డెంగీ కిట్లేవీ?

సర్కారీ ఆస్పత్రుల్లో కొరత
18,500 కిట్లే పంపిణీ.. 2.5 లక్షల కిట్లకు డిమాండ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డెంగీ తీవ్రత పెరుగుతోంది. ఆస్పత్రులకు రోగుల తాకిడి కూడా ఎక్కువవుతోంది. ఒక్క ఖమ్మం ఆస్పత్రిలోనే ఈ నెల 1 నుంచి శుక్రవారం సాయంత్రం దాకా 1,700 మంది డెంగీ లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహించగా 740 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. ఇక్కడే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఏస్థాయిలో ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు! ఇందుకు తగ్గట్లుగా డెంగీ పరీక్షలు చేసే కిట్లు మాత్రం అందుబాటులో లేవు. కొన్ని ఆస్పత్రుల్లోనైతే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. డెంగీ నిర్ధారణకు ప్రస్తుతం ఎన్‌ఎ్‌స 1, ఐజీఎమ్‌, ఐజీజీ కిట్లను వాడుతున్నారు. ఈ సీజన్‌ ప్రారంభమైన తర్వాత 18,500 కిట్లను మాత్రమే పంపిణీ చేశారు. ఎన్‌ఎ్‌స 1 కిట్లు 1,300, ఐజీమ్‌ కిట్లు 9,600, ఐజీజీ 7,680 కిట్లు వాడినట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల్లో తేలింది. ఇవికాకుండా ఒకసారి వాడే కాంబో ప్యాక్‌ కిట్లు 1000 వరకు వాడారు. వాస్తవానికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా చేసే పరీక్షల్లో కచ్చితత్వం ఉండదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎలీసా కిట్లు ఉపయోగించడమే మేలని చెబుతున్నారు. ర్యాపిడ్‌లో అయితే ఎన్‌ఎ్‌స 1 మాత్రమే వస్తుంది. ఇందులో కచ్చితత్వం ఉండదన్నది వైద్యుల అభిప్రాయం. కరెక్టుగా తెలియాలంటే ఐజీఎమ్‌ కిట్లు వాడాలి. ప్రస్తుతం నమోదవుతోన్న కేసుల్ని బట్టి ఐజీఎమ్‌ కిట్ల సరఫరాను మరింత పెంచాలని వైద్యులు చెబుతున్నారు. రోగుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని తమకు 2.5లక్షల కిట్లు కావాలని సర్కారుకు జిల్లా ఆస్పత్రులు ఇండెంట్‌ పెట్టాయి.

కిట్ల ఎక్స్‌పైరీ లైఫ్‌ తక్కువ
డెంగీ నిర్ధారణకు అవసరమయ్యే కిట్ల ఎక్స్‌పైరీ లైఫ్‌ మూడు నెలలే. అందుకే కంపెనీలు కూడా వాటిని ఎక్కువగా తయారు చేసి పెట్టుకోవు. ఒక్కసారిగా అంచనాలకు మించి కిట్లు అవసరం పడటంతో తాత్కాలికంగా వీటి కొరత ఏర్పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
 
నిలోఫర్‌లో లేవు!
రాష్ట్రంలో చిన్నారుల పెద్దాస్పత్రిగా భావించే నిలోఫర్‌ ఆస్పత్రిలో డెంగీ నిర్ధారణ కిట్స్‌ అందుబాటులో లేవంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి అక్కడ ఎన్‌ఎ్‌స 1 కిట్లు లేవు. అలాగే సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్‌ మిషన్‌(ఎస్డీపీ) ద్వారా ప్లేట్‌లెట్‌ ఎక్కించే కిట్స్‌ అందుబాటులో లేవు. దాంతో ఎస్డీపీ మిషన్‌ను వాడటం లేదు. కాగా ఉస్మానియా ఆస్పత్రిలో ఎలీసా కిట్ల కొరత లేదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు.