శారీరక దారుఢ్యం లేకున్నా..

ఆంధ్రజ్యోతి(23-10-2016): శారీరక దారుఢ్యంతో ఉన్నవారి చెంతకు గుండె జబ్బులు దరిచేరవన్న అపోహలకు ఇక చెక్ పెట్టాల్సిందే. ఎందుకంటే శారీరకంగా బలహీనంగా ఉన్నా గుండె జబ్బుల నుంచి రక్షించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. సగటు ఆరోగ్యవంతుడైన వ్యక్తితో పోలిస్తే 20 శాతం తక్కువ ఆరోగ్యవంతుడైన వ్యక్తి కూడా హృద్రోగాలకు కారణమవుతున్న డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ వంటివాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నట్టు వెల్లడైంది. రోజూ వ్యాయామం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది నిజంగా శుభవార్తేనని అధ్యయనానికి సారథ్యం వహించిన కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేనియల్ కర్నియర్ పేర్కొన్నారు. ఇటువంటి జబ్బుల నుంచి బయటపడేందుకు పెద్ద పెద్ద వ్యాయామాలు చేయాల్సిన పనిలేదని, కొద్దిపాటి ఎక్సర్‌సైజ్‌తోనే వాటిని తప్పించుకోవచ్చని ఆయన తెలిపారు. గుండె జబ్బులతో బాధపడుతున్న 205 మంది పురుషులు, 44 మంది మహిళలపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టు ఆయన వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్టు వారానికి 150 నిమిషాల సాధారణ వ్యాయామం, లేదంటే 75 నిమిషాల పాటు వ్యాయామం తీవ్రంగా చేయడం ద్వారా హృద్రోగ ముప్పు నుంచి బయటపడవచ్చని అధ్యయనకారులు వివరించారు.