చంటి బిడ్డలా సాకుదాం!

ఆంధ్రజ్యోతి (03-12-2019): కనిపించినవన్నీ నోట్లో పెట్టుకుంటారు. ఆదమరిస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. తిండి తినకుండా మొండికేస్తారు. అరుస్తారు, ఏడుస్తారు, కొడతారు! ...ఇలా ప్రవర్తించేది పిల్లలే అనుకుంటే పొరపాటు! వృద్ధులైన డిమెన్షియా వ్యాధిగ్రస్తులదీ ఇదే ధోరణి!ఒక రకంగా వాళ్లూ పసిపిల్లలే! ఇలాంటి వారి బాగోగులు చూసేవాళ్లు వారితో ఎలా మెలగాలి? వారి ప్రవర్తనలను ఎలా అర్థం చేసుకోవాలి?

 
డిమెన్షియా, అల్జీమర్స్‌... రెండూ మతిమరుపు రుగ్మతలే అయినా రెండిటికీ తేడా ఉంది. జ్ఞాపకశక్తి తగ్గడం, రోజువారీ పనులను తమంతట తాము చేసుకోలేకపోవడం, భావసమాచారంలో లోపాలు డిమెన్షియా కోవలోకి వస్తాయి. అల్జీమర్స్‌ కూడా డిమెన్షియాలో ఆ భాగమే! అయితే వయసు పెరిగేకొద్దీ అల్జీమర్స్‌ మరింత తీవ్రమవుతూ జ్ఞాపకశక్తితో పాటు, ఆలోచించే విధానాన్నీ, భాషనూ కూడా ప్రభావితం చేస్తుంది. డిమెన్షియా, అల్జీమర్స్‌... రెండూ వృద్ధాప్యంలో వేధించే చిత్రమైన సమస్యలు.
ఈ సమస్యలతో బాధపడేవారి కంటే, వారి బాగోగులు చూసుకునేవారికి డిమెన్షియా ఓ అగ్ని పరీక్ష. వారి సహనానికి అంతకు మించిన పరీక్ష. అయితే ఈ రుగ్మత కలిగిన వారితో మెలిగే విధానం, వారి ప్రవర్తనలకు తగ్గట్టు స్పందించడం ఎలాగో తెలుసుకోవాలి. అప్పుడే వ్యాధిగ్రస్తులతో పాటు, వారి కేర్‌ టేకర్స్‌, కుటుంబసభ్యులు కూడా నాణ్యమైన జీవితాన్ని గడపగలుగుతారు.
 
ప్రవర్తనలను బట్టి....
నలుదిక్కలా ఒకే రకమైన దారులు కనిపిస్తే, ఏ దారి సరైనదో తెలుసుకోలేక ఆయోమయానికీ, అసహనానికీ లోనవుతాం. డిమెన్షియా వ్యాధిగ్రస్తుల స్థితి ఇలాంటిదే! కాబట్టి వారిని చేయి పట్టి నడిపించవలసిన బాధ్యత మనదే! అయితే వ్యాధిలో భాగంగా వీరిలో పలురకాల వింత ప్రవర్తనలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రవర్తనలకు సున్నితంగా స్పందిస్తూ, పరిస్థితిని మన చేతుల్లోకి తీసుకుని, లౌక్యంగా మసలుకోవాలి!
 
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంటే?: అలా జరుగుతుంది కదా అని వారిని గదిలో బంధించకూడదు. తలుపులకు తాళాలు వేయడం లాంటివీ చేయకూడదు. అంటే.. తమను బంధిస్తున్నట్టు వారు గ్రహించేలా ప్రవర్తించకూడదు. అలాగని వారికి ఎల్లవేళలా కాపలా ఉండడం కూడా కుదరదు కాబట్టి, డిమెన్షియా ఉన్నవారు స్వేచ్ఛగా తిరగగలిగేటంత విశాలంగా నివాసం ఉండేలా చూసుకోవాలి. ఇంటి గేటుకు తాళం వేసి పెట్టాలి. అవసరాన్నిబట్టి జిపిఎస్‌ ట్రాకింగ్‌ పరికరాలను ఉపయోగించాలి. వారి పేరు, రుగ్మత, ఇంటి అడ్రస్‌ వివరాలున్న లాకెట్‌ను వారి మెడలో వేలాడదీయాలి.
 
అనుమానిస్తూ ఉంటే?: భోజనంలో ఏదో కలిపామనే అనుమానంతో తమ బాగోగులు చూసుకునేవాళ్లనే అనుమానించే వారూ ఉంటారు. ఇలాంటప్పుడు ఇంట్లో వారికి ఇష్టమైన వ్యక్తులతో భోజనం పెట్టించాలి. కుటుంబసభ్యులు అందరితో పాటు, వారికీ భోజనం పెట్టాలి. ‘‘మేం అందరం అదే తింటున్నాం, నీకూ అదే పెడుతున్నాం. కాబట్టి భోజనం సురక్షితమైనదే’’ అన్నట్టు ప్రవర్తించాలి.
 
భ్రమలకు లోనవుతూ ఉంటే?: ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు. వస్తువులను గుర్తుపట్టలేక, పొరపాటు పడుతూ ఉంటారు. ఈ భ్రమలను తేలికగా తీసుకూడదు. వారికి కనిపిస్తున్నది వారి దృష్టిలో వాస్తవం. కాబట్టి తేలికగా తీసుకోకుండా, వారి భ్రమలను మాటలతో దూరం చేయాలి. దుప్పటి మీద పురుగులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తే, ’‘అలాగా, దులిపితే వెళ్లిపోతాయి’’ అంటూ దుప్పటి దులపాలి.
 
కోపం తెచ్చుకుని, అరుస్తుంటే?: డిమెన్షియా వ్యాధిగ్రస్తులు తమ ప్రపంచానికి విరుద్ధమైన దేన్నీ తట్టుకోలేరు. తమకు జ్ఞాపకశక్తి లోపం ఉందనే విషయాన్ని ఎత్తి చూపే ఏ పరిస్థితినీ ఓర్చుకోలేరు. అలాగే తాము అనుకున్నది చేయడానికి అడ్డొచ్చే ఏ అవరోధాన్నీ సహించలేరు. అలాంటప్పుడు కోపం తెచ్చుకుని, అరుస్తారు. కాబట్టి కారణాన్ని కనిపెట్టి ప్రతికూల అంశాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలి! అయితే హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడుకోవచ్చు.
 
భోజనం చేయకపోతూ ఉంటే?: కొందరు ఇతర కుటుంబసభ్యులు ఉన్నారనే విషయం ఆదమరిచి, భోజనం గిన్నెలు అన్నీ ఖాళీ చేసేస్తారు. ఇంకొందరు పూర్తిగా భోజనమే మానేస్తూ ఉంటారు. ఈ రెండు పరిస్థితులోనూ ఎంతో జాగ్రత్తగా మెలగాలి. ఇతరులను పట్టించుకోకుండా ఉన్నదంతా తినేసేవారికి ఒకేసారి ఎక్కువ మొత్తంలో భోజనం పెట్టకుండా, దాచి ఉంచి, విడతలవారీగా పెడుతూ ఉండాలి. భోజనమే మానేసేవారికి పిల్లలకు నచ్చచెప్పి పెట్టే విధంగా, ‘‘ఈ పదార్థం తిన్నావంటే, నీకిష్టమైన పని చేద్దాం’’ అంటూ వారు చేయడానికి ఇష్టపడే పనుల పట్ల ఆశ చూపాలి.
 
కాలకృత్యాలు: కొందరికి మలమూత్రాల మీద నియంత్రణ పోతుంది. మరికొందరికి అందుకోసం టాయ్‌లెట్‌ వాడాలనే ఆలోచన రాదు. ఇంట్లో తమకు తోచిన చోట చేసేస్తూ ఉంటారు. ఇలా నియంత్రణ లేని వారికి అడల్ట్‌ డయాపర్లు వాడాలి. టాయ్‌లెట్‌ ఎటు ఉందో మర్చిపోయేవారికి, ఎర్రని బాణం గుర్తులతో మార్గనిర్దేశం చేయాలి. టాయ్‌లెట్‌ సీటు వారికి ఇష్టమైన రంగులో ఉంటే మరీ మేలు!
 
దుస్తులు తీసేస్తూ ఉంటే?: తేలికగా ఉంటుంది కదా అని నైట్‌ డ్రస్‌ వేస్తే, దాన్ని తీసి గిరాటేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వారికి ఇష్టమైన దుస్తులే వేస్తూ ఉండాలి. అలవాటు లేని, ఇష్టం లేని దుస్తులు వేస్తే, వాటిని డిమెన్షియా వ్యాధిగ్రస్తులు ఉంచుకోలేరు.
 
గ్రూపుగా ఏర్పడండి!
డిమెన్షియా వ్యాధిగ్రస్తుల బాగోగులు చూసేవాళ్లు, సపోర్టివ్‌ గ్రూప్స్‌ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. సలహాలు పొందడానికి, ఒకరికొకరు ఆసరాగా నిలవడానికి ఈ గ్రూప్స్‌ దోహదపడతాయి. అలాగే కేర్‌ టేకర్స్‌ కోసం గూగుల్‌ ప్లేలో రకరకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా కేర్‌ గివర్స్‌ ఉపయోగాలు
పొందవచ్చు.
 
