రెండు పెగ్గుల కన్నా ఎక్కువయితే రిస్కే!

రెండు పెగ్గులు పర్వాలేదు. డాక్టర్లు చెప్పే మాట కూడా అదే. కానీ రెండు పెగ్గుల కన్నా మించితే స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. మధ్యవయస్సులో ఉన్న వారు రెండు  పెగ్గుల కన్నా ఎక్కువ తీసుకుంటే స్ట్రోక్‌ రిస్క్‌ పెరుగుతున్నట్లు ఈ స్టడీలో తేలింది. డయాబెటిస్‌, అధిక రక్తపోటు కన్నా ఈ రిస్క్‌ ఎక్కువగా ఉంది. సుమారు 12 వేల మంది మధ్య వయస్సు గల వారిని తీసుకుని వారి లైఫ్‌స్టయిల్‌ ఫ్యాక్టర్స్‌, ఆల్కహాల్‌ తీసుకోవడం, స్ట్రోక్‌ రిస్క్‌ వంటి అంశాలను విశ్లేషించారు. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

తక్కువ తాగే వారితో పోల్చితే రెండు పెగ్గుల కన్నా ఎక్కువ తీసుకునే వారిలో 34 శాతం స్ట్రోక్‌ రిస్క్‌ పెరిగింది. అంతేకాకుండా వాళ్లు 60 నుంచి 75 ఏళ్ల వయస్సు వచ్చే సరికి ఆ రిస్క్‌ డబుల్‌ అవుతోంది. యాభై, ఆరవై ఏళ్ల వయసులో ఎక్కువ తాగితే తరువాత ఐదేళ్లలో స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్‌, హైబీపీ కన్నా మద్యం అధికంగా తీసుకోవడం వల్ల రిస్క్‌ ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో నిర్ధారణ అయింది. లైఫ్‌స్టయిల్‌, జన్యుపరమైన అంశాల కన్నా ఆల్కహాల్‌ స్ట్రోక్‌ రావడానికి ప్రధాన కారణమవుతున్నట్లు తేలింది. మొత్తంగా ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే మధ్య వయస్సు వాళ్లు రోజూ రెండు పెగ్గులకు మించి తీసుకోకుండా ఉండటం ద్వారా స్ట్రోక్‌ రాకుండా కాపాడుకోవచ్చు.