హార్ట్‌ ఎటాక్‌ రాకుండా ఉండాలంటే ఏ నూనె మంచిది?

25-10-2019:

ప్రశ్న: వెజిటబుల్‌ ఆయిల్స్‌లో కొలెస్ట్రాల్‌ ఉండదు కదా! సో... ఎంత తిన్నా గుండెకు పర్వాలేదా? ఏ ఆయిల్‌ హార్ట్‌ ఎటాక్‌ రాకుండా చేస్తుందో చెప్పండి. మా ఇంట్లో గత ఐదు తరాల నుంచి హార్ట్‌ ఎటాక్‌ చరిత్ర ఉంది.

-కిరణ్‌, విజయవాడ

 

 
డాక్టర్ సమాధానం: వెజిటబుల్‌ ఆయిల్స్‌లో కొలెస్ట్రాల్‌ ఉండదనేది కరెక్టే కానీ అతిగా ఆయిల్స్‌ (కొవ్వు పదార్థం) తీసుకుంటే శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో. దీనివల్ల ఉదర భాగంలో ఉన్న ఆర్గాన్స్‌కి ప్రమాదమే. ప్రత్యేకంగా ఒక ఆయిల్‌ తీసుకుంటే హార్ట్‌ ఎటాక్‌ రాదనేది ఏమీ లేదు. హార్ట్‌ ఎటాక్‌ రాకుండా ఉండాలంటే చాలా పద్ధతులు పాటించాలి. అవి ఏమిటంటే...
 

ఆయిల్స్‌ రెండు మూడు రకాలు వాడాలి. ఉదాహరణకు పప్పులో ఒక ఆయిల్‌, కర్రీ కోసం ఒక ఆయిల్‌... ఇలా వాడితే మంచిది. ఏ ఆయిల్‌ వాడినా రోజుకు 30 గ్రాములకు మించకుండా ఉండాలి. రిఫైండ్‌ ఆయిల్స్‌ తక్కువగా వాడితే మంచిది. 

బేకరీ ఫుడ్‌, బిస్కట్లలో హైడ్రోజినేటేడ్‌ ఆయిల్‌ (వనస్పతి, మర్గిరిన్‌ వంటివి) వాడతారు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

వారానికి రెండు లేదా మూడుసార్లు వైట్‌ ఫ్యాటీ ఫిష్‌ తినాలి.

శాకాహారులు బాదం, అవిసెలు క్రమం తప్పకుండా తినొచ్చు. ఏదైనా సరే మోతాదు మించకూడదు.

ఉప్పు ఒక టీ స్పూను కన్నా ఎక్కువ వాడకూడదు. నిల్వ ఉన్న ఆహారపదార్థాల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని తగ్గించాలి.

చక్కెర రెండు స్పూన్ల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అధిక చక్కెర ఉన్న పదార్థాలు క్యాలరీలను పెంచుతాయి. అందుకే స్వీట్స్‌, చక్కెర ఉన్న పదార్థాలను బాగా తగ్గించాలి.

రోజుకు 500 గ్రాములకు మించి పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

ప్రతీరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్‌ చేయాలి.కంటినిండా నిద్ర పోవాలి.

ప్రతి చిన్న దానికి బీపీ పెంచుకుని, లేనిపోని తగాదాలు, చర్చల అవసరం లేదని గుర్తించాలి. 

ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే ప్రతి కష్టానికి విరుగుడు దొరుకుతుంది. రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేయాలి.

మీ శరీరంలో జరిగే మార్పులు గమనిస్తూ ఉండాలి. వాటికి తగిన విధంగా జీవనవిధానం మార్చుకోవాలి.

తగిన బరువును మెయింటెయిన్‌ చేయాలి.


డాక్టర్ బీ.జానకి, న్యూట్రిషనిస్ట్