు ఏర్పడేలా చేస్తుంది. చివరికి ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి.