హైదరాబాద్‌లో కరోనా?

 

ఇద్దరు విదేశీయులకు పాజిటివ్‌ గుర్తింపు.. నిర్ధారణ కోసం పుణెకు రక్త నమూనాలు
ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సలు
కరోనా లక్షణాలతో చిన్నారిని చేర్చుకున్న
ప్రైవేటు ఆస్పత్రిపై ఉన్నతాధికారుల ఆగ్రహం
గాంధీ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌
 
గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ రోగుల కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మూడు షిప్టుల్లో ముగ్గురు సిబ్బంది పనిచేస్తారు. రోగులను నేరుగా లిఫ్టులో ఏడో అంతస్తుకు తీసుకెళ్లి ఐసొలేషన్‌వార్డులో చేర్పించడమే వీరి పని. బయటి వ్యక్తులకు సమాచారం ఇవ్వరు.
 
అడ్డగుట్ట, గోల్నాక/హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఇద్దరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఇద్దరూ 33 ఏళ్లలోపు విదేశీయులే. వీరు నగరంలోని ఓ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో భాగంగా ఇటీవలే వీరిద్దరూ చైనా వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉంటున్నారు. దాంతో, పరీక్షలు చేయించుకోవాలని చుట్టుపక్కల వారు సూచించారు. వారు ఆస్పత్రికి వెళ్లారు. కరోనా వైరస్‌ అనుమానంతో ఆస్పత్రిలో చేరిన ఇద్దరి నమూనాలను సేకరించారు. పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలినట్లు సమాచారం. దాంతో, ఆందోళన చెందిన వైద్యులు నిర్ధారణ చేసుకోవడానికి మరోసారి అనుమానితుల నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతానికి వారిని ఐసొలేషన్‌వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, కరోనా వైరస్‌ లక్షణాలతో ఆరు నెలల చిన్నారి ఒకరిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, కరోనా వైరస్‌ లక్షణాలతో ఎవరు వచ్చినా గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించిందని, ఈ మేరకు ఐసొలేషన్‌ వార్డులను కూడా ఏర్పాటు చేసిందని, అటువంటప్పుడు కరోనా వైరస్‌ లక్షణాలతో వచ్చిన రోగిని మీరు ఎలా చేర్చుకుంటారని సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని గాంధీ ఆస్పత్రి ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, సదరు చిన్నారికి కరోనా లేదని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం.
 
కరోనా అనుమానితులు 16 మంది
 
కరోనా వైరస్‌ అనుమానిత కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క గురువారమే గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో 16 మంది చేరారు. గాంధీలో తొమ్మిదిమంది, ఫీవర్‌ ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో నలుగురు మహిళలున్నారు. ఫీవర్‌ ఆస్పత్రిలో చేరిన ఏడుగురూ చైనీయులే. వీరంతా బంజారాహిల్స్‌లో ఓ కంపెనీని నిర్వహిస్తున్నారు. జనవరిలో చైనా వెళ్లి వారం రోజుల కిందటే తిరిగి వచ్చారు. ఫీవర్‌ ఆస్పత్రి వైద్యులు రక్త నమూనాలను తీసుకుని పరీక్షల నిమిత్తం వారిని గాంధీ ఆస్పత్రికి పంపారు. అటు ఫీవర్‌, ఇటు గాంధీ ఆస్పత్రుల్లో కరోనా అనుమానిత లక్షణాలతో చైనీయులు ఎక్కువగా చేరుతుండడంతో ఆందోళన నెలకొంది.
 
నిర్ధారణ కాకుండానే గాయబ్‌
 
కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చేరినట్లే చేరి వెళ్లిపోతున్నారు. సిబ్బంది వారి రక్త నమునాలను సేకరించిన తర్వాత చెప్పా పెట్టకుండానే వెళ్లిపోతున్నారు. పరీక్షలు చేయించుకున్నవారు.. నివేదిక వచ్చే వరకూ ఉండడం లేదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఫీవర్‌ ఆస్పత్రికి ఇప్పటి వరకూ వచ్చిన అనుమానిత కేసుల నివేదికలన్నీ నెగెటివ్‌ రావడం ఊరటగా చెబుతున్నారు. ఆస్పత్రికి 32 మంది అనుమానితులు వచ్చారని, వారిలో 21 మందికి రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయని, 11 మంది రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు. కానీ, బీజింగ్‌ నుంచి వచ్చిన ఇద్దరి నమూనాలు సేకరించిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉండకుండా వెళ్లిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. చైనీయులకు ఇక్కడి భాష రాకపోవడం సమస్యగా మారిందని చెబుతున్నారు. చైనాకు వెళ్లి వచ్చిన వారితో మాట్లాడించి.. సైగలతో వారు ఏం చెబుతున్నారో అవగాహన చేసుకుంటున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.