వారి ప్రపంచంలోకి వెళ్లాలి!
మనమెలా కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని బలంగా నమ్ముతామో, డిమెన్షియా ఉన్న వ్యక్తులు కూడా వారు ఊహల్లో బ్రతుకుతున్న ప్రపంచమే వాస్తవమైనది అనే దృఢమైన నమ్మకంతో ఉంటారు. అయితే ఆ వాస్తవానికీ ఎదురుగా జరుగుతున్న సంఘటనలకూ, కనిపిస్తున్న దృశ్యాలకూ పొంతన కుదరకపోవడంతో అసహనానికి లోనవుతారు. అయితే వారు వ్యక్తపరిచే భావోద్వేగాలు, ప్రవర్తన, మాటల ఆధారంగా వారు ఏం కోరుకుంటున్నారో, అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, ఏం చెప్పదలుచుకుంటున్నారో తేలికగా అర్థం చేసుకోగలగాలి. అందుకు తగ్గట్టు, మనం వారి ప్రపంచంలోకి వెళ్లి వారితో మెలగాలి.
 
ఎలా మాట్లాడాలంటే...
సరళమైన భాషలో: డిమెన్షియాతో బాధపడుతున్నవారిని ఒకసారికి ఒకే ప్రశ్న అడగాలి. ఒకటికి మించి ప్రశ్నలను కలిపి అడగకూడదు.
 
అవును, కాదు: ‘భోజనంలో ఏం తిన్నావు?’ అని కాకుండా, ‘‘భోజనం నీకు నచ్చిందా?’’ అని అడగాలి. ‘‘అవును లేదా కాదు’’ అనే సమాధానాలు పొందేలా మీ ప్రశ్నలు ఉండేలా చూసుకోవాలి.
 
ఓర్పు అవసరం: డిమెన్షియా ఉన్న వ్యక్తులకు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగించాలి. అంతే తప్ప, ఒత్తిడికి లోను చేయకూడదు. వారి ప్రవర్తనతో చీకాకు, కోపం తలెత్తితే, స్వల్ప సమయం పాటు బ్రేక్‌ తీసుకుని, తిరిగి పూర్వపు ఓర్పును ప్రదర్శించండి.
 
నేర్పు అవసరం: కొన్ని ప్రశ్నలకు సమాధానాలు సూటిగా కాకుండా, నేర్పుగా చెప్పాలి. ఉదాహరణకు... ‘‘మా అమ్మ ఎక్కడుంది?’’ అని అడిగినప్పుడు ‘‘20 ఏళ్ల క్రితమే చనిపోయింది’’ అని చెబితే వారిలో అనవసరపు ఆందోళన తలెత్తుతుంది. కాబట్టి ‘ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు’ అని నేర్పుగా చెప్పండి.
 
మెలకువలు: డిమెన్షియా ఉన్న వ్యక్తిని ఆకర్షించడం కోసం మాట్లాడేటప్పుడు చూపులు కలపడం, చిరునవ్వు నవ్వడం, చేతులు కదిలించడం, తాకడం లాంటి మెలకువలు అలవరుచుకోవాలి.
 
కూడని మాటలు: ‘‘నీకు గుర్తుందా? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. మర్చిపోయావా? ఆ విషయం నీకెందుకు తెలియదు?’’ ఇలా వారిని మరింత నిస్సహాయతకు లోను చేసే మాటలు మాట్లాడకూడదు.
 
పెద్ద సంభాషణలు వద్దు!: ఒకేసారి పది వాక్యాల్లో పట్టేటంత పెద్ద సంభాషణలు చేయకూడదు. బదులుగా తక్కువ పదాలతో కూడిన ఏక వాక్య ప్రయోగాలు చేయాలి.
 
నిస్సహాయతను గుర్తు చేయకూడదు: ‘నీకు ఇందాకే చెప్పాను కదా?’’ లాంటి మాటలతో వారి సమస్యను పదే పదే గుర్తు చేయకూడదు.
 
నిర్దిష్టంగా చెప్పాలి!: అక్కడ, అది, అవి, అతను, ఆమె అనే సర్వనామాలకు బదులు నేరుగా నామవాచకాలనే సంభాషణలో వాడాలి. ఉదాహరణకు... ‘‘అక్కడ కూర్చో’’ అనడానికి బదులు నిర్దిష్టంగా ‘‘ఆ ఎర్ర కుర్చీలో కూర్చో’’ అని చెప్పాలి.
 
హేళన కూడదు: వ్యంగ్యంగా, హేళనగా, హాస్యంగా డిమెన్షియా ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడకూడదు. ఇలా చేస్తే వారు అయోమయానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది. మనసు చిన్నబుచ్చుకునే అవకాశమూ ఉంటుంది.
 
- డాక్టర్‌ టి.సూర్య ప్రభ
న్యూరాలజిస్ట్‌, నిమ్స్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