ఏ కల వస్తే... ఏంటి?

13-03-2018: కలలు నిజమవుతాయో లేదోగానీ, వాటిలో మాత్రం లోతైన అర్థాలు దాగుంటాయి. తరచుగా మనకొచ్చే కలల్ని విశ్లేషిస్తే మనకు తెలియకుండా మనలో దాగి ఉన్న భావోద్వేగాలు, భయాలు బయల్పడతాయి. ఉదాహరణకు....

గాల్లో ఎగరటం: ఆకాశంలో ఎగురుతున్నట్టు కల వస్తే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని, లేదా జీవితంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థం.
 
ఎత్తు నుంచి పడిపోవటం: ఎత్తు నుండి పడిపోతున్నట్టు కల వస్తే, ఏ విషయం మీదో పట్టు సాధించాలనే మీ ప్రయత్నానికి సూచన.
 
ఎవరో తరుముతున్నట్టు: జీవితంలో ఎదురయ్యే కష్టాలు, లేదా సమస్యల గురించి భయపడుతూ ఉంటే ఇలాంటి కలలొస్తాయి. ఆ భయాల్ని, సమస్యల్ని ఎదురించటం కోసం వెంటనే సిద్ధం కండి.
 
నగ్నంగా: ఇది మీలోని భయానికి, అభద్రతాభావానికి సూచన.
 
చనిపోయినట్టు: చనిపోయినట్టు కల వస్తే, నిజంగానే చనిపోతామని అర్థం కాదు. మీ జీవితంలో ఒక అంకం లేదా ఒక బంధం ముగిసిపోతున్నందుకు సూచనే ఈ కల.
 
మంటలు: రగిలే మంటలు కలలోకొస్తే ఏదో మార్పు జరగబోతోందని అర్థం.
 
గర్భం దాల్చినట్టు: ఇది గొప్ప ఎదుగుదలకు, మార్పునకు సూచన.
 
నీళ్లు: నీళ్లు శుభ్రతకూ, కల్మషాలు, మలినాలు తొలగిపోవటానికీ సూచన.
 
డబ్బు: మన మనస్తత్వంలోని లోపాలకు ప్రతిబింబాలే డబ్బులు.
 
అక్రమ సంబంధం:మీలో అణగదొక్కిన లైంగిక వాంఛలు, జీవిత భాగస్వామితో ఆనందంగా లేకపోవటం, స్వీయ విలువ తగ్గినట్టు భావించటం ఈ కలలకు కారణాలు.
 
కలలు మన ఆలోచనలకు ప్రతిబింబాలు. మెదడు లోతుల్లోని భావాలను విప్పి చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటిని వినగలిగితే మనకు మనం స్పష్టంగా అర్థమవుతాం, మనం నడవవలసిన దారీ కనిపిస్తుంది. కాబట్టి కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం నిద్ర లేవగానే కలను గుర్తు తెచ్చుకుని విశ్లేషించే ప్రయత్నం చేయాలి. ఆలస్యం చేస్తే కలలను మర్చిపోతాం! వీలైతే కలల కోసం ఒక డైరీ కేటాయించాలి.